శ్రీకాంత్ తో సినిమా తీసిన తర్వాత ఇండస్ట్రీపై అభిప్రాయం మారింది - టెర్రర్ నిర్మాత షేక్ మస్తాన్
- IndiaGlitz, [Monday,February 29 2016]
హోప్, కలవరమాయే మదిలో...చిత్రాలు తెరకెక్కించిన సతీష్ కాసెట్టి తెరకెక్కించిన తాజా చిత్రం టెర్రర్. శ్రీకాంత్ హీరోగా నటించిన టెర్రర్ మూవీని షేక్ మస్తాన్ నిర్మించారు. అఖండ భారత్ క్రియేషన్స్ బ్యానర్ పై రూపొందిన టెర్రర్ చిత్రం ఇటీవల రిలీజై విజయవంతంగా ప్రదర్శింపబడుతోంది. ఈ సందర్భంగా టెర్రర్ నిర్మాత షేక్ మస్తాన్ ఇంటర్ వ్యూ మీకోసం...
మీ గురించి చెప్పండి..?
మాది గుంటూరి జిల్లా చిలకలూరి పేట. నిర్మాత కాక ముందు ఆరా అనే ఏజెన్సీస్ స్ధాపించాను. ఇదొక పోల్ మేనేజ్మెంట్ ఏజెన్సీ. ఇందులో ఒక నియోజకవర్గంలో ఉన్న సమస్యలు ఏమిటి..? అక్కడ ప్రజల అభిప్రాయం ఏమిటి..? ఇలా రాజకీయ నాయకులకి కావలసిన పూర్తి సమాచారం అందిస్తాం. రాజకీయాల్లో వర్క్ చేయడం వలన నరేంద్ర మోడీగారితో పరిచయం ఏర్పడింది. ఆయన గురించి ఎవరికీ తెలియని విషయాలు ఎన్నో తెలుసుకున్నాను. దీంతో నరేంద్ర మోడీ పై సినిమా తీస్తే బాగుంటుందనే ఉద్దేశ్యంతో డైరెక్టర్ సతీష్ కాసెట్టికి చెప్పాను. ఆయన 35 కోట్లు బడ్జెట్ అవుతుంది అన్నారు. ఆ సమయంలో అంత బడ్జెట్ పెట్టలేం అని ఆ ప్రాజెక్ట్ క్యాన్సిల్ చేసాం. ఆతర్వాత సతీష్ టెర్రర్ కథ చెప్పారు. నచ్చడంతో టెర్రర్ సినిమా నిర్మించాను.
టెర్రర్ మూవీకి వస్తున్న రెస్పాన్స్ ఎలా ఉంది..?
ఊహించిన దానికంటే ఎక్కువ రెస్పాన్స్ వచ్చింది. సినిమా చూసిన ప్రతి ఒక్కరు కొత్తదనం ఉందని ఫీల్ అవుతున్నారు. సినిమా చూస్తున్నంత సేపు తర్వాత ఏం జరుగుతుందో అని ఇంట్రస్టింగ్ గా చూసేలా ఉండడంతో ఈ విధమైన స్పందన లభిస్తుంది అని నా అభిప్రాయం.
నిర్మాతగా తొలి చిత్రాన్నిశ్రీకాంత్ తో నిర్మించారు. ఆయనతో వర్క్ంగ్ ఎక్స్ పీరియన్స్ గురించి..?
శ్రీకాంత్ లాంటి మంచి వ్యక్తిని నేను ఎక్కడా చూడలేదు. ఇండస్ట్రీలోకి రాక ముందు ఇండస్ట్రీ గురించి చాలా బ్యాడ్ గా చెప్పేవారు. కానీ శ్రీకాంత్ గారితో సినిమా తీసిన తర్వాత ఇండస్ట్రీపై నాకున్న అభిప్రాయం మారింది.
శ్రీకాంత్ తో మళ్లీ సినిమా తీసే ఆలోచన ఉందా..?
ఖచ్చితంగా శ్రీకాంత్ తో ఇంకో సినిమా నిర్మిస్తాను. 2018 లో ఆంధ్రా పాలిటిక్స్ నేపథ్యంతో ఆ సినిమా ఉంటుంది. ఖచ్చితంగా ఆ సినిమా ఓ సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది.
మీరు ఎలాంటి సినిమాలు నిర్మించాలనుకుంటున్నారు..?
ఇప్పటి వరకు రాని కొత్త కాన్సెప్ట్స్ తో సినిమాలు నిర్మించాలనేది నా ఆలోచన. అలాగే సమాజానికి ఎంతో కొంత ఉపయోగపడేలా సందేశాత్మక చిత్రాలు నిర్మిస్తాను.
నెక్ట్స్ ప్రాజెక్ట్ గురించి..?
నూతన దర్శకుడు కిరణ్ తో ఓ చిత్రాన్ని ప్లాన్ చేస్తున్నాను. ఈ చిత్రాన్ని మార్చి 16న ప్రారంభించడానికి ప్లాన్ చేస్తున్నాను. మా బ్యానర్ నుంచి ఖచ్చితంగా సంవత్సరానికి ఒక సినిమా ఉంటుంది.