కెప్టెన్‌గా శ్రీహాన్.. మళ్లీ బావ కౌగిట్లోకి ఇనయా, ఆదిరెడ్డికి సర్ప్రైజ్
Send us your feedback to audioarticles@vaarta.com
బిగ్‌బాస్ 6 తెలుగు సీజన్ ఇప్పుడిప్పుడే రసవత్తరంగా సాగుతోంది. ముఖ్యంగా టాస్క్‌లు మంచి మజాను ఇస్తుండగా.. ఊహించని ట్విస్టులతో ఇంటి సభ్యులు ఎంటర్టైన్ చేస్తున్నారు. ప్రతి ఒక్కరిలో గెలవాలనే కసి కనిపిస్తోంది. గొడవలు, వివాదాలు జరుగుతున్నప్పటికీ.. అంతిమ లక్ష్యం విజయమే అన్నట్లుగా ముందుకు సాగుతున్నారు. తన స్ట్రాటజీతో రేవంత్‌ను సైడ్ చేసి.. శ్రీహాన్ కెప్టెన్ అయ్యేలా చేసింది గీతూ. అందరి మద్దతుతో కెప్టెన్ అయిన శ్రీహాన్... కుర్చీలో కూర్చోని మీసం మెలేశాడు. ఇక అతని మద్ధతుతో గీతూ, శ్రీసత్యలు ఓవరాక్షన్ చేస్తూ కనిపించారు.
ఇక కెప్టెన్ అవ్వగానే శ్రీహాన్‌కు పెద్ద పరీక్షే పెట్టాడు బిగ్‌బాస్. వరస్ట్ పర్ఫార్మర్ ఎవరో చెప్పి.. వారిని జైల్లో పెట్టాల్సిందిగా ఆదేశించాడు. దీంతో శ్రీహాన్ బాలాదిత్యను సెలెక్ట్ చేసుకుంటూ అతని ముఖానికి ఎర్ర రంగు పూశాడు. ఈ నిర్ణయంపై నెటిజన్లు పెదవి విరుస్తున్నారు. నిజానికి ఈ వారం బాలాదిత్య తన శక్తి మేరకు ఆడాడు. అస్సలు ఏమి ఆడని ఆదిరెడ్డి, వాసంతిలు అతనికి కనిపించలేదా అంటూ విమర్శలు చేస్తున్నారు. అయితే గీతూ కోసమే శ్రీహాన్ అలాంటి నిర్ణయం తీసుకున్నాడనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. నిజానికి గీతూకి ఇంట్లో తొలి టార్గెట్ రేవంత్ అయితే, ఆ తర్వాత బాలాదిత్యపైనే గురి. ఈ రోజు కూడా కిచెన్‌లో గీతూ, బాలాదిత్యల మధ్య గొడవ జరిగింది. కూరగాయలు కోస్తుండగా దాని తొక్కలు డస్ట్ బిన్లో వేయొచ్చు కదా అని బాలాదిత్య ఆగ్రహం వ్యక్తం చేశాడు. దీనికి గీతూ పాప యాటిడ్యూడ్ చూపించింది. సరిగ్గా సమాధానం చెబితే మన గీతక్క ఎందుకు అవుతుంది. నాకేం అవసరం, నువ్వే వేసుకో అంటూ చెప్పింది.
ఇకపోతే.. మన ఇనయా- సూర్యల యవ్వారం మళ్లీ మొదలైంది. కెప్టెన్సీ పోటీదారుల ఎంపికలో తనకు అవకాశం రాకపోవడంతో ఎంతో బాధపడింది ఇనయా. ఇదే అదనుగా ఆమెను ఓదారుస్తూ హగ్గుల పర్వం స్టార్ట్ చేశాడు సూర్య. అంతే తర్వాతి రోజు నుంచి మళ్లీ వీరిద్దరూ దగ్గరై కనిపించారు. ఇనయా బ్రాస్లెట్ రేవంత్ దగ్గర వుండటంతో దానిని తీసేసుకున్నానని సూర్య చెప్పాడు. నిన్ను బాగా మిస్స్ అవుతున్నానని ఇనయా కూడా మనసులోని ఫీలింగ్ చెప్పింది. శ్రీహాన్ అన్నట్లు ఇనయా రంగులో మార్చడంలో ఊసరవెల్లిని కూడా మించిపోతుందని అర్ధమవుతోంది. ఏది ఏమైనా రానున్న రోజుల్లో సూర్య - ఇనయాల రొమాన్స్‌తోనే ఎపిసోడ్స్ వుంటాయన్న మాట.
తర్వాత ఇంటి సభ్యులకు ‘‘యమహా కాల్ ఆఫ్ ది బ్లూ’’ అనే టాస్క్ ఇచ్చాడు బిగ్‌బాస్. ఇందులో కీర్తి, రోహిత్, రేవంత్, శ్రీసత్యలు పాల్గొన్నారు. ఈ గేమ్‌కి ఇనయా సంచాలక్‌గా వ్యవహరించింది. అయితే ఆమె విన్నర్‌గా రోహిత్ పేరు చెప్పగానే రేవంత్‌కి ఎక్కడో కాలింది. నాకు ఇవ్వకుండా అతనికి ఎలా ఇస్తావంటూ అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ఇదిలావుండగా.. ఆదిరెడ్డికి బిగ్‌బాస్ సర్ప్రైజ్ ఇచ్చాడు. బిగ్‌బాస్ స్క్రీన్ మీద ఆదిరెడ్డి ఫ్యామిలీ కనిపించింది. ఈ సందర్భంగా అతని భార్య, కూతురు, చెల్లెలు కనిపించారు. ఆదిరెడ్డి కుమార్తె హద్విత ఫస్ట్ బర్త్ డే కావడంతో చిన్నారికి కేక్ కట్ చేస్తున్నారు ఫ్యామిలీ మెంబర్స్. తన కుటుంబాన్ని చాలా రోజుల తర్వాత చూసుకోవడంతో ఆదిరెడ్డి గాల్లో తేలాడు. రేపు వీకెండ్ కావడంతో హోస్ట్ నాగార్జున సందడి చేయనున్నారు. మరి ఎవరికి వార్నింగ్‌లు వుంటాయో, ఎవరికి కాంప్లిమెంట్స్ ఇస్తారో తెలియాలంటే రేపటి వరకు ఆగాల్సిందే.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments