CP Srinivas Reddy:హైదరాబాద్ సీపీగా శ్రీనివాస్‌రెడ్డి.. పలువురు ఐపీఎస్ అధికారులు బదిలీ..

  • IndiaGlitz, [Tuesday,December 12 2023]

పాలనలో తనదైన ముద్ర వేసేలా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ముందుకు సాగుతున్నారు. ఈ మేరకు తన టీమ్‌ను సిద్ధం చేస్తున్నారు. ఈ క్రమంలో గ్రేటర్ హైదరాబాద్‌కు చెందిన పలువురు ఐపీఎస్‌ అధికారులను బదిలీ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. హైదరాబాద్‌ పోలీస్ కమిషనర్‌గా కొత్తకోట శ్రీనివాస్‌రెడ్డి, సైబరాబాద్‌ సీపీగా అవినాష్‌ మహంతి, రాచకొండ సీపీగా సుధీర్‌బాబు, నార్కోటిక్‌ బ్యూరో డైరెక్టర్‌గా సందీప్‌ శాండిల్యను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

ఇక ఇప్పటివరకు సైబరాబాద్‌, రాచకొండ సీపీలుగా వ్యవహరించిన స్టీఫెన్‌ రవీంద్ర, దేవేంద్రసింగ్‌ చౌహాన్‌లను డీజీపీకి రిపోర్టు చేయాలని ఆదేశించింది. ఇవే కాకుండా రాష్ట్రవ్యాప్తంగా త్వరలోనే భారీ స్థాయిలో ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల బదిలీలు జరిగే సూచనలు ఉన్నాయంటున్నారు. కాగా ఎన్నికల నోటిఫికేషన్‌కు ముందు హైదరాబాద్ సీపీగా ఉన్న సీవీ ఆనంద్‌ను ఎన్నికల కోడ్ ప్రారంభమయ్యాక ఈసీ బదిలీ చేసింది. ఆయన స్థానంలో సందీప్ శాండిల్యను నియమించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆయనకూ కీలకమైన నార్కోటిక్ బ్యూరో డైరక్టర్ బాధ్యతలు అప్పగించారు. డ్రగ్స్ విషయంలో కఠినంగా వ్యవహరించాలని తెలిపిన రేవంత్ రెడ్డి.. ఆ బాధత్యలను శాండిల్యకు అప్పగిస్తూ కీలక నిర్ణయం తీసుకున్నారు.

ఇదిలా ఉంటే గత బీఆర్‌ఎస్ ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని సైబరాబాద్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్రపై కాంగ్రెస్ నేతలు తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ క్రమంలోనే ఆయనను సైబారాబాద్ కమిషనర్ నుంచి తప్పించి డీజీపీ ఆఫీస్‌కు ఎటాచ్ చేశారు. వీరితో పాటు బీఆర్ఎస్ ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించిన మరికొంత మంది అధికారులను బదిలీ చేసే అవకాశం ఉందని చెబుతున్నారు.