శ్రీనివాసుడి కల్యాణ గీతాలు
Send us your feedback to audioarticles@vaarta.com
నితిన్, రాశీ ఖన్నా జంటగా సతీష్ వేగేశ్న దర్శకత్వంలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై రూపొందిన సినిమా 'శ్రీనివాస కళ్యాణం'. దిల్ రాజు, శిరీష్, లక్ష్మణ్ నిర్మాతలు. మిక్కీ జె మేయర్ సంగీతం అందించారు. ఈ సినిమా పాటలను ఆదివారం రాత్రి హైదరాబాద్ లో ఆవిష్కరించారు. పెళ్లి విశిష్టతను తెలియజెప్పే కథాంశంతో రూపొందిన ఈ సినిమా ఆడియో వేడుకను పెళ్లి వేదికను తలపించేలా డిజైన్ చేయడం నటీనటులను, ప్రేక్షకులను ఆకట్టుకుంది.
హీరో నితిన్ మాట్లాడుతూ "గత కొన్నేళ్లుగా మా మదర్ ఇంట్లో పెళ్లి పెళ్లి అని చావగొడుతుంది. 'మూడు లేదు. ఇప్పుడు వద్దు' అంటున్న టైమ్లో సతీష్ వేగేశ్నగారు కథ చెప్పారు. ఇన్స్టంట్గా కనెక్ట్ అయ్యా. ఇన్స్టంట్గా పెళ్లి కూడా చేసుకోవాలనే ఫీలింగ్ వచ్చింది. ఆయన చెప్పిన సీన్స్ అంత బ్యూటిఫుల్ గా ఉన్నాయి. పెళ్లి అంటే ఇప్పుడు అయ్యే పెళ్లిలా కాదు. మా సినిమాలో చూపించబోయే పెళ్లిలా. ఇన్స్టంట్గా అలా పెళ్లి చేసుకోవాలనే ఆలోచన వచ్చింది. తర్వాత షూటింగ్ మొదలైంది. పెళ్లి సీన్స్ చేస్తున్నాం. అప్పుడు మొదలైంది. ఆ వ్రతాలు, ఆ పూజలు, ఆ జనాలు, ఆ గోల చూసి... 'అమ్మో. పెళ్లా? వద్దు బాబోయ్. ఇంత కష్టమా' అని ఫీలయ్యా. (వెంటనే 'సారీ మమ్మీ.. పక్కా పెళ్లి చేసుకుంటా. ఇది ఊరికే చెబుతున్నా. టీవిలో చూసి టెన్షన్ పడకు').
నా జీవితంలో బ్యూటిఫుల్ మెమరీ ఈ సినిమా. సినిమాలో ఆర్టిస్టులు చాలామంది ఉన్నారు. అందరూ వస్తే స్టేజి సరిపోదేమో. 70మందితో నేను యాక్ట్ చేయాలంటే కొన్నిసార్లు భయం వేసేది. తెలుగు సంప్రదాయాలు, సంస్కృతి గురించి పెద్దగా తెలియకుండా మంచి మ్యూజిక్ ఇచ్చాడు. 'కళ్యాణం వైభోగం' పాట అయితే ఇకపై ప్రతి పెళ్ళిలో వినిపిస్తుంది. నా సినిమాల్లో నాకు నచ్చిన ఆల్ టైమ్ ఫెవరెట్స్లో టాప్3లో తప్పకుండా ఉంటుంది. 29 ఏళ్ళ శ్రీమణి పెళ్లి గురించి అద్భుతమైన పాట రాశాడు. షాకయ్యా. దిల్ రాజుగారి గురించి చెప్పాలంటే.. అతని గురించి ఆర్టిస్టుల్లో నాకంటే ఎక్కువగా ఎవరికీ తెలియదు.
ఆయన ఫస్ట్ సినిమా 'దిల్'' హీరోనే నేనే కదా. 'దిల్' టైమ్లో షూటింగ్ ఉన్నా లేకున్నా ఆయన ప్రతిరోజూ ఆఫీసుకి వచ్చి నెక్స్ట్ తీయబోయే సీన్స్, ఎడిటింగ్, రీ రికార్డింగ్ అన్నిటి గురించి కనుకునేవాడు. అందరూ ఫస్ట్ సినిమాకి వీడికి ఇంత బిల్డప్ అవసరమా అనుకునేవారు. మళ్ళీ మేమిద్దరం కొన్ని సినిమాలు చేయాలనుకున్నాం. కుదరలేదు. ఇప్పుడు 'శ్రీనివాస కళ్యాణం' చేశాం.
ఈ షూటింగులో ఆయన్ను చూసి షాకయ్యా. అప్పుడు అందరూ ఓవర్ యాక్షన్ అనుకున్నాడు. కానీ, కాదు. సినిమా మీద ఆయనకున్న ప్రేమ. అందువల్లే ఇన్నేళ్లు ఇన్ని మంచి సినిమాలు తీయగలిగారు. విజయాలు సాధించారు. ఈ సినిమాకి అసిస్టెంట్ గా వర్క్ చేశారు. షాట్ రెడీ అయితే అందర్నీ ఆయన పిలిచేవారు. సతీష్ వేగేశ్న గారు ఈ సినిమా కథ రాసి, అందులో నన్ను హీరోగా అనుకోవడం నా అదృష్టం. క్లైమాక్స్ సీన్లలో ఆయన రాసిన డైలాగులకు నా దిల్ ఖుషీ అయ్యింది . నా టాప్ 3 సినిమాల్లో ఇది ఒకటి అవుతుందని ఆశిస్తున్నా" అన్నారు.
నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ ''శతమానం భవతి' తరవాత లాస్ట్ ఇయర్ ఫిబ్రవరిలో సతీష్ ఈ సినిమా ఐడియా చెప్పాడు. ఆ తరవాత 'నేను లోకల్' విడుదలైంది. నేను తిరుపతి వెళ్ళా. దర్శనం క్యూలైనులో ఉన్నప్పుడు కథ గురించి ఐడియాలు వచ్చాయి. టైటిల్ వైబ్రేషన్ అనుకుంట. దర్శనం పూర్తయ్యాక బయటకు వచ్చి 'నీ కథ గురించి నాకు ఐడియాలు వచ్చాయి' అని సతీష్ కి చెప్పా. 'ఇది బావుంది. ఇది బావుంది' అన్నాడు. వెంకటేశ్వర స్వామి దగ్గర కథ పెరగడం మొదలైంది. డెవలప్ చేశాం. సినిమాలో పెళ్లి గురించి ఏం చెప్పాలని అనుకున్నారో అది జయసుధగారి వాయిస్ ఓవర్ తో విడుదల చేసిన థీమ్ టీజర్ లో చెప్పాం. ఈ కథ గురించి మాట్లాడుతున్నప్పుడు అందులో మూడు ఇన్సిడెంట్స్ నా లైఫ్ లో జరిగాయి. అమ్మాయికి పెళ్లి చేశా. మనవడు పుట్టాడని సంతోషించా. భార్య పోయిందని బాధపడ్డా. అవే సతీష్ తో పంచుకున్నా.
'శ్రీనివాస కళ్యాణం' కథకు రౌండప్ ఐడియా అయ్యింది. ప్రతి ఒక్కరి లైఫ్ లో జరిగే మూమెంట్స్ ఈ సినిమా. సినిమాలోని ఏదో ఒక పాత్రలో ప్రేక్షకులు తమను తాము చూసుకుంటారు. 'శతమానం భవతి' తరవాత ఇంత మంచి సినిమా మేం చేయడానికి కారణం సతీష్ వేగేశ్న. మిక్కీ మంచి పాటలు ఇవ్వడం కాదు... బ్యాగ్రౌండ్ స్కోర్ అద్భుతంగా చేస్తున్నాడు. ఫస్టాఫ్ బ్యాగ్రౌండ్ స్కోర్ ఫినిష్ అయ్యాక ఇంత మంచి సినిమా తీశామా అనుకున్నా. 'తొలిప్రేమ'లో రాశీ ఖన్నా నటన చూసి ఈ సినిమాకి తీసుకున్నాం.
ఇక, నితిన్... 'దిల్' తరవాత ఎన్నో సినిమాలు అనుకున్నాం. ఏదీ కుదరలేదు. ఒకసారి నితిన్ వరుస ఫ్లాపుల్లో ఉన్నప్పుడు మా ఇంటికి వచ్చి ఒక సినిమా చేయమని అడిగాడు. అప్పుడూ కుదర్లేదు. ఎంతో చేయాలని ట్రై చేశా. అవన్నీ ఎందుకు కుదరలేదంటే ఈ సినిమా అతను చేయాలని రాసిపెట్టుంది. భగవంతుడు ఇవన్నీ డిజైన్ చేసి ఉంటాడు. ఆగస్టు 9న ప్రేక్షకులు ప్రతి ఒక్కరికీ తమ ఇంట్లో పెళ్లి చూస్తున్న ఫీలింగ్ కలుగుతుంది" అన్నారు.
దర్శకుడు సతీష్ వేగేశ్న మాట్లాడుతూ "పెళ్లి గురించి చెప్పాలని రాసిన ఒక కథ ఈ 'శ్రీనివాస కళ్యాణం'. 'శతమానం భవతి' గత ఏడాది జనవరిలో విడుదలైంది. మంచి హిట్టయ్యింది. ఫిబ్రవరిలో దిల్ రాజుగారి ఆఫీసులో ఉండగా ఆయన, శిరీష్ గారు 'నెక్స్ట్ ఏంటి?' అని అడిగారు. 'శతమానం భవతి'లో శ్రీనివాస కళ్యాణం జరిపించిన సందర్భంలో పాట వస్తుంది. నాకు అప్పటి నుంచి 'శ్రీనివాస కళ్యాణం' అనేది బాగా నచ్చింది. సో.. 'పెళ్లి కాన్సెప్ట్ మీద సినిమా చేద్దామని అనుకుంటున్నా. టైటిల్ 'శ్రీనివాస కళ్యాణం' అని చెప్పా' అని రాజుగారు, శిరీష్ కి చెప్పా. 'టైటిల్ బావుంది. పెళ్లి కాన్సెప్ట్ ఇంకా బావుంటుంది. తప్పకుండా బావుంటుంది' అన్నారు.
అలా సినిమా మొదలైంది. అక్కడి నుంచి పెళ్లి గురించి ఆలోచించడం స్టార్ట్ చేశాం. ఇప్పటికే పెళ్లి గురించి చాలా సినిమాలు వచ్చాయి. కొత్తగా ఏం చెప్పాలని అనుకున్నా.త్రేతాయుగంలో శ్రీరాముడు శివధనుసు విరిచి సీతను పరిణయమాడాడు. ద్వాపరయుగంలో శ్రీకృష్ణుడు రుక్మిణీ దేవిని గుడి నుంచి తీసుకువెళ్లి మరీ పరిణయమాడాడు. కలియుగంలో కుబేరుడి దగ్గర అప్పు చేసి మరీ వేంకటేశ్వర స్వామి పరిణయమాడాడు. యుగాలు మారినా.. దేవుడు మనిషిగా ఏ అవతారం ఎత్తినా.. పెళ్లి యొక్క గొప్పదనం చెబుతూనే ఉన్నాడు. అలా చెప్పాలనే చిన్ని ప్రయత్నమే మా ఈ శ్రీనివాస కళ్యాణం. నితిన్ గారు కథ విని బావుందని చెప్పారు.
కానీ, చేస్తానని అనలేదు. చివరగా ఆయన దగ్గర నుంచి వచ్చేసేటప్పుడు 'మీరు చేస్తారో లేదో చెప్పలేదు' అని అడిగా. వెంటనే చేస్తానని అన్నారు. పెళ్లి మీద సినిమా, నితిన్ హీరో అనగానే చాలామంది డైలాగులు చెప్పగలడా? చూసుకో? అన్నారు. క్లైమాక్స్ సీన్ ఫైవ్ మినిట్స్ సింగిల్ షాట్ లో చేశారు. యూనిట్ అందరూ క్లాప్స్ కొట్టారు" అన్నారు.
హీరోయిన్ రాశీ ఖన్నా మాట్లాడుతూ "నా మనసుకు బాగా దగ్గరైన సినిమా 'శ్రీనివాస కళ్యాణం'. నా కెరీర్లో వన్నాఫ్ ద బెస్ట్ ఫిల్మ్స్ అని కూడా చెప్పవచ్చు. కథ చెప్పినప్పుడు ఎమోషనల్ అయ్యా. ఎందుకంటే... నేను కూడా ఒక ఫ్యామిలీ పర్సన్. అందమైన విలువలతో నన్ను పెంచినందుకు అమ్మానాన్నలకు థ్యాంక్స్. కథ వినగానే దాంతో ప్రేమలో పడ్డా. అమ్మకు ఈ కథను నేరేట్ చేశా. అమ్మ కళ్లల్లో నీళ్లు తిరిగాయి. కథలో అంత పవర్ ఉంది. ఈ సినిమాలో భాగమైనందుకు గర్వంగా ఉంది.
ఇంత మంచి కథ, క్యారెక్టర్ ఇచ్చినందుకు దర్శకుడు సతీష్ గారికి థ్యాంక్స్. దిల్ రాజు గారు అంటే నాకు ఎప్పుడూ గౌరవమే. ఈ సినిమాతో అది మరింత పెరిగింది. ఆయన బ్యానర్లో ఇంకా మీనింగ్ ఫుల్ ఫిలిమ్స్ చేయాలని కోరుకుంటున్నా. నితిన్ ఈ సినిమా కోసం బాగా కష్టపడ్డాడు. లవ్లీ హ్యూమన్ బీయింగ్. అతనితో మరిన్ని సినిమాలు చేయాలని అనుకుంటున్నా" అన్నారు.
మ్యూజిక్ డైరెక్టర్ మిక్కీ జె మేయర్ మాట్లాడుతూ "దిల్ రాజు సార్ దగ్గర వర్క్ చేసేటప్పుడు ఎప్పుడూ ఒక భయం ఉంటుంది. కానీ, ఈ సినిమాలో ఫ్రీ మైండ్, కంఫర్టబుల్ గా వర్క్ చేశా. నేను అమెరికాకు వెళ్ళా. అయినా సార్ చాలా సపోర్ట్ చేశారు. సతీష్ గారు వెరీ టాలెంటెడ్. బట్, సైలెంట్. ఆయన మంచి కథ రాయడం వల్లే మంచి పాటలు వచ్చాయి. 'అ ఆ' తరవాత నితిన్ తో మరోసారి వర్క్ చేయడం సంతోషంగా ఉంది. ఆన్ స్రీన్ నితిన్, రాశీ ఖన్నా కెమిస్ట్రీ బావుంది" అన్నారు.
ప్రకాష్ రాజ్ మాట్లాడుతూ "దిల్ రాజు, శిరీష్, లక్ష్మణ్... ఈ సంస్థకు, నాకు ఒక అనుబంధం ఉంది. ఎందుకు అంత అనుబంధం అంటే... ఆభాసం లేకుండా ప్రజలకు విలువలు ఉన్న సినిమాలు ఇస్తూ, ఒక గుర్తింపు పొందేటువంటి మంచి మనసున్న సంస్థ ఇది. అందుకే నాలు దిల్ రాజు అంటే చాలా ఇష్టం. ఎంత పెట్టుబడి పెట్టినా మంచి వాతావరణాన్ని తీసుకురావాలని ప్రయత్నిస్తాడు. ఈ సినిమా విషయానికి వస్తే.. సతీష్ వేగేశ్న గురించి చెప్పాలి.
ఇంతకు ముందు 'శతమానం భవతి', ఇప్పుడు 'శ్రీనివాస కళ్యాణం'. ప్రతిసారీ దిల్ రాజు నాకు ఒక కథ చెబుతాడు. ఈ రెండు సినిమాల కథలు నాకు చెప్పేటప్పుడు నేను సినిమాల్లో లేను. కానీ, నా సంస్థ ఇది. అన్నయ్యా.. అని దిల్ రాజు కథ చెబుతాడు. షూటింగ్ కి వెళ్లే సరికి మీకు ఒక వేషం ఉందని వస్తాడు. ఇవన్నీ పక్కన పెడితే... పెళ్లిళ్ల గురించి ఒక డాక్యుమెంటరీ కాదిది. ఈ సినిమా నాకు ఒక మంచి అనుభూతి. ఎందుకంటే, నెంబ కూడా బ్రతుకుని చూశా. మనం పెళ్లిళ్లను ఒక ఈవెంట్ కింద చూస్తున్న ఈతరంలో, సిటీ ప్రజలకు... ఒక పెళ్లి, పెళ్ళిలో అన్ని రోజులు ప్రతి ఒక్కరూ రావడం, పెళ్లిల్ల విశిష్టతను, మనం మర్చిపోయిన విలువలు, సంబంధాలను చెప్పేటటువంటి సినిమా.
నితిన్ తో దాదాపు 15 సంవత్సరాల తరవాత చేస్తున్న. 'దిల్' తరవాత ఇదే. ఈ కథ విని, ఇంత పెద్ద పాత్రను ఆయన మోయగలడా అనుకున్నా. కానీ, అద్భుతంగా చేశాడు. రాశీ ఖన్నా, నందితా శ్వేతా, మిగతా నటీనటులు బాగా చేశారు. మిక్కీ జె మేయర్ మంచి మ్యూజిక్ ఇచ్చాడు" అన్నారు.
నటుడు రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ "41 ఏళ్ళ సినిమా జీవితంలో సుమారు 250 సినిమాలు చేశా. ఎప్పుడూ మా ఫ్యామిలీతో సినిమా ఫంక్షన్స్ కి వెళ్ళలేదు. ఇవాళ ఫ్యామిలీతో ఇక్కడికి వచ్చానంటే 'శ్రీనివాస కళ్యాణం' ఎఫెక్ట్ ఎంత ఉందో అర్థం చేసుకోండి. నేను ఇంతకంటే చెప్పవలసిన అవసరం లేదు. జాతీయ అవార్డు వచ్చిన 'శతమానం భవతి' తరవాత సతీష్ వేగేశ్న ఎంత అద్భుతమైన సినిమా చేశాడో ఈ సినిమా చూస్తే తెలుస్తుంది.
'సీతారామ కళ్యాణం' నుంచి పెళ్లి గురించి ఒక లెవల్ లో చూసిన నాకు ఒక షాక్. 'పెళ్లి పుస్తకం' వంటి సినిమా చేసినవాడిని, పిల్లలకు పెళ్లి చేసినవాడిని ఒక్క విషయం ఒప్పుకుని తీరాలి. ఈ కథ విన్నాక, సినిమా చేశాక, పెళ్లిలో ఇన్ని ఉన్నాయా.. ఇంత మతలబు ఉందా? అనుకున్నా. ఈ సినిమా ఒక అద్భుతం. అమోఘం" అన్నారు.
నటి జయసుధ మాట్లాడుతూ "ఎస్.వి.సి బ్యానర్లో 'బొమ్మరిల్లు'తో నేను అడుగుపెట్టా. ఆ జర్నీ అలా కంటిన్యూ అవుతూ మంచి సినిమాలు మంచి క్యారెక్టర్స్ చేసే అవకాశం లభించింది. జులై 21తో నటిగా ఇండస్ట్రీలో 46 ఏళ్ళు పూర్తి చేసుకున్నా. అఫ్ కోర్స్... నరేష్ కూడా. 'పండంటి కాపురం'లో మేమిద్దరం హీరో హీరోయిన్లుగా చేశాం. ఈ 46 ఏళ్ళ కెరీర్ లో ఎన్నో దశలు ఉన్నాయి. ఈ జర్నీలో ఈ దశను దిల్ రాజు గారికి అంకితం ఇస్తున్నా. ఈ సినిమాలోనూ మంచి క్యారెక్టర్ చేశా. సతీష్ గారు కథ చెప్పినప్పుడు నేను కూడా నాకు తెలియని చాలా విషయాలు తెలుసుకున్నా" అన్నారు.
నటుడు సీనియర్ నరేష్ మాట్లాడుతూ "గత సంవత్సరం పెద్ద సినిమాల మధ్య విడుదలైన 'శతమానం భవతి' దూసుకు వెళ్ళింది. పెద్ద పండగ సినిమాగా నిలిచింది. తరవాత శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ లో ఆరు విజయాలు వచ్చాయి. 'శతమానం భవతి'తో నాకు సతీష్ అనే మంచి మిత్రుడు దొరికాడు. అందులో నా ల్క్యారెక్టర్ పది మెట్లు ముందుకు తీసుకువెళ్ళింది. మళ్ళీ 'శ్రీనివాస కళ్యాణం' ఆగస్టు 9న వస్తుంది. 'శతమానం భవతి' కంటే ఐదు రేట్లు ఎక్కువ ఉంటుంది. పండగ సినిమా కాదేమో గానీ, దీపావళికి గుడ్ మార్నింగ్ చెప్పబోయే సినిమా ఇదే. 'బొమ్మరిల్లు' డేట్ అనుకుంటా. నేను ఎప్పుడూ చెబుతా. దిల్ రాజుగారి నిశ్చితార్థానికి డెలివరీ డేట్ పెట్టేస్తారు. అది ఆయన ఒక్కడికే సాధ్యం" అన్నారు.
నటి ఆమని మాట్లాడుతూ "ఈ సినిమాలో సుమారు 70 ఆర్టిస్టులు ఉన్నారు. అందరితో కలిసి మంచి సినిమా చేశాం. నిజంగా అద్భుతమైన సినిమా. నా లైఫ్ లో ఇలాంటి సినిమా ఎప్పుడూ చేయలేదు. ఇక ముందు చేస్తానో లేదో కూడా తెలియదు. రేపటితో సినిమా షూటింగ్ పూర్తవుతుంది. ప్యాకప్ అనగానే నాకు ఏడుపు వచ్చింది" అన్నారు.
నటి సితార మాట్లాడుతూ "దిల్ రాజుగారి బ్యానర్ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ లో నా నాలుగో సినిమా ఇది. 'బృందావనం', 'జోష్' చేశా. సతీష్ వేగేశ్న లాస్ట్ సినిమా 'శతమానం భవతి'లో అద్భుతమైన సీన్ చేశా. ఇప్పుడు ఈ సినిమా 'శ్రీనివాస కళ్యాణం' వంటి గొప్ప సినిమాలో భాగమైనందుకు సంతోషంగా ఉంది. కన్నడలో ప్రకాష్ రాజ్ గారితో నటించినా, తెలుగులో 'స్నేహం కోసం' తరవాత రెండోసారి ఈ సినిమాలో ఆయనకు జంటగా నటించా. నితిన్ తో, రాశీ ఖన్నాతో ఇది రెండో సినిమా. 'అక్కాచెల్లెళ్లు' సినిమాలో జయసుధగారికి చెల్లెలిగా నటించా. ఆమెతో మళ్ళీ నటించడం సంతోషంగా ఉంది" అన్నారు.
గాయని సునీత మాట్లాడుతూ "శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ నుంచి, ఈ డైరెక్టర్ నుంచి 'శతమానం భవతి' వంటి అద్భుతమైన సినిమా వచ్చింది. అందులో నేను ఎందుకు పార్ట్ అవ్వలేకపోయా అనుకున్న లోటు ఈ 'శ్రీనివాస కళ్యాణం' తీర్చింది" అన్నారు.
హీరోయిన్ నందితా శ్వేత, పూనమ్ కౌర్, పాటల రచయితలు రామజోగయ్య శాస్త్రి, శ్రీమణి తదితరులు ఈ పాటల వేడుకలో పాల్గొన్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments