మరోసారి తెరపైకి ఎన్టీఆర్ జీవిత చరిత్ర.. హీరోగా శ్రీకాంత్!

  • IndiaGlitz, [Wednesday,February 19 2020]

అవును మీరు వింటున్నది నిజమే.. దివంగత ముఖ్యమంత్రి, ఆంధ్రుల ఆరాధ్యుడు, అన్నగారు ఎన్టీఆర్ జీవిత చరిత్ర మరోసారి తెరపైకి రానుంది. అదేంటి ఇప్పటికే ఇద్దరు డైరెక్టర్లు ఈ సినిమాను తెరకెక్కించేశారు.. థియేటర్లలోకి వచ్చింది.. పోయింది కదా..? అని అనుకుంటున్నారా..? నిజమే.. మళ్లీ తెరపైకి తీసుకురావడానికి ఓ సీనియర్ నటుడు, నిర్మాత నిర్ణయించారట. ఇంతకీ ఆయనెవరు..? ఎందుకు మళ్లీ తెరపైకి తేవాలనుకుంటున్నాడు..? అనేది ఈ ప్రత్యేక కథనంలో తెలుసుకుందాం.

ఇప్పటికే..!

వాస్తవానికి ఇప్పటికే క్రిష్ డైరెక్టర్‌గా ఎన్టీఆర్ కుమారుడు బాలకృష్ణే నాన్నగారి పాత్రలో రెండు భాగాలు చేశాడు. ‘కథానాయకుడు’, ‘మహానాయకుడు’ రెండు భాగాలు తెరకెక్కించినప్పటికీ ఆశించిన ఫలితాలు రాకపోగా బాలయ్యకు లేనిపోని అపకీర్తిని తెచ్చిపెట్టిందని విశ్లేషకులు అంటుంటారు. అంతేకాదు ఆ తర్వాత వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కూడా ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ పేరుతో ఎన్నో వివాదాలు.. మరెన్నో ఆటంకాల మధ్య సినిమాను రిలీజ్ చేశాడు. అంతేకాదు.. సినిమా రిలీజ్ చివరి నిమిషం వరకూ టెన్షన్.. టెన్షన్.. ఎట్టకేలకు కొద్దిరోజులు ఆలస్యమైనప్పటికీ థియేటర్లలోకి తీసుకొచ్చాడు. అయితే క్రిష్ దర్శకత్వం వహించిన ఆ రెండు సినిమాల కంటే వర్మ సినిమానే మంచి టాక్ తెచ్చుకుంది.. అంతేకాదు.. కలెక్షన్ల పరంగానూ పర్లేదనిపించింది.

ఎవరెవరు..!?

ఇక్కడితో ఎన్టీఆర్ జీవిత చరిత్ర జోలికి ఎవరూ పోరని.. ఇక తెరకెక్కించడానికి కూడా ఏమీ లేదని అందరూ అనుకుంటున్న సమయంలో సీనియర్ నటుడు, నిర్మాత, కలెక్షన్ కింగ్ మోహన్ బాబు వెబ్ సిరీస్‌ను తీయడానికి సిద్ధమైనట్లు తెలుస్తోంది. రాజకీయాల నేపథ్యంతో నిర్మితం అవుతున్న ఈ చిత్రానికి ‘చదరంగం’ అనే టైటిల్‌ను ఫిక్స్ చేసినట్లు టాక్ నడుస్తోంది. ఈ సినిమాలో హీరోగా శ్రీకాంత్ నటించనున్నట్లు తెలుస్తోంది. అన్నీ అనుకున్నట్లు జరిగితే అతి త్వరలోనే వెబ్ సీరిస్ షూటింగ్ ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. ఇది మంచువారి బ్యానర్‌లోనే రానుంది. కాగా ఈ చిత్రానికి రాజ్ అనంత దర్శకత్వం వహిస్తారని తెలుస్తోంది. అయితే దీనికి సంబంధించి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.

సీక్రెట్స్ బయటపెడతారా!?

వాస్తవానికి ఎన్టీఆర్‌కు మోహన్ బాబుకు చాలా మంచి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. అన్నగారిని దగ్గర్నుంచి చూసిన వ్యక్తి మోహన్ బాబు. అంతేకాదు.. కలెక్షన్ కింగ్ సినిమాల్లోకి రావడానికి కారుకుల్లో అన్నగారు కూడా ఒకరని అప్పట్లో చెబుతుండేవారు. ఎన్టీఆర్‌ను దగ్గర్నుంచి చూసిన వ్యక్తిగా.. సన్నిహితుడిగా ఉన్న మోహన్ బాబు వెబ్ సీరిస్ తెరకెక్కిస్తున్నారని వార్తలు గుప్పుమంటున్నాయ్ కానీ.. ఇంతవరకూ అటు మంచు కుటుంబీకులు కానీ.. ఇటు నందమూరి ఫ్యామిలీ కానీ రియాక్ట్ అవ్వలేదు. మరి ఇదే నిజమైతే మోహన్ బాబు ఎవరికీ తెలియని సీక్రెట్స్ ఏమైనా చెబుతారో లేకుంటే మమా అనిపిస్తారో..!. ప్రస్తుతం కలెక్షన్ కింగ్ వైసీపీలో ఉన్నారు గనుక ఇంకా ఎన్నెన్ని ఆరోపణలు వస్తాయో.. ఏంటో!. ఇది ఎంతవరకు నిజమో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చేంతవరకూ వేచిచూడాల్సిందే.