CI Anju Yadav:జగన్ దిష్టిబొమ్మ దహనానికి యత్నం, జనసేన నేతపై చేయి చేసుకున్న మహిళా సీఐ.. భగ్గుమన్న జనసైనికులు
- IndiaGlitz, [Wednesday,July 12 2023]
వాలంటరీ వ్యవస్థపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలపై వైసీపీ శ్రేణులు , వాలంటీర్లు దగ్థం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ పరిణామాలపై జనసేన శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో శ్రీకాళహస్తిలోని పెళ్లిమండపం వద్ద బుధవారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి దిష్టి బొమ్మను దగ్ధం చేసేందుకు జనసేన శ్రేణులు యత్నించాయి. దీంతో రంగప్రవేశం చేసిన పోలీసులు సీఎం దిష్టిబొమ్మను లాక్కొనే ప్రయత్నం చేశారు. దీనిపై జనసైనికులు భగ్గమన్నారు. సీఎం డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. పోలీసులు జనసేన నాయకుల మధ్య తోపులాట చోటుచేసుకుంది. ఎంతగా నచ్చజెప్పాలని చూసినా వినకపోవడంతో జనసేన నాయకులను పోలీసులు వన్ టౌన్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
జనసేన నేత రెండు చెంపలు వాయించిన సీఐ:
ఈ నేపథ్యంలో జనసేన నేత కొట్టే సాయిపై శ్రీకాళహస్తి వన్‌టౌన్ సీఐ అంజూ యాదవ్ చేయి చేసుకున్నారు. అతని రెండు చెంపలపైనా కొట్టారు. దీనిపై జనసైనికులు భగ్గుమన్నారు. ఆ తర్వాత జనసేన నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ కోట వినుతతో పాటు తదితర నేతలను హౌస్ అరెస్ట్ చేశారు. వాలంటీర్లను పవన్ కల్యాణ్ ఎక్కడా తప్పుపట్టలేదని.. వాలంటరీ వ్యవస్థ సేకరిస్తున్న సమాచారం సంఘ విద్రోహ శక్తులకు చేరుతుందని మాత్రమే అన్నారని జనసేన నేతలు పేర్కొన్నారు. ఆయన మాటలను వక్రీకరించి.. పవన్‌పై ద్వేషం పెంచుతున్నారని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. వాలంటీర్ల ముసుగులో వైసీపీ నాయకులు పవన్ కల్యాణ్ దిష్టిబొమ్మలు దగ్ధం చేస్తున్నారని వారు ఆరోపించారు. సీఐ అంజూ యాదవ్ వెంటనే క్షమాపణలు చెప్పాలని, ఆమెను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు.
తొలి నుంచి సీఐ తీరు వివాదాస్పదం:
అయితే సీఐ అంజూ యాదవ్ తీరు తొలి నుంచి వివాదాస్పదంగా వుంది. గతంలో నిర్దేశించిన సమయానికి హోటల్ మూయలేదంటూ ఓ మహిళపై అంజూ యాదవ్ చేయి చేసుకోవడంతో ఏకంగా జాతీయ మహిళా కమీషన్ సీరియస్ అయ్యింది. తక్షణం సీఐపై కేసు నమోదు చేసి ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని ఆదేశించింది. ఈ ఘటనపై టీడీపీ నేత వంగలపూడి అనిత సైతం మహిళా కమీషన్‌కు ఫిర్యాదు చేశారు.