అతిలోక సుందరి శ్రీదేవి కన్నుమూత

  • IndiaGlitz, [Sunday,February 25 2018]

త‌న‌దైన అద్భుత న‌ట‌న‌తో సినీ వినీలాకాశాన్ని ఏలిన న‌టి శ్రీదేవి (54) హ‌ఠాన్మ‌ర‌ణం చెందారు. శ‌నివారం అర్ధ‌రాత్రి దుబాయ్‌లో గుండెపోటుతో క‌న్నుమూశారు. తెలుగు, త‌మిళం, మ‌ల‌యాళం, క‌న్న‌డ‌, హిందీ భాష‌ల్లో 300 చిత్రాల్లో న‌టించింది. ఈమె న‌టించిన చివ‌రి చిత్రం 'మామ్‌'. ఇందులో శ్రీదేవి టీనేజ్ అమ్మాయి పాత్ర‌లో న‌టించింది. తెలుగు, తమిళ, మలయాళ, హిందీ చిత్రసీమలను కొన్నేళ్లు ఏలిన అతిలోకసుందరి శ్రీదేవి భువి నుంచి దివికి వెళ్లిపోవడం సినీ ప్రేక్షక లోకాన్ని విషాదంలోకి నెట్టింది.

బాల‌న‌టిగా శివ‌కాశిలో 1963, ఆగ‌స్టు 13న జ‌న్మించిన శ్రీదేవి అస‌లు పేరు శ్రీ అమ్మ‌య్యంగార్ అయ్య‌ప్ప‌న్‌. 1967లో కంద‌న్ క‌రుణ‌య్ అనే సినిమాతో బాల‌న‌టిగా ఎంట్రీ ఇచ్చింది. తెలుగులో 'మా నాన్న నిర్దోషి' సినిమాతో బాల‌న‌టిగా ఎంట్రీ ఇచ్చింది. త‌ర్వాత తెలుగులో 'ప‌ద‌హ‌రేళ్ల వ‌య‌సు' సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. దీని రీమేక్ సోల్వా సావ‌న్‌' సినిమా ద్వారా హిందీలోకి ఎంట్రీ ఇచ్చారు. అగ్ర హీరోయిన్‌గా త‌న‌దైన ముద్ర‌వేసిన శ్రీదేవి తెలుగులో 85, హిందీలో 71, తమిళంలో 72, మళయాళంలో 26, కన్నడంలో 6 చిత్రాల్లో నటించారు. 1975-85 మధ్యకాలంలో తెలుగు, తమిళంలో ఆమె నెంబర్‌ వన్‌ కథానాయిక స్థానానికి ఎదిగారు. ఆయా భాషల్లో అగ్ర కథానాయకులందరితోనూ శ్రీదేవి నటించారు. రెండు తరాల హీరోలతో నటించిన హీరోయిన్‌గా ఆమె పేరు తెచ్చుకున్నారు.

1996 జూన్ 2న బోనీ క‌పూప‌ర్‌ను వివాహ‌మాడారు. వీరిని జాన్వీ, ఖుషీ అనే ఇద్ద‌రు పిల్లున్నారు. పెళ్లి త‌ర్వాత సినిమాల‌కు దూర‌మైన శ్రీదేవి 2004-05 ప్రాంతంలో మాలినీ అయ్యంగార్‌గా బుల్లితెర‌పై ద‌ర్శ‌న‌మిచ్చారు. 2012లో ఇంగ్లీష్ వింగ్లీష్ చిత్రం ద్వారా సెకండ్ ఇన్నింగ్స్‌ను స్టార్ట్ చేశారు. 2017లో విడుద‌లైన మామ్ శ్రీదేవి న‌టించిన ఆఖ‌రి చిత్రం. ప్ర‌స్తుతం శ్రీదేవి త‌న పెద్ద త‌న‌య జాన్వీ క‌పూర్‌ను హీరోయిన్‌గా ప‌రిచ‌యం చేసే ప‌నిలో బిజీగా ఉన్నారు. మ‌రాఠీ సినిమా 'సైర‌త్‌'ను హిందీలో 'ద‌ఢ‌క్' పేరుతో తెర‌కెక్కిస్తుండ‌టం విశేషం. శ్రీదేవి మృతి ప‌ట్ల చిత్రీ సీమ తీవ్ర సంతాపాన్ని వ్య‌క్తం చేశారు.