శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ సక్సెస్ సెలబ్రేషన్స్ 2017
Send us your feedback to audioarticles@vaarta.com
1997లో 'పెళ్ళి పందిరి' చిత్రంతో డిస్ట్రిబ్యూటర్‌గా సక్సెస్ సాధించిన దిల్‌రాజు..2002లో దిల్ చిత్రంతో నిర్మాతగా సక్సెస్‌ను సాధించారు. ఒక పక్క నిర్మాతగా, డిస్ట్రిబ్యూటర్‌గా రాణిస్తున్న దిల్‌రాజు 2017లో తన వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై ఆరు విజయవంతమైన సినిమాలను తెలుగు ప్రేక్షకులకు అందించి డబుల్ హ్యాట్రిక్ నిర్మాత అయ్యారు.
ఈ సందర్భంగా సోమవారం జరిగిన శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ సక్సెస్ సెలబ్రేషన్స్‌లో ఈ ఏడాది విడుదలైన సక్సెస్‌ఫుల్ మూవీస్ 'శతమానం భవతి', 'నేను లోకల్', 'డీజే దువ్వాడ జగన్నాథమ్', 'ఫిదా', 'రాజా ది గ్రేట్', 'ఎంసీఏ' చిత్రాల్లోని హీరోలు, దర్శకులను నిర్మాణ సంస్థ నుండి దిల్‌రాజు, శిరీష్, లక్ష్మణ్‌లు సత్కరించారు. అలాగే దిల్‌రాజు డిస్ట్రిబ్యూటర్‌గా సక్సెస్ జర్నీని స్టార్ట్ చేసిన పెళ్లిపందిరి సినిమా దర్శకుడు కోడి రామకృష్ణ, హీరో జగపతిబాబు సహా యూనిట్‌ను సత్కరించారు.
ఈ కార్యక్రమంలో కోడి రామకృష్ణ, జగపతిబాబు, అల్లు అర్జున్, వరుణ్‌తేజ్, నాని, దిల్‌రాజు, శిరీష్, లక్ష్మణ్, జయసుధ, భూమిక, అనుపమ పరమేశ్వరన్, మెహరీన్, దేవిశ్రీ ప్రసాద్, త్రినాథరావు నక్కిన, హరీష్ శంకర్, వంశీ పైడిపల్లి అనిల్ రావిపూడి, శేఖర్ కమ్ముల, సీనియర్ నరేష్, నవీన్ చంద్ర, బెక్కం వేణుగోపాల్, రైటర్ ప్రసన్న, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా...
శతాధిక దర్శకుడు కోడి రామకృష్ణ మాట్లాడుతూ - ''దేనికైనా స్టార్టింగ్ పాయింట్ ఉంటుంది. దాని తర్వాత అల్లుకు పోవడమే గొప్ప విషయం అలా దిల్‌రాజు బ్యానర్ చిత్ర సీమతో అల్లుకుపోయింది. చలనచిత్ర సీమకు ఈరోజు దిల్‌రాజుగారు గర్వంగా నిలబడ్డారు. పది మంది నిర్మాతలకు ఇలా సినిమా తీయాలనిపించేలా సినిమాలు చేస్తున్నారు. ఆయన కృషి, పట్టుదల కారణంగా రాజుగారు ఈ రేంజ్‌కు చేరుకున్నారు'' అన్నారు.
జగపతి బాబు మాట్లాడుతూ - ''కెరీర్ ప్రారంభంలో తనకు విజయాన్నిచ్చిన 'పెళ్ళిపందిరి' సినిమాను గుర్తుంచుకుని, దిల్‌రాజు..నేడు ఆ యూనిట్‌ను సత్కరించడం తన గొప్పతనం. తనకు ఈ సందర్భంగా థాంక్స్ చెబుతున్నాను. రాజు, శిరీష్, లక్ష్మణ్‌లు ముగ్గురు బెస్ట్ టీం. రాజు దిల్ సినిమా వల్ల దిల్‌రాజు కాలేదు..తనకు సినిమాపైనున్న దిల్ వల్లనే దిల్‌రాజు కాగలిగాడు. ఏ సినిమా అయినా తీయగల దమ్ముంది. ఎవరితో అయినా తీయగలిగే సత్తా ఉంది. డబుల్ హ్యాట్రిక్ సినిమాను నిర్మించినందుకు తనకు హ్యాట్సాఫ్'' అన్నారు.
త్రినాథరావు నక్కిన మాట్లాడుతూ - ''రాజుగారు కొట్టిన ఆరు సిక్సర్స్(ఆరు హిట్స్)లో నా సిక్సర్ కూడా ఒకటి ఉండటం ఆనందంగా ఉంది. వచ్చే ఏడాది నుండి ఆయన ఏడాదికి 12 సిక్సర్లు కొట్టాలని కోరుకుంటున్నాను. నేను లోకల్ సక్సెస్‌కు కారణం..టీమ్ వర్క్. ఎస్.వి.సి ఫెస్టివల్‌లో మా సినిమా పార్ట్ అయ్యింది. అందుకు కారణమైన రాజుగారు, శిరీష్‌గారు, లక్ష్మణ్‌గారికి థాంక్స్'' అన్నారు.
నవీన్ చంద్ర మాట్లాడుతూ - ''దిల్‌రాజుగారి బ్యానర్‌లో 'నేను లోకల్' చేసే అవకాశం ఇచ్చినందుకు ఆనందంగా ఉంది. నాని, కీర్తిసురేష్ సహా అందరికీ థాంక్స్'' అన్నారు.
అల్లు అర్జున్ మాట్లాడుతూ - ''ఇది ఒక సినిమాకు సంబంధించిన ఈవెంట్ కాదు. ఆరు సినిమాలకు సంబంధించిన ఈవెంట్. ఒక నిర్మాత ఓ ఏడాదిలో ఆరు సినిమాలు చేసి..ఆ ఆరు సినిమాలు బ్లాక్‌బస్టర్స్ కావడం అనేది ఒక దిల్‌రాజుగారికే సాధ్యమైంది. ఇంత యూనిక్ సక్సెస్‌ను సాధించిన ఎస్.వి.సి బ్యానర్‌కు అభినందనలు. ఈ బ్యానర్‌లో రెండో సినిమా నేనే చేశాను. తర్వాత మధ్యలో సినిమా చేశాను. అలాగే అదే బ్యానర్‌లో 25వ సినిమా కూడా నేనే చేశాను. ఇప్పుడు ఈ బ్యానర్ విజయవంతంగా 27 సినిమాలను పూర్తి చేసింది.
ఈ ఏడాది శతమానం భవతి శర్వానంద్, సతీష్ వేగేశ్న సహా యూనిట్.నేను లోకల్ నాని, త్రినాథరావు సహా యూనిట్‌కు..డీజే విషయానికి వస్తే హరీష్‌కు, సక్సెస్‌లో భాగమైన యూనిట్‌కు..ఫిదాలో శేఖర్ కమ్ముల, వరుణ్‌తేజ్, సాయిపల్లవి సహా యూనిట్‌కి..రాజా ది గ్రేట్‌లో రవితేజ అన్నయ్య, అనిల్‌రావిపూడి సహా యూనిట్‌కు..ఎంసీఏలో నాని, శ్రీరామ్ వేణు సహా యూనిట్‌కి అభినందనలు. ఈ ఏడాది దిల్‌రాజుగారి సతీమణి అనితగారు అందరికీ దూరమయ్యారు.
దిల్‌రాజుగారికి వ్యక్తిగతంగా ఎంతో పెద్ద దెబ్బ తగిలింది. అలాంటి సమయంలో..ఏ మనిషైనా క్రుంగిపోతారు.. ఓ భారం వ్యక్తిని అలా నొక్కేస్తుంటుంది. అలాంటి సమయంలో రాజుగారికి ఓ ట్రెమెండస్ హిట్ రావాలని నేను కోరుకున్నాను. అలాగే ఆయనకు ఆరు సక్సెస్‌లు వచ్చాయి. ఆయనకు ఇలాంటి సక్సెస్ రావడంతో వ్యక్తిగతంగా నాకు కూడా ఎంతో ఆనందమేసింది. ఓ సిచ్యువేషన్ వచ్చినప్పుడు రాజుగారు ఎలా రియాక్ట్ అవుతారనేది నేను చాలా సందర్భాల్లో చూశాను. కానీ ఆయన సతీమణి దూరమైనప్పుడు ఆయన రియాక్ట్ అయిన విధానం చూసి ఆయనపై గౌరవం పెరిగింది'' అన్నారు.
ఎస్.హరీష్ శంకర్ మాట్లాడుతూ - ''అంచనాలను తట్టుకుంటూ ఆరు సక్సెస్‌లను సాధించడం అంత చిన్న విషయమేమీ కాదు. రెండు మూడేళ్ల క్రితం క్రికెట్‌లో ఆరు సిక్సర్స్ కొట్టింది యువరాజు అయితే..సినిమాలో ఒకే ఏడాదిలో ఆరు సిక్సర్స్(హిట్స్) కొట్టింది దిల్‌రాజు. ఆయన గ్యాప్ లేకుండా 48 గంటలు కూడా కష్టపడటం చూశాను. ఆయనకు సినిమాపై ఉన్న ప్యాషన్ అలాంటిది. ఓసారి నేను రాజుగారితో..'అన్నా నీకు ఏ చెడు అలవాట్లు లేవు..చాలా హెల్దీగా ఉన్నావు. ఇలాగే చేసుకుంటూ వెళితే వంద సినిమాలు చేసేస్తావన్నయ్యా' అన్నాను. దానికి ఆయన 'హరీశ్ నేను వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళతాను. అవి 80..90 లేక వంద సినిమాలు అవుతాయో నాకు తెలియదు.
కానీ వంద సినిమాలు చేయాలనే టార్గెట్‌తో సినిమాలు చేయడం లేదు' అన్నారు. ఆ మాట నాకెంతో ఇన్‌స్పిరేషన్‌గా అనిపించింది. ఈ ఏడాది ఆయనకు వచ్చిన ఆరు సక్సెస్‌లు ఆయన ప్యాషన్‌కు దేవుడు ఇచ్చిన గిఫ్ట్‌గా నేను బావిస్తున్నాను. ఇంత మంచి జర్నీలో మాకు కూడా అవకాశం ఇచ్చినందుకు థాంక్స్'' అన్నారు.
సతీష్ వేగేశ్న మాట్లాడుతూ - ''సాధారణంగా ఎవరైనా వారున్న రంగంలో చరిత్ర సృష్టించాలనుకుంటారు. అలాగే ఈరోజు దిల్‌రాజు సినిమా రంగంలో ఓ ఏడాదిలో ఆరు హిట్స్ సాధించి చరిత్ర సృష్టించారు. ఆ చరిత్రలో శతమానం భవతి మొదటి అడుగు అయినందుకు ఆనందంగా ఉంది. 27 సంవత్సరాలు తర్వాత తెలుగు సినిమాకు నేషనల్ అవార్డ్ వస్తే..అందుకు ప్రధాన కారణం రాజుగారు, శిరీష్‌గారు, లక్ష్మణ్‌గారు. సాధారణంగా ఎవరైనా గెలుపు గుర్రంపైనే బెట్టింగ్ కడతారు. కానీ రేసు ఫీల్డ్ లాంటి సినిమాల్లో ఈ నిర్మాతలు ముగ్గురు కొత్త గుర్రంపై బెట్టింగ్ కట్టి సక్సెస్ కొడతారు లేదా..నాలాంటి ఓడిపోయిన గుర్రాన్ని తీసుకొచ్చి బెట్టింగ్ కట్టి సక్సెస్ సాధిస్తారు'' అన్నారు.
జయసుధ మాట్లాడుతూ - ''ఎస్.వి.సి బ్యానర్‌లో నేను ఎన్నో సినిమాలు చేశాను. ఈ ఏడాది ఆరు సినిమాలను సక్సెస్ సాధించిన ఎస్.వి.సి బ్యానర్‌కు అభినందనలు. అందులో తొలి సినిమా శతమానం భవతిలో నేను నటించే అవకాశం కలిగినందుకు '' అన్నారు.
అనుపమ పరమేశ్వరన్ మాట్లాడుతూ - ''శతమానం భవతి విడుదలై అప్పుడే ఏడాది అయ్యింది. ఆ సినిమాలో నటించడంతో...జీవితంలో ఏదో సాధించానని ఫీల్ అవుతున్నాను. ఆ సినిమాలో నాకు సహకారం అందించి ఆ సినిమాను వండర్‌ఫుల్ ఎక్స్‌పీరియెన్స్‌గా మిగిల్చినందుకు థాంక్స్'' అన్నారు.
శేఖర్ కమ్ముల మాట్లాడుతూ - ''కొన్ని సినిమాలు మ్యాజిక్ చేస్తుంటాయి. అలాంటి మ్యాజిక్‌కు కారణమైన దిల్‌రాజుగారికి, వరుణ్ సహా నా టీం అంతటికీ థాంక్స్. ఆయన అప్రోచ్ చూస్తుంటే మంచి క్వాలిటీ ఉన్న వంద సినిమాలను త్వరలోనే పూర్తి చేసేస్తారని నమ్ముతున్నాను'' అన్నారు.
హీరో వరుణ్‌తేజ్ మాట్లాడుతూ - ''రాజుగారి సాధించిన ఇంత పెద్ద సక్సెస్‌లో మేం కూడా పార్ట్ అయినందుకు ఆనందంగా ఉంది. సినిమాపై దిల్‌రాజుగారికున్న ప్యాషన్, కథపై ఉన్న కన్విక్షన్, డైరెక్టర్స్‌పై ఉండే నమ్మకమే ఆయన సక్సెస్‌కు కారణం. మంచి కథను నమ్ముకునే ఆయన సినిమాలు చేశారు. ఇలాంటి సక్సెస్‌ను మరిన్ని సాధిస్తారని దిల్‌రాజుగారు, శిరీష్‌గారు, లక్ష్మణగారిని కోరుకుంటున్నాను'' అన్నారు.
అనిల్ రావిపూడి మాట్లాడుతూ ''ఇయర్ ఎగ్జామ్స్ అయ్యాక స్టూడెంట్స్ అందరినీ లైన్‌లో పిలిచి ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నట్టు అనిపిస్తోంది. ఈ సంస్థ తీసిన 27 చిత్రాల్లో 90 శాతానికి మించి హిట్లున్నాయి. నా జర్నీ 'సుప్రీమ్' నుంచి మొదలైంది. ఈ ఏడాది సినిమా పరంగా ఎన్నో తీపి జ్ఞాపకాలు, వ్యక్తిగతంగా చేదు జ్ఞాపకాలు ఉన్నప్పటికీ, దిగమింగుకుని ఈ సెలబ్రేషన్ చేస్తున్నందుకు హ్యాపీ. 2017 వెల్కమ్ సూపర్‌డూపర్ హిట్ శతమానం భవతి, మోటివేషనల్ నేను లోకల్, వార్మప్ సూపర్ డూపర్ హిట్ డీజే, మాన్‌సూన్ సూపర్‌డూపర్‌హిట్ ఫిదా, అన్‌సీజనల్ సూపర్‌డూపర్ హిట్ రాజాది గ్రేట్, ఫైనల్‌గా ఎంసీఎ. శిరీష్‌గారు రెడ్‌బుల్. మా అందరికీ ఎనర్జీ ఇస్తారు'' అని తెలిపారు.
సాయికార్తిక్ మాట్లాడుతూ "దిల్‌రాజుగారు హిట్ కొట్టిన ఆరు బాల్స్ లో నాదీ ఓ బాల్ అయినందుకు, ఆ బాల్ ఆడటానికి నన్ను గ్రౌండ్‌లోకి తీసుకెళ్లిన అనిల్ రావిపూడికి థాంక్స్" అని అన్నారు.
మెహరీన్ మాట్లాడుతూ "ఇంత పెద్ద సక్సెస్‌లు కొట్టడం మామూలు విషయం కాదు. ఈ సంస్థలో ఈ సారి నానితో ఏడాది మొదలైంది. ఆయనతోనే పూర్తవడం ఆనందంగా ఉంది" అని చెప్పారు.
వేణుశ్రీరామ్ మాట్లాడుతూ "రాజుగారితో నా జర్నీ ఎక్కువ. ఆర్యకి అసిస్టెంట్ డైరక్టర్‌గా చేశాను. పర్సనల్ లెవల్‌లో ఆయన గురించి ఎక్కువే తెలుసు. ఆయన ఒక ఏడాది ఆరు సిక్స్ లు కొట్టారు. పర్సనల్ గోల్స్ పెట్టుకుని, వాటిని ఆయనే బ్రేక్ చేస్తుంటారు. దిల్‌రాజు, శిరీష్, లక్ష్మణ్ ఎంత స్నేహంతో ఉంటారో నాకు తెలుసు. 'బిడ్డా ఐదు కొట్టిండ్రు. ఆరోది కొట్టకపోతే నీ సంగతి చెప్తా' అని రాజుగారు ఎప్పుడూ నన్ను అంటుండే వారు. లాస్ట్ పంచ్ మనదైతే ఆ కిక్కే వేరు. ఈ ఏడాది ఆ ఆరో బాల్ నాది అయింది. నేను ఈ కథను ముందు చెప్పింది హరీశ్‌శంకర్‌గారికి." అని అన్నారు.
భూమిక మాట్లాడుతూ "ఈ రోజు నాకు చాలా సంతోషంగా ఉంది. దాదాపు మూడేళ్ల తర్వాత నేను ఇక్కడికి వచ్చాను. నేను అందరి కళ్లకు దూరంగా ఉండొచ్చు. కానీ నా మనసుకు అందరూ దగ్గరగా ఉన్నారు. ఇంత సక్సెస్‌ఫుల్ సినిమాలు తీసినందుకు రాజుగారికి కంగ్రాట్స్. ఈ సంస్థలో ప నిచేయడం వల్ల నా కల నెరవేరినట్టు అనిపించింది" అని చెప్పారు.
దేవిశ్రీ ప్రసాద్ మాట్లాడుతూ "నిజమైన మిడిల్ క్లాస్ అబ్బాయి దిల్‌రాజు. కోటీశ్వరుడైనా, రిక్షావాడైనా అవే సినిమాలు చూడాలి. డిఫరెంట్ కల్చర్స్, జోనర్స్ సినిమాలు చేస్తున్న రాజుగారికి కంగ్రాట్స్. ఒక ఏడాది ఆరు సినిమాలు చేయడం, ఆరు హిట్లు కొట్టడం గ్రేట్. రైటర్స్ మీద నాకు ప్రేమ ఎక్కువ. మా నాన్న రైటర్ కాబట్టి నాకు ఆ ఫీలింగ్ ఉంటుంది.
ఏ టెక్నీషియన్‌కైనా ఇన్‌స్పిరేషన్ ఇచ్చేది కథే కాబట్టి రైటర్స్ అంటే నాకు ఇష్టం. అలాంటి కథలను పోగుచేసి సినిమా చేసిన రాజుగారు ఈజ్ గ్రేట్. ఆయనతో పనిచేస్తుంటే నిర్మాతగా భావించం, ఒక ఫ్యామిలీగా ఫీలవుతాం. ఈ ఇయర్ రాజుగారికి నాకూ కలిసి హ్యాట్రిక్ ఉంది. వచ్చే ఏడాది మూడు హ్యాట్రిక్‌లు కొట్టాలి. ఆ మూడు హ్యాట్రిక్‌లు కలిసి ఒక హ్యాట్రిక్ అవుతుంది. దీన్ని వింటుంటే సుకుమార్ డైలాగ్‌లాగా ఉంది కదా.." అని చెప్పారు.
నాని మాట్లాడుతూ "నాకు చిన్నప్పటి నుంచి క్రికెట్ అంటే ఇష్టం. ఎప్పుడూ బ్యాట్ పట్టుకుని కూర్చునేవాడిని. ఈ ఏడాది ఆరు బాల్స్ లో రెండు బాల్స్ ఇచ్చినందుకు రాజుగారికి థాంక్స్. పాట, టీజర్ వంటివి ఆయన ఎప్పుడూ వాట్సాప్‌లో పంపరు. షూటింగ్ షాట్ గ్యాప్‌లో పిలిచి పాట వినిపిస్తారు. ఇంకా చిన్న పిల్లాడి లాగా ప్యాషన్‌తో చేస్తారు.
అంత ప్యాషనే ఆయన్ని నెంబర్ వన్ నిర్మాతగా నిలిపింది. ఇది నేను ఇద్దరు వ్యక్తుల్లోనే చూశా. ఒకటి ఆదిత్య చోప్రా, రెండోది దిల్‌రాజుగారు. ప్రతి చిన్న విషయానికీ వారిద్దరూ ఎగ్జయిట్ అవుతారు. నేను ఈ మధ్యనే ప్రొడక్షన్‌లోకి దిగాను. దిగిన తర్వాత అర్థమవుతుంది ప్రొడక్షన్ ఎంత కష్టమో.. ఒకే ఏడాది ఇన్ని సినిమాలు తీసి అన్ని హిట్లు కొట్టారంటే మీరు గ్రేట్ సార్. మేం ఎంసీఏలో చాలా భయపడ్డాం. ఆ భయాలేమీ అక్కర్లేదని ప్రేక్షకులే హిట్ ఇచ్చారు కాబట్టి చాలా ఆనందంగా ఉన్నాం" అని తెలిపారు.
దిల్‌రాజు మాట్లాడుతూ - "ఒక ఏడాది ఇన్ని సినిమాలు చేయడం మామూలు విషయం కాదు. ఆఫీస్‌లో క్రిస్మస్‌కి ఎవరూ రారు. సక్సెస్‌లు రావడానికి ప్రతి ఒక్కరూ కారణం. అందరూ అలా ఉన్నారు కాబట్టే మాకు ఇన్ని సక్సెస్‌లు వచ్చాయి. 1987 డిసెంబర్‌లో నా జీవితం మొదలైంది. ఒక సూట్‌కేస్ పట్టుకుని ఆటోమొబైల్ ఫీల్డ్ గురించి తెలుసుకోవడానికి బయలుదేరారు. 1987, 1997, ఇప్పుడు 2017.. అన్నిటికి ఏదో ఇంటర్‌లింక్ ఉన్నట్టు అనిపిస్తోంది. సినిమాల మీద ఆసక్తితో మేం ఇండస్ట్రీలోకి రావడం, బిగినింగ్‌లో ఫెయిల్యూర్స్... 20 ఏళ్ల క్రితం మా జీవితంలో గ్రేట్ డే సక్సెస్ తెచ్చిన సినిమా పెళ్లిపందిరి.
ఆ సినిమా కొన్నప్పటి నుంచి రిలీజ్ వరకు ఎంత కష్టపడ్డామో మాకు, మా ఫ్యామిలీస్‌కి తెలుసు. సినిమా విడుదల రోజు రూ.3లక్షలు తక్కువ ఉంటే షాప్‌లు తిరిగి కట్టాం. కోడి రామకృష్ణ, జగపతిబాబుగారుకి థాంక్స్. ఆ సినిమా లేకుంటే మేం లేం. ఆ సినిమా ద్వారానే ఇక్కడి వరకు రాగలిగాం. ఆ తర్వాత డిస్ట్రిబ్యూషన్ ఆఫీస్ పెట్టాక చాలా మంది నిర్మాతలు మంచి సినిమాలు ఇచ్చారు. ఎన్నో సినిమాలతో అనుభవం ఉన్న మేం ప్రొడక్షన్‌లోకి వచ్చాం. వినాయక్‌తో దిల్ చేశాం. ఆ సినిమా ద్వారా చాలా నేర్చుకున్నాం. దిల్ ద్వారా పుట్టిన సుకుమార్, బోయపాటి శ్రీను, భాస్కర్, వంశీ, శ్రీకాంత్ అడ్డాల, వేణు.. ఇలా ఎనిమిది మందిని పరిచయం చేశాం.
ఒక్క దర్శకుడు తప్ప మిగిలిన వాళ్లందరూ సక్సెస్‌ఫుల్ దర్శకులే. ఈ ఇయర్ మా సంస్థకు రెండు హ్యాట్రిక్‌లు వస్తాయని నేను అనుకోలేదు. ఆరు సినిమాలు వస్తాయని నేను కూడా అనుకోలేదు. భగవంతుడు ఇలా డిజైన్ చేశారు. 'శతమానం భవతి', 'నేను లోకల్' తర్వాత అందరికీ తెలిసిందే.. అప్పటికి ప్లాన్డ్ గా ఉన్నాను. మిగిలిన సినిమాలన్నీ ప్లాన్‌గా ఉన్నాను. ఆరు సినిమాలు కనిపిస్తున్నాయి. వాటన్నిటినీ హిట్ చేయాలని అందరం ప్లాన్ చేసుకుంటున్నాం.
డీజే షూటింగ్ జరుగుతుంటే అబుదమీకి వెళ్లాను. అక్కడి నుంచి ఫారిన్ వెళ్లాలి. ఫిదా అప్పటికి రెండు షాట్‌లు చూశాను. ఫ్లైట్ దిగుతుంటే... అసలు ఏం జరుగుతుందో, ఎలా అవుతుందో నాకు తెలియలేదు. ఎక్కడ డ్రాప్ అవుతానోనని అనుకున్నా. గుడ్ ఫ్యామిలీ, గుడ్ ఫ్రెండ్స్ లేకుంటే జీవితంలో మనం ముందుకు వెళ్లలేం. ఈ ఆరు సక్సెస్‌ల వెనకాల నా ఫ్రెండ్స్ ఉన్నారు. నా ఫ్యామిలీ ఉంది. ఎందరో నాకు ఈ ఏడెనిమిది నెలల నుంచి మోరల్ సపోర్ట్ ఇచ్చారు.
దాంతోనే నేను సాధించాను. ఇది నేను కాదు. వంశీ అందరికీ డైరక్టర్‌గా తెలుసు. కానీ తను నాకు ఫ్యామిలీ మెంబర్స్. వంశీ, ప్రకాశ్‌రాజ్‌గారు, మరో ఫ్రెండ్ నన్ను మోరల్‌గా సపోర్ట్ చేశారు. సక్సెస్ ఉన్నప్పుడు అందరూ పొగుడుతారు అది కామనే. సినిమా పరిశ్రమలో సక్సెస్ అందరినీ నిలబడుతుంది. కానీ ఫెయిల్యూర్ ఉన్నప్పుడే మోరల్ సపోర్ట్ కావాలి. సక్సెస్ ఉన్నవాళ్లతో సినిమాలు చేస్తే అది ఆటోమేటిగ్గా వచ్చేస్తుంది. ఇది ఆరు సినిమాలనే ఈవెంట్‌లాగానే చేద్దామనుకన్నా. కానీ ఎమోషనల్ డ్రైవ్ అయిపోయింది. నాకు మా ఆవిడ గురించి తెలియగానే నా దగ్గరకు వచ్చింది శేఖర్‌గారు. అక్కడినుంచి నేను వచ్చేశాను.
యు.ఎస్.లో కంప్లీట్ చేసుకుని వచ్చారు కాబట్టి అది క్లాసిక్ అయింది. ఈ సినిమాకు పనిచేసిన ప్రతి ఒక్కరూ బ్లడ్, హార్ట్ పెట్టి పనిచేశారు. నా డిస్ట్రిబ్యూటర్లను సొంత మనుషులులాగా చూస్తాను. వాళ్లు సినిమాలను ప్రమోట్ చేసి సక్సెస్‌ఫుల్ సినిమాలు అయ్యేలా చేశారు. ఒక సినిమా ఊరికే వచ్చేయదు. ఒక ట్యూన్ వచ్చినా, సినిమా ఎవరైనా డబుల్ పాజిటివ్ చూసినా నేను గేట్ కీపర్‌లాగా కూర్చుంటాను.
అక్కడే నాకు రియాక్షన్ తెలుసుకుంటాను. తొలి రియాక్షనే సినిమా. అక్కడే తెలిసిపోద్ది. ఒకవేళ సినిమా బాగోలేకపోతే వాళ్ల రియాక్షన్ ఏంటి అనేది తెలిసిపోతుంది. ఈ ఆరు సినిమాలు మావి కాదు. వీటికి పనిచేసిన టెక్నీషియన్లవి. ఈ ఈవెంట్ అందుకే అలా చేయాలనుకున్నా" అని చెప్పారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments