వేంకటేశ్వరునిపై కొడాలి నాని వ్యాఖ్యలపై శ్రీనివాసానంద కన్నీళ్లు..
- IndiaGlitz, [Monday,September 21 2020]
వేంకటేశ్వర స్వామిపై మంత్రి కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాఖ్యలు రాష్ట్ర వ్యాప్తంగా పెను దుమారాన్నే రేపుతున్నాయి. ఈ వ్యాఖ్యలపై తీవ్ర స్థాయిలో వ్యక్తమవుతున్నాయి. ఈ వ్యాఖ్యలను గుర్తు చేసుకుంటూ శ్రీనివాసానంద స్వామి కంటతడి పెట్టుకున్నారు. కొడాలి నాని వ్యాఖ్యలపై ఆయన తీవ్ర ఆవేదనకు గురయ్యారు. తక్షణమే
హిందూవులకు మంత్రి కొడాలి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.
ఒకవేళ మంత్రి క్షమాపణ చెప్పపోతే... ముఖ్యమంత్రి జగన్ అయినా ఆయన చేత క్షమాపణ చెప్పించాలని డిమాండ్ చేశారు. హిందూవుల మనోభావాలు దెబ్బతీసిన మంత్రి వెంటనే రాజీనామా చేయాలన్నారు. ముఖ్యమంత్రి స్పందించక పోతే... తీవ్ర స్థాయిలో ఉద్యమిస్తామని శ్రీనివాసానంద స్పష్టం చేశారు. నాని వ్యాఖ్యలపై ప్రభుత్వం వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. బాధ్యతా రాహిత్యంతో వ్యాఖ్యలు చేసిన మంత్రి కొడాలి నాని పై కేసులు పెట్టాలన్నారు. హిందూ ధర్మ పరిరక్షణ కోసం పార్టీల అతీతంగా అందరూ స్పందించాలని శ్రీనివాసానంద కోరారు.
కాగా.. తిరుమల డిక్లరేషన్‌పై కొడాలి నాని మాట్లాడుతూ.. ‘‘వేరే మతం వాళ్లు సంతకం పెట్టకుండా వెళితే దాని పవిత్రత దెబ్బ తింటుందనా? ఆచారం అంటే ఏంటి? వేరే మతం వాళ్లు వేంకటేశ్వర స్వామిని నమ్మి.. ఆ గుడికి వెళ్ళి.. సంతకం పెట్టకుంటే ఆ గుడి అపవిత్రమై పోతుందా? వేంకటేశ్వర స్వామికేమైనా అపచారం జరుగుతుందా? నేను మనసులో వేంకటేశ్వరస్వామిని నమ్ముకుని.. సంతకం పెట్టకుండా గుడిలోకి వెళితే గుడి మొత్తం అపవిత్రమై పోతుందా? హిందువులు సంతకం పెట్టకుండా వెళితే ఆ గుడి అంతా పవిత్రంగా ఉంటుందా? ఇవన్నీ ఎవరికి ఉపయోగం? ఆంజనేయ స్వామి చెయ్యి విరగ్గొడితే.. ఆయనకు పోయేదేం లేదు. అలాగే ఆ గుడికి వచ్చే లాస్ ఏం లేదు. 10 కేజీల వెండి ఎత్తుకు పోయినా ఆరు లక్షలో.. ఏడు లక్షలో.. దాంతో మేడలు.. మిద్దెలు కట్టేదేం లేదు. అంతర్వేదిలో కోటి రూపాయల రథాన్ని తగులబెడితే ప్రభుత్వం రథాన్ని చేయిస్తుంది. దాని వల్ల దేవుడికి పోయేదేం లేదు’’ అని కొడాలి నాని పేర్కొన్నారు.