నేను అలా మాట్లాడి ఉండికూడదు....ఆ విషయంలో పూర్తిగా నా తప్పే - శ్రీనివాసరెడ్డి
Tuesday, November 15, 2016 తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com
Send us your feedback to audioarticles@vaarta.com
తనదైన శైలిలో నటిస్తూ...కమెడియన్ గా అందర్నీ ఆకట్టుకుని గీతాంజలి సినిమాతో హీరోగా పరిచయమైన కమెడియన్ టర్నడ్ హీరో శ్రీనివాసరెడ్డి. గీతాంజలి తర్వాత శ్రీనివాసరెడ్డి హీరోగా నటించిన తాజా చిత్రం జయమ్ము నిశ్చయమ్మురా. నూతన దర్శకుడు శివరాజ్ కనుమూరి ఈ చిత్రాన్ని శివరాజ్ ఫిల్మ్స్ బ్యానర్ పై స్వీయ నిర్మాణంలో తెరకెక్కించారు. శ్రీనివాసరెడ్డి, పూర్ణ జంటగా నటించిన ఈ చిత్రం సమైక్యంగా నవ్వుకుందాం అనే ట్యాగ్ లైన్, దేశవాళి ఎంటర్ టైన్మెంట్ అనే నినాదంతో ప్రేక్షకుల ముందుకు వస్తుంది. ఈనెల 25న జయమ్ము నిశ్చయమ్మురా చిత్రం రిలీజ్ కానుంది. ఇదిలా ఉంటే ఈనెల 16న శ్రీనివాసరెడ్డి పుట్టినరోజు. ఈ సందర్భంగా శ్రీనివాసరెడ్డితో ఇంటర్ వ్యూ మీకోసం...!
ఈ పుట్టినరోజు ప్రత్యేకత ఏమిటి..?
ఈ పుట్టినరోజు నిజంగానే నాకు చాలా చాలా స్పెషల్. ఎందుకంటే....ఈ సంవత్సరం (2016)లోనే ఇల్లు కట్టుకున్నాను. ఈ సంవత్సరంలోనే జయమ్ము నిశ్చయమ్ము ద్వారా హీరోగా పరిచయం అవుతున్నాను. క్యారెక్టర్ ఆర్టిస్టుగా కూడా ప్రేమమ్, అఆ...ఇలా సక్సెస్ ఫుల్ మూవీస్ లో నటించాను. సో....ఈ పుట్టినరోజు ఎప్పటికీ మరచిపోలేను.
గీతాంజలి సినిమాలో హీరోగా నటించారు కదా...! జయమ్ము నిశ్చయమ్ము ద్వారా హీరోగా పరిచయం అవుతున్నాను అంటున్నారేమిటి..? గీతాంజలి తర్వాత హీరోగా చేయడానికి ఇంత గ్యాప్ రావడానికి కారణం..?
గీతాంజలి సినిమాలో నేను హీరో అనుకోవడం లేదు. అందులో సపోర్టింగ్ క్యారెక్టర్ చేసాను అనుకుంటున్నాను. ఈ సినిమాలో ఫస్ట్ ఫ్రేమ్ నుంచి ఎండ్ ఫ్రేమ్ వరకు నాతోనే కథ నడుస్తుంటుంది. గీతాంజలి తర్వాత హీరోగా చేయడానికి గ్యాప్ అంటే....గీతాంజలి తర్వాత నేను ఓ 80 కథలు విన్నాను. అన్నీ కూడా హర్రర్ స్టోరీసే వచ్చాయి. ఈ కథ నా దగ్గరకి కాస్త లేటుగా వచ్చింది. అందుకే ఇంత లేట్ అయ్యింది. ఇక ఈ సినిమాలో నా క్యారెక్టర్ గురించి చెప్పాలంటే... సర్వమంగళం అనే క్యారెక్టర్ చేసాను. నా క్యారెక్టర్ అందరికీ నచ్చుతుంది అనేది నా గట్టి నమ్మకం.
జయమ్ము నిశ్చయమ్మురా కథ ఏమిటి..?
కరీంనగర్ అబ్బాయికి కాకినాడలో ఉద్యోగం వస్తుంది. అయితే...కాకినాడ నుంచి కరీంనగర్ కి ఎలా ట్రాన్సఫర్ చేయించుకున్నాడు. ఆ టైమ్ లో ఓ అమ్మాయి పరిచయం అయితే ఎలా ప్రేమలో పడ్డాడు. ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నాడు..? అనేదే ఈ కథ. భాగ్యరాజా, జంథ్యాల, వంశీ ల స్టైల్ లో ఉండే కామెడీ ఉంటుంది. చక్కటి ఆహ్లాదకరమైన సినిమా. కోర్టు సీన్ ఒకటి ఉంది. ఆ సీన్ కోసం కోర్టును పర్మిషన్ అడిగితే ఇవ్వలేదు. ఆ సీన్ నే సెట్ లో తీసాం. ఈ ఒక్క సీన్ తప్ప ఈ సినిమాలోని మిగిలిన సన్నివేశాలు అన్నింటిని ఓరిజినల్ లోకేషన్స్ లోనే చిత్రీకరించాం.
దేశవాళి వినోదం అంటున్నారు కదా...! దీనికి ప్రత్యేక కారణం ఏమైనా ఉందా..?
మన మూలాలు తెలియచేయడం కోసం దేశవాళి అనే పదం ఉపయోగించాం. ఈ సినిమాలో కామెడీ అనేది ఎక్కడి నుంచో కాపీ కొట్టింది కాదు.. ఇంకా చెప్పాలంటే... అరువు కాదు మనది అని తెలియచెప్పడం కోసమే అలా అన్నాం. ఇందులో కథలోంచి పుట్టిన కామెడీనే తప్ప కామెడీ అనేది సపరేట్ ట్రాక్ లా ఉండదు.
ట్రైలర్ లో 2013లో జరిగిన కథ అని చెప్పారు కదా...! ఈ కథ 2013లో రాసుకున్నారా..? లేక ఇప్పుడు రాసిందా..?
నిజంగానే 2013లో రాసుకున్న కథ ఇది. అందుకనే 2013లో రిలీజైన అత్తారింటికి దారేది సినిమాలో ఓ క్యారెక్టర్ ను పెట్టాం. ఎలాంటి ఇబ్బంది లేకుండా అందరికీ నచ్చుతుంది.
గీతాంజలి తర్వాత 80 హర్రర్ స్టోరీస్ విన్నాను అన్నారు కదా..! ఇక హర్రర్ మూవీస్ చేయకూడదు అనుకున్నారా..?
హర్రర్ మూవీస్ చేయకూడదు అని నిర్ణయం తీసుకోలేదు. కథ నచ్చితే తప్పకుండా చేస్తాను. గీతాంజలి తర్వాత ఓ హర్రర్ స్టోరీ నచ్చి సినిమా ప్రారంభించాం. నేను చేస్తున్న హర్రర్ మూవీ కథ అని బాగా తెలిసిన వ్యక్తికి చెబితే....నన్ను హర్రర్ స్టార్ అన్నాడు. ఓహో.. వరుసగా హర్రర్ మూవీస్ చేస్తే ఇలా అంటారన్నమాట అనుకున్నాను. అయితే...ఈ హర్రర్ మూవీ ఆగిపోయింది. నేను ఎలాంటి సినిమా చేస్తే బాగుంటుంది అని ఆలోచిస్తున్నానో సరిగ్గా అలాంటి కథే నా దగ్గరికి వచ్చింది. అదే జయమ్ము నిశ్చయమ్మురా.
జయమ్ము నిశ్చయమ్మురా కథ మీ దగ్గరికి ఎలా వచ్చింది..?
జె.డి చక్రవర్తి గారు ఈ కథకు నేనైతే బాగుంటుంది అని చెప్పారట. నేను జె.డి చక్రవర్తి గారితో కలిసి నటించలేదు. ఆయనతో నాకు పరిచయం కూడా లేదు. ఆయన ఈ కథకు నేను సూట్ అవుతాను అని చెప్పడంతో ఈకథ విన్నాను. ఇంతకు ముందు చెప్పినట్టుగా నేను ఎలాంటి కథ కోసం ఎదురుచూస్తున్నానో అలాంటి కథే నా దగ్గరకి రావడంతో రెండో ఆలోచన లేకుండా వెంటనే ఓకే చెప్పేసాను.
మీరు హర్రర్ మూవీలో చేసారు. హీరోయిన్ పూర్ణ అవును, రాజు గారి గది...తను కూడా హర్రర్ మూవీస్ లో నటించింది. అందుకనే పూర్ణను హీరోయిన్ గా సెలెక్ట్ చేసారా..?
ఈ కథ నా దగ్గరికి వచ్చేటప్పటికీ హీరో, హీరోయిన్ తప్ప మిగిలిన వారందరూ ఓకే అయ్యారు. ఈ చిత్రంలో హీరోయిన్ క్యారెక్టర్ పేరు రాణి. మన నేటివిటికి తగ్గట్టు ఉండాలి ఎవరైతే బాగుంటారు అనుకుంటుంటే పూర్ణ అయితే ఈ క్యారెక్టర్ కి సరిగ్గా సరిపోతుంది అనిపించింది. అందుకనే పూర్ణను సెలెక్ట్ చేసాం తప్ప మీరన్నట్టు హర్రర్ మూవీస్ లో చేసింది కదా అని సెలెక్ట్ చేయలేదు.
అ ఆ మూవీ సక్సెస్ మీట్ లో మీడియా పై కామెంట్ చేసారు కదా..! కారణం ఏమిటి..?
ఆ సినిమా రివ్యూస్ లో ఆర్టిస్టుల గురించి రాస్తూ....ఒకలిద్దరు బాగా నటించలేదు అన్నట్టు రాసారు. అది కూడా ఒక్కరో ఇద్దరో అలా రాసారు. ఎవరైతే బాగా నటించలేదు అనుకుంటున్నారో వాళ్ల పేరు రాసేస్తే బాగుంటుంది కదా అన్నట్టు మాట్లాడాను. ఆతర్వాత కూడా నా వ్యాఖ్యల పై వివరణ ఇచ్చాను. ఏది ఏమైనా నేను అలా మాట్లాడి ఉండకూడదు. అది పూర్తిగా నా తప్పే..!
డైరెక్టర్ శివరాజ్ గురించి చెప్పండి..?
శివరాజ్ వర్మ, జె.డి.చక్రవర్తి, ఇంద్రగంటి మోహనకృష్ణ దగ్గర వర్క్ చేసాడు. ఆతర్వాత లండన్ వెళ్లి బాగా కష్టపడి ఓ సంస్థకు సిఇఓ అయ్యాడు. ఇప్పుడు దర్శకుడు అవ్వాలనే తన కలను నెరవేర్చుకోవడం కోసం తనే నిర్మాతగా మారి ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. ప్రతి విషయం పై పూర్తి అవగాహన ఉంది. ఖచ్చితంగా పెద్ద దర్శకుడు అవుతాడు.
ఈ మూవీకి జయమ్ము నిశ్చయమ్ము రా టైటిల్ కన్నా ముందు వేరే టైటిల్ ఏమైనా అనుకున్నారా...?
సర్వమంగళం అనే టైటిల్ పెట్టాలి అనుకున్నాం. ఈ పదం నెగిటివ్ గా అనిపిస్తాదనే ఉద్దేశ్యంతో వద్దనుకున్నాం. ఫైనల్ గా జయమ్ము నిశ్చయమ్మురా ఫిక్స్ చేసాం.
హీరోగా కంటిన్యూ చేస్తారా..?
హీరోగా మంచి కథ వస్తే చేస్తాను. ఈ సినిమా రిలీజ్ తర్వాత నా దగ్గరకి మరిన్ని మంచి కథలు వస్తాయని ఆశిస్తున్నాను. ఏది ఏమైనా నాకు మంచి పేరు వచ్చింది అంటే క్యారెక్టర్ ఆర్టిస్టుగానే..అందుచేత హీరోగా చేసినా క్యారెక్టర్స్ ను మాత్రం వదలను.
ఫైనల్ గా జయమ్ము నిశ్చయమ్మురా ఎలాంటి విజయం సాధిస్తుంది అనుకుంటున్నారు..?
ఈ సినిమా చక్కటి ఆహ్లాదకరమైన సినిమా. అందరికీ నచ్చుతుంది. అందులో ఎలాంటి సందేహం లేదు. మా టీమ్ అందరికీ మంచి పేరు తీసుకువస్తుంది అనేది నా గట్టి నమ్మకం.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments