'క్లైమాక్స్' చిత్రంలో తన రియల్ లైఫ్ క్యారెక్టర్ లో శ్రీరెడ్డి
- IndiaGlitz, [Sunday,November 10 2019]
'డ్రీమ్' చిత్రంతో ఏడు ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివ ల్స్ లో అవార్డులు దక్కించుకున్న భవానీ శంకర్ దర్శకత్వంలో తాజాగా రూపొందుతోన్న చిత్రం 'క్లైమాక్స్'. క్రైమ్ థ్రిల్లర్ జోనర్లో ఈ చిత్రం రూపొందుతోంది. ఇందులో డా.రాజేంద్రప్రసాద్, పృథ్వీరాజ్, శివశంకర్ మాస్టర్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. సాషా సింగ్, రమేష్, చందు పాత్రలు ప్రధానంగా ఉంటాయి. ఏ విషయాన్నైనా ధైర్యంగా ప్రశ్నించే శ్రీరెడ్డి ఇందులో నిజ జీవిత కేరక్టర్‌ను పోషిస్తున్నారు. కైపాస్ ఫిల్మ్ ప్రొడక్షన్ హౌస్ పతాకంపై పి.రాజేశ్వర్ రెడ్డి, కె.కరుణాకర్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు .
దర్శకుడు భవాని శంకర్ మాట్లాడుతూ '' ఓ మర్డర్ మిస్టరీని పొలిటికల్ సెటైర్ నేపథ్యంలో అల్లుకున్నాం. మేం తీసుకున్న కథాంశం చాలా వైవిధ్యంగా ఉంటుంది. దానికి తగ్గట్టు చిత్రీకరించిన తీరు కూడా సరికొత్తగా అనిపిస్తుంది. సినిమాలో పాత్రలు సంఖ్యా పరంగా తక్కువగానే కనిపిస్తాయి. కానీ ప్రతి పాత్రా హీరోయిజాన్ని ఎలివేట్ చేస్తుంది. ప్రతి కేరక్టర్‌నూ పటిష్టంగా తీర్చిదిద్దాం. మనసులోని భావాల్ని నిర్భయంగా వ్యక్తం చేస్తూ, ఎదుటివారి స్థాయికి వెరవకుండా, నమ్మిన సిద్ధాంతాల కోసం నిలుచునే వివాదాస్పద నటిగా శ్రీరెడ్డి కనిపిస్తారు. ఆమె రియల్ లైఫ్ కేరక్టర్‌కి దగ్గరగా ఉండే పాత్ర అది. సినీ ఇండస్ట్రీలో కనిపించే స్టీరియోటైప్ ఆలోచనలకి విరుద్ధంగా ఉండే పాత్రలు, సన్నివేశాలు మా చిత్రంలో మెండుగా ఉంటాయి అన్నారు.
శ్రీరెడ్డి మాట్లాడుతూ '' వివాదాస్పద నటిగా ఈ చిత్రంలో నటించాను. క్రైమ్ థ్రిల్లర్ జోనర్లో సాగే సినిమా ఇది. నా కేరక్టర్‌కి చాలా ఇంపార్టెన్స్ ఉంది. నా కేరక్టర్ చుట్టూ కథ చాలా మలుపులు తీసుకుంటుంది. నేను పలికే ప్రతి డైలాగూ, నేను కనిపించే ప్రతి సీనూ చాలా చాలా బావుంటాయి. ఇంత మంచి కేరక్టర్ కోసం నన్ను అప్రోచ్ అయిన భవానీ శంకర్‌గారికి, టీమ్‌కి థాంక్స్'' అని అన్నారు.
నిర్మాతల్లో ఒకరైన పి.రాజేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ '' కొన్ని సినిమాలు కెరీర్లో గుర్తుండిపోతాయి. మేం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ చిత్రం కూడా అంతే గొప్ప పేరు తెచ్చిపెడుతుంది. ప్రస్తుతం షూటింగ్ చివరి దశకు చేరుకుంది. హైదరాబాద్‌లోనే మొత్తం తెరకెక్కించాం. త్వరలో ఓ పాటను రామోజీ ఫిల్మ్ సిటీలో భారీ సెట్ వేసి తెరకెక్కిస్తాం'' అని తెలిపారు.
నటీనటులు: డా.రాజేంద్రప్రసాద్, పృథ్వీరాజ్, శివశంకర్ మాస్టర్, సాషా సింగ్, రమేష్, చందు తదితరులు