మహేష్ మంచి మనిషి - ఆయనే నా బలం - డైరెక్టర్ శ్రీకాంత్ అడ్డాల
Send us your feedback to audioarticles@vaarta.com
కొత్త బంగారులోకం, సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు, ముకుంద...ఇలా రెగ్యులర్ చిత్రాలకు భిన్నంగా...కుటుంబం అంతా కలసి చూసేలా మంచి చిత్రాలు అందిస్తూ...తనకంటూ ఓ ప్రత్యేకతను ఏర్పరుచుకున్న దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల. మహేష్, కాజల్, సమంత, ప్రణీత కాంబినేషన్లో శ్రీకాంత్ అడ్డాల తెరకెక్కించిన తాజా చిత్రం బ్రహ్మోత్సవం. మనసుని కదిలించేలా... ఆలోచింపచేసేలా...విభిన్న కథాంశంతో రూపొందించిన బ్రహ్మోత్సవం చిత్రం ఈనెల 20న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అవుతుంది. ఈ సందర్భంగా బ్రహ్మోత్సవం చిత్ర దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల తో ఇంటర్ వ్యూ మీకోసం...
సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు తర్వాత మళ్లీ మహేష్ తో వర్క్ చేసారు కదా..! మహేష్ లో ఏమైనా మార్పు వచ్చిందా..?
మహేష్ ఎప్పుడూ ఒకేలా ఉంటారు. ఆయన అప్పుడు ఎలా ఉన్నారో..ఇప్పుడు అలాగే ఉన్నారు. సెన్సిటివ్ స్టోరీని అర్ధం చేసుకుని నాకు రెండోసారి అవకాశం ఇవ్వడం అనేది గొప్ప విషయం. ఆయన డైరెక్టర్స్ హీరో. స్టార్ హీరో అనేది పక్కన పెడితే...ఆయన మంచి మనిషి..ఆయనే నాకు స్పూర్తి.
ఈ సినిమాలో మహేష్ కి పేరు లేదని విన్నాం..?
అవునండి..హీరోకి పేరు లేదు. పేరు పెట్టకపోవడానికి ప్రత్యేక కారణం అంటూ ఏమీ లేదు. నేను కథలు రాసేటప్పుడు పేర్లు రాసుకోను. నన్ను నా స్నేహితులు, సన్నిహితులు చాలా మంది పేరు పెట్టి పిలవరు. అందువలనే సినిమాల్లో హీరోకు పేరు పెట్టాలనే ఆలోచన రాదేమో..
మహేష్ చెప్పులు తండ్రికి అందిస్తున్నట్టు పోస్టర్ రిలీజ్ చేసారు కదా..ఆ ఆలోచన ఎలా వచ్చింది..?
తండ్రి పట్ల కొడుకు ప్రేమ, గౌరవం చూపించే సీన్ ఉంది. ఈ సీన్ లో ఏం చేస్తే బాగుంటుంది అని ఆలోచిస్తున్నప్పుడు తండ్రి హడావిడిగా బయటకు వెళుతున్నప్పుడు కొడుకు వెళ్లి చెప్పులు తొడుగితే బాగుంటుందనే ఆలోచన వచ్చింది. అదే పోస్టర్ గా రిలీజ్ చేసాం. చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది.
ఇంతకీ..బ్రహ్మోత్సవం కథ ఏమిటి..?
సమకాలిన ప్రపంచంలో మనం అనుకున్నది జరుగుతుందా..? లేదా..? అని ఆలోచిస్తూ...టెన్షన్ పడుతుంటాం.అయితే.. టెన్షన్ నుంచి బయటపడడానికి ఒక్కొక్కరు ఒక్కొటి చేస్తుంటారు. నాకు తెలిసి ప్రశాంతత అనేది ఎక్కడికో వెళితే రాదు. మనుషుల మధ్య ఉంటేనే వస్తుంది. ఇదే పాయింట్ ను కుటుంబ పరంగా చెప్పాలనుకుని మహేష్ కు చెప్పాను. ఆయనకు నచ్చి సినిమా చేద్దాం అన్నారు. అదే బ్రహ్మోత్సవం.
ఈ సినిమాలో ఏడు తరాల గురించి తెలుసుకోవాలనే కాన్సెప్ట్ ఉందని విన్నాం నిజమేనా..?
అవునండి..ఏడు తరాల కాన్సెప్ట్ ఉంటుంది. అదే కథను ముందుకు తీసుకువెళుతుంది. అది ఏమిటి అనేది తెర పైనే చూడాలి.
బ్రహ్మోత్సవం టైటిల్ జస్టిఫికేషన్ ఏమిటి..?
నలుగురు కలుసుంటే అదో ఉత్సవం. ఇక ఉత్సవానికి పీక్ ఏదైనా ఉందంటే అది బ్రహ్మోత్సవం. ఈ సినిమా నాలుగైదు కుటుంబాలు...ప్రేమ, బంధం, అనుబంధం గురించి చెప్పే సినిమా కాబట్టి బ్రహ్మోత్సవం అని టైటిల్ పెట్టాం. ఈ టైటిల్ ఆలోచన ఎలా వచ్చింది అంటే...నేను ఓ రోజు భక్తి ఛానల్ చేస్తున్నప్పుడు బ్రహ్మోత్సవం అని కనిపించింది. ఇదేదో టైటిల్ గా బాగుంటుంది అనిపించి వెంటనే పెట్టేసాను.
సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాకి గణేష్ పాత్రో సంభాషణలు అందించారు కదా...ఈ సినిమాకి సంభాషణలు ఎవరు అందించారు..?
సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు నా స్థాయికి మించిన కథ. అప్పుడు నాకు స్ర్కిప్ట్ లో సహాయం చేస్తారని గణేష్ పాత్రో గారిని వెళ్లి కలిసాను. ఆయన అనుభవం నాకు ఎంతగానో ఉపయోగపడింది. ముకుంద సమయంలో ఆయనకు బ్రహ్మోత్సవం కథ గురించి చెప్పాను. కథ విని ఓ మూడు పేజీలు రాసి ఇచ్చారు. ఆ విధంగా బ్రహ్మోత్సవం కు ఓంకారం ఆయనే రాసారు. ఆయన ఇప్పుడు లేకపోవడం బాధాకరం. ఈ సినిమా విషయానికి వస్తే..రచయితలు శ్రీరమణ, పరుచూరి బ్రదర్స్, కదీర్ బాబు, కృష్ణచైతన్య, కిషోర్ లు స్ర్కిప్ట్ లో సహకారం అందించారు.
సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాకి - బ్రహ్మోత్సవం సినిమాకి పోలికలు ఏమైనా ఉన్నాయా..?
సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు వేరు.. బ్రహ్మోత్సవం వేరు. సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు అనేది పల్లెటూరులో జరిగే కథ అయితే...బ్రహ్మోత్సవం సిటీలో జరిగే కథ. పైగా రిచ్ ఫ్యామిలీ. అలాగే సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు ఇద్దరు అన్నదమ్ముల కథ. బ్రహ్మోత్సవం నాలుగైదు కుటుంబాల కథ. సో...ఆ సినిమాకి ఈ సినిమాకి ఎలాంటి పోలిక ఉండదు.
బ్రహ్మోత్సవం ఆలస్యం అవ్వడానికి కారణం ఏమిటి..?
బ్రహ్మోత్సవం సినిమా ఎక్కువ మంది ఆర్టిస్టులతో చేసిన సినిమా. అంత మంది ఆర్టిస్టులతో సినిమా చేయడం అంటే చాలా కష్టం. అందుచేత ఆర్టిస్టుల డేట్స్ ప్రాబ్లమ్ వలన షూటింగ్ ఆలస్యం అయ్యింది... తప్ప వేరే ప్రాబ్లమ్ ఏమీ రాలేదు.
శ్రీమంతుడు తర్వాత బ్రహ్మోత్సవం చేసారు కదా..ఏమైనా టెన్షన్ పడ్డారా..?
ఏ సినిమా చేస్తున్నప్పుడైనా ఏదో ఒక టెన్షన్ ఉంటుంది. అది కామన్. ఇంతకు ముందు చెప్పినట్టుగా ఎక్కువ మంది ఆర్టిస్టులతో వర్క్ చేస్తున్నప్పుడు డేట్స్ ప్రాబ్లమ్ వలన షూటింగ్ ఆలస్యం అయ్యేది. ఆ టైమ్ లో కాస్త టెన్షన్ పడ్డాను. కానీ..కథ విని మహేష్ ఎప్పుడైతే ఓకే అన్నారో..అప్పుడే ఈ సినిమా చేయగలననే నమ్మకం ఏర్పడింది. నాకు ఏదైనా కష్టం వచ్చినప్పుడు మహేష్ దగ్గరకు వెళితే మనసుకు తెలికగా అనిపించేది. ఆయనే నా బలం. సినిమా చేస్తున్నప్పుడు ఇబ్బందులు వస్తుంటాయి..వాటిని పట్టించుకుంటే సినిమా చేయలేం. ఇక శ్రీమంతుడు తర్వాత సినిమా కాబట్టి టెన్షన్ అంటే..కాస్త ఆ ఫీలింగ్ ఉంటుంది. అయితే ఒక మంచి సినిమా చేద్దాం అని ప్రయత్నించాం. అందరికీ నచ్చుతుందని నమ్మకం.
మీ తదుపరి చిత్రం కూడా ఇదే తరహాలో ఉంటుందా..? లేక వేరే తరహాలో ఉంటుందా..?
అన్ని సార్లు ఒకేలా సినిమాలు చేస్తే ప్రేక్షకులకు బోర్ కొడుతుంది. అందుచేత సమయాన్ని బట్టి కొత్త తరహాలో సినిమా చేయాలి. నా తదుపరి చిత్రం ఎలా ఉంటుంది అనేది బ్రహ్మోత్సవం రిలీజ్ తర్వాతే తెలుస్తుంది.
తదుపరి చిత్రం ఎవరితో..?
చాలా కథలు రాసుకున్నాను. నెక్ట్స్ మూవీ ఎవరితో అనేది బ్రహ్మోత్సవం రిలీజ్ తర్వాత చెబుతాను.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments