మత్తువదలరా అందర్నీ ఆశ్చర్యపరుస్తుంది!- శ్రీసింహా

  • IndiaGlitz, [Monday,December 23 2019]

నాన్నపై ఆధారపడకుండా నా కాళ్లపై నేను నిలబడి నా సొంతంగా ఏదైనా సాధిస్తే సంతృప్తిగా వుంటుంది.అందుకే నాన్నకు తెలియకుండానే సుకుమార్ గారి దగ్గర సహాయ దర్శకుడిగా, మత్తు వదలరాతో హీరోగా కెరీర్‌ను మొదలుపెట్టాను అంటున్నారు హీరో శ్రీసింహా. ప్రముఖ సంగీత దర్శకుడు ఎమ్.ఎమ్.కీరవాణి తనయుడు శ్రీసింహా హీరోగా పరిచయమవుతున్న చిత్రం మత్తు వదలరా. రితేష్‌రానా దర్శకత్వంలో ఈ నెల 25న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ చిత్రం గురించి శ్రీసింహాతో జరిపిన ఇంటర్వ్యూ ఇది.

మత్తువదలరా సినిమా ప్రయాణం ఎలా ఆరంభమైంది?

నటన పట్ల నాకున్న ఆసక్తి గురించి నిర్మాత చెర్రికి చాలా రోజులుగా తెలుసు. రంగస్థలం ప్రారంభంకావడానికి ముందు మైత్రీ మూవీస్ నిర్మాతలకు దర్శకుడు రితేష్ ఈ కథ వినిపించారు. పెద్ద సినిమాలతో వారు బిజీగా ఉండటంతో సినిమా వెంటనే ప్రారంభంకాలేదు. రంగస్థలం సినిమాకు నేను అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేశాను. ఆ సమయంలో నటుడిగా రాణించగలననే, నాతో సినిమా చేయచ్చనే నమ్మకం నిర్మాతలు నవీన్, రవిశంకర్‌లో కలిగింది. సినిమా అంగీకరించిన తర్వాత మూడు నెలల పాటు నటనలో శిక్షణ తీసుకున్నాను. నిర్మాత చెర్రి తన బ్యానర్ క్లాప్ ఎంటర్‌టైనర్‌పై సినిమాను ప్రారంభించారు.రితేష్‌కు నాపై నమ్మకం కలిగేలా ఆరు నెలల పాటు వర్కషాప్స్, ఆడిషన్స్ చేశారు. నాన్నపై ఆధారపడకుండా నా సొంతంగా సాధించినది ఏదైనా సంతృప్తి ఉంటుంది. అందుకే నాన్నకు తెలియకుండా సినిమా చేశాను.

మీలోని నటుడ్ని ఎలా గుర్తించారు?

బాలనటుడిగా సినిమాలు చేశాను. అప్పుడే నటన పట్ల నాకున్న ఆసక్తి గురించి ఇంట్లో వారికి అర్థమైంది. అయితే నటననే కెరీర్‌గా ఎంచుకోవాలనే ఆలోచన మాత్రం ఉండేది కాదు. డిగ్రీ తర్వాత రంగస్థలం సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేశాను. అదే సమయంలో మత్తువదలరా సినిమాలో నటించే అవకాశం రావడంతో హీరోగా మారాను.

సినిమాలో నటిస్తున్న విషయం తెలియగానే కీరవాణి, రాజమౌళి ఎలాంటి సలహాలు ఇచ్చారు?

నటన పరంగా వారు ఎలాంటి సలహాలు ఇవ్వలేదు. నాన్న, రాజమౌళిగారు పనిచేసే విధానం నుంచే మేము ఎక్కువగా నేర్చుకున్నాం. వారి ప్రభావంపై మాపై చాలా ఉంది. ఇండస్ట్రీలో ఎలా ఉండాలి, పనులు ఎలా జరుగుతాయో వారి నుంచే నేర్చుకొని అలవాటుపడ్డాం.

బాలనటుడిగా ఎన్ని సినిమాలు చేశారు?

యమదొంగలో చిన్ననాటి ఎన్టీఆర్‌గా కనిపించాను. చిన్నతనం నుంచి నేను ఎన్టీఆర్ అభిమానిని. ఆయన నా సినిమా ఫస్ట్‌లుక్‌ను విడుదల చేయడం నమ్మకాన్ని ప్రోత్సాహాన్నించింది. రంగస్థలం నుంచి రామ్‌చరణ్‌తో పరిచయం ఉంది. నటనకు సంబంధించి ఆయన చాలా సలహాలు ఇచ్చారు. రానా ట్రైలర్‌ను విడుదలచేశారు.

సుకుమార్ దగ్గర మీరు అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేశారు కదా?ట్రైలర్ చూసి ఆయన ఏమన్నారు?
ట్రైలర్ చూసి ఆయన సంతోషంగా ఫీలయ్యారు. నాకు ఫోన్ చేసి బాగుందని అభినందించారు. సినిమా తొలిరోజు చూస్తానని మాటిచ్చారు.

హీరోగా నటిస్తున్న విషయం తెలియగానే రాజమౌళి ఏమన్నారు.

హీరోగా పరిచయం అవుతున్నానని తెలియగానే భవిష్యత్తు ఎలా ఉంటుంది, ప్రతిభను నిరూపించుకోగలుగుతాడా లేదా అని రాజమౌళిగారు తొలుత భయపడ్డారు. అలాగని నటన వద్దని ఏ రోజు ఆపలేదు. పూర్తి స్వేచ్ఛనిచ్చారు. కష్టపడి సినిమా చేయమని ప్రోత్సహించారు.

తొలిసినిమా ప్రేమకథనో, మాస్ సినిమానో ఎంచుకోలేదు ఎందుకని?

సినిమాలో ప్రేమ, పాటలు, ఫైట్స్ ఉంటేనే మంచి ఆరంభం అవుతుందని, పెద్ద స్టార్ అవుతారనే అనుకోవడం సరికాదు. కథ బాగుంటే ప్రేక్షకులు తప్పకుండా ఆదరిస్తారు. ఈ కథ ఉత్కంఠను పంచుతుంది. పాటలు లేకపోయినా ఎంటర్‌టైన్ చేస్తుందనే నమ్మకంతో అంగీకరించాను.

మత్తు వదలరా కథ ఏమిటి?

ఎప్పుడూ నిద్రమత్తులో ఉండే డెలివరీబాయ్‌గా సినిమాలో నేను కనిపిస్తాను. ఊరి నుంచి వచ్చి చాలిచాలని జీతంతో పనిచేసే అతడు ఓ సమస్యలో చిక్కుకుంటాడు. ఆ ఇబ్బంది నుంచి ఎలా బయటపడ్డాడన్నది ఆసక్తిని రేకెత్తిస్తుంది. మూడు రోజుల్లో జరిగే కథ ఇది. స్క్రీన్‌ప్లే ప్రధానంగా సాగుతుంది. ఒక్క నిమిషం కూడా బోర్ కొట్టదు. ఒక్కో చిక్కుముడి వీడితూ ఆద్యంతం ఉత్కంఠను పంచుతుంది.

ఈ సినిమాతోనే మీ అన్నయ్య కాలభైరవ కూడా సంగీత దర్శకుడిగా పరిచయమయ్యారు. ఒకేసారి మీరు ఇద్దరు చిత్రసీమకు పరిచయం కావడం ఎలా అనిపిస్తుంది?

నేను హీరోగా, అన్నయ్య సంగీతదర్శకుడిగా మారాలనే కలలు నేరవేర్చుకోవాలని అనుకున్నాం. కానీ ఇద్దరం కలిసి ఒకే సినిమాతో చిత్రసీమకు పరిచయం అవుతామని ఎప్పుడూ ఊహించలేదు. ఆ ఆలోచన మాకు ఎప్పుడూ రాలేదు.

వృత్తిపరంగా అన్నయ్య, మీకు మధ్య అనుబంధం ఎలా ఉండేది?

ఈ సినిమాలోకి చివరగా భాగమైన సాంకేతిక నిపుణుడు అన్నయ్య కాలభైరవనే. ఇందులో పాటలుండవు. రీరికార్డింగ్ సమయంలో తమ్ముడిగా కొన్ని సలహాలు ఇచ్చారు. అంతేకానీ హీరోగా అన్నయ్య పనిలో జోక్యం చేసుకోలేదు.

రాజమౌళి తనయుడు కార్తికేయతో పాటు మీ స్నేహితులు సినిమా చూసి ఏమన్నారు?

కార్తికేయకు మాపై చాలా నమ్మకం ఉంది. తన ప్రొడక్షన్స్‌లో ముగ్గురం కలిసి సినిమా చేసేలా కార్తికేయ ప్లాన్ చేస్తున్నారు. మంచి కథతో సినిమా చేస్తుండటంతో స్నేహితులంతా సంతోషంగా ఉన్నారు.

అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేసిన అనుభవంతో సినిమా రూపకల్పనలో రితేష్‌రానాకు ఏమైనా సలహాలు ఇచ్చారా?

స్నేహితులుగా మా మధ్య తరుచుగా చర్చలు జరిగేవి తప్పితే అతడికి నేను ఎలాంటి సలహాలు ఇవ్వలేదు. తన టీమ్‌తో కలిసి రితేష్ ఈ కథను రాసుకున్నాడు. మిగతా వారి ఇన్‌వాల్వ్‌మెంట్ ఇందులో లేదు.

భవిష్యత్తులో హీరోగా కొనసాగుతారా?దర్శకత్వం వహించే ఆలోచన ఉందా?

హీరోగానే కొనసాగుతాను. దర్శకత్వం ఆలోచన లేదు. హీరోగానే కాకుండా కథ నచ్చితే ఇతర పాత్రల్లో నటిస్తాను. రాజమౌళి గారి సినిమాలో ఒక ఫ్రేములో కనిపించిన చాలన్నది నా కల.

పెద్ద కుటుంబం నుంచి హీరోగా అరంగేట్రం చేస్తుండటంతో మీపై అంచనాలు చాలా ఉన్నాయి. వాటిని ఒత్తిడిగా ఫీలవుతున్నారా?

ఆ అంచనాల గురించి నేనెప్పుడూ ఆలోచించలేదు. వాటి పట్టించుకుంటే స్వేచ్ఛగా పనిచేయలేము. కీరవాణి, రాజమౌళి కుటుంబం నుంచి వస్తున్నాను కాబట్టి ఫలానా రీతిలో నటించాలి, కొత్తగా కనిపించాలని ఆలోచిస్తే నటనలో సహజత్వం లోపిస్తుంది. కథ, క్యారెక్టర్‌కు న్యాయం చేయడానికి నిజజీవితంలో ఎలా ఉంటానో అలాగే నటించాను. అంతేకానీ ఒత్తిడిలను మైండ్‌లో పెట్టుకొని క్యారెక్టర్‌కు న్యాయం చేయలేదు. రాజమౌళి, కీరవాణి కుటుంబం నుంచి వచ్చిన నటుడిగా నన్ను ప్రేక్షకులు చూడాలని కోరుకోవడం లేదు. నా పాత్రతో పాటు సినిమా చూసి ఎంజాయ్ చేయాలని కోరుకుంటున్నాను.

More News

నాగార్జున విడుదల చేసిన స‌ముద్ర 'జై సేన' టీజర్!!

శ్రీకాంత్‌, సునీల్‌ ప్రధాన పాత్రల్లో శ్రీకార్తికేయ, అభిరామ్‌, ప్రవీణ్‌, హరీష్‌ గౌతమ్‌లను పరిచయం చేస్తూ వి.విజయలక్ష్మి సమర్పణలో

'అమృతా రామం' ట్రైలర్ విడుద‌ల

రామ్ మిట్టకంటి, అమితా రంగనాథ్ జంటగా నటించిన చిత్రం అమృతరామ్. సురేందర్ కొంటాడి దర్శకత్వంలో ఎస్ఎన్ రెడ్డి నిర్మించిన ఈ మూవీ ట్రైలర్ విడుదలైంది.

`బొంబాట్‌`లో  `చుప్ప‌నాతి... ` లిరిక‌ల్ వీడియో సాంగ్‌ను విడుద‌ల చేసిన డైర్ట‌ర్ అనిల్ రావిపూడి

ద‌ర్శ‌కేంద్రుడు కె.రాఘ‌వేంద్ర‌రావు స‌మ‌ర్ప‌ణ‌లో సుచేత డ్రీమ్ వర్క్ ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్‌పై `ఈన‌గ‌రానికి ఏమైంది` ఫేమ్ సుశాంత్ హీరోగా,

రామ్ చేతికి అసలు గన్ ఇస్తే...

వెండితెర మీద డమ్మీ గన్ లతో ప్రత్యర్థుల మీదికి విరుచుకుపడే హీరోకి అసలైన గన్ లు చేతికి వస్తే ఎలా ఉంటుంది.

నా మాట‌ల‌కు ర‌జినీకాంత్‌గారికి సంబంధం లేదు:  రాఘ‌వ లారెన్స్‌

ఇట‌వ‌ల జ‌రిగిన `ద‌ర్బార్` ఆడియో వేడుక‌లో తాను మాట్లాడిన మాట‌ల‌కు, ర‌జినీకాంత్‌గారికి సంబంధం లేదు అని అన్నారు రాఘ‌వ లారెన్స్‌.