జంట నగరాల్లో వేలకొలది ముత్తయిదువలకు శ్రావణ కానుక - పురాణపండ శ్రీనివాస్
- IndiaGlitz, [Tuesday,August 13 2019]
శుభాలకు వేదిక శ్రావణ మాసం. ఈ పవిత్ర మాసంలో చేసే మంగళ కర్మలకు ఫలసమృద్ధి సంతోషంగా చేకూరుతుందని మన స్త్రీలకు తరతరాలుగా విశ్వాసం. ఇలాంటి చక్కని నమ్మకాన్ని అనుష్టానంతో శ్రీ కార్యంగా నిర్వహించడంకోసమేప్రముఖ రచయిత పురాణపండ శ్రీనివాస్ ‘ అమృత కటాక్షం’ గ్రంధాన్ని శ్రీమహాలక్ష్మీ దేవి కృపగా అందించారు. కొల్హాపురి శ్రీమహాలక్ష్మి ముఖ పద్మ శోభతో కూడిన ముఖచిత్రంతో అందిన ఈ మంగళ ధార్మిక గ్రంధంలో కేవలం శ్రీ మహాలక్ష్మి అనుగ్రహ మంత్రశక్తిమాత్రమే మనకు ఉపదేశంగా అందింది. మంగళ శబ్దానికి అర్ధంగా ఉందీ గ్రంధం. విశేషించి అమ్మ వారి దీప్తి, స్ఫూర్తి,శ్రేష్టతతో మంత్రమయంగా అందిన ఈ చక్కని పుస్తకం శాస్త్రమర్యాదను సంతరించుకుందనడంలో సందేహం లేదు.
శ్రీనివాస్ ఇందులో కేవలం రెండు, మూడు వ్యాఖ్యానాలనుంచినప్పటికీ అతిసరళంగా, సుబోధకంగా అందమైన భాషతో పాఠకులకు అందడం ఆనందదాయకం. అక్కడక్కడా బంగారంలాంటి శ్రీరూప సౌందర్యమయ వరలక్ష్మీ చిత్రాలు ఈ పుస్తకంలో పొదగడం జ్ఞానమయంగా ఆకట్టుకుంటుంది. పుస్తకం చిన్నదైనా అమృతంలా ఆప్యాయనమవుతుంది. ప్రతీ పర్వదినానికి మనింట మంత్రరాశిని పొంగించి సంప్రదాయ కర్మలను ప్రార్థనలతో గుర్తుకు తెస్తున్న పురాణపండ శ్రీనివాస్ విశేష కృషిని అభినందించాల్సిందే.
గతంలో నేనున్నాను,అమ్మణ్ణి వంటి భారీ గ్రంధాల ప్రచురణకర్తలైన సహృదయులు ,ప్రముఖ నిర్మాతలు, వారాహి సంస్థ అధినేతలు సాయి కొర్రపాటి,శ్రీమతి రజని కొర్రపాటి స్వయంగా దగ్గరుండి ఈ మహత్తుల ‘ అమృత కటాక్షం ‘ గ్రంధాన్నిజంటనగారాల అమ్మవార్ల ఆలయాలైన జూబిలీహిల్స్ పెద్దమ్మ గుడి, సికిందరాబాద్ ఉజ్జయిని మహంకాళి గుడి, అమీర్ పేట కనకదుర్గమ్మ గుడి , కూకట్ పల్లి శ్రీవెంకటేశ్వర స్వామి గుడి , ఫిలిం నగర్ దైవ సన్నిధానం వంటి అనేక ఆలయాల్లో వరలక్ష్మీ వ్రత వైభవాల్లో పాల్గొన్న వేలాది ముత్తయిదువులకు బహూకరించి అమ్మవారి కృపకు పాత్రులయ్యారు.
బహుశా తెలుగు రాష్ట్రాల్లో ఈ రకంగా బుక్స్ అపురూపంగా అందించడంలో పురాణపండ శ్రీనివాస్ మాత్రమే తొలి వరుసలో పవిత్రంగా నిలిచారని , ఉచితంగా ఇవ్వడమనే ఈ అద్భుతం ఒకరకంగా సాహసోపేతమని తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాల కొందరుమంత్రుల సతీమణులు, ప్రభుత్వఅధికారులు సైతం అభినందనలు వర్షిస్తున్నారు. ఈ చక్కని కార్యానికి శ్రీనివాస్ వెనుక సినీ ,రాజకీయ ప్రముఖులతో పాటు కొందరు ఐ.ఏ.ఎస్ అధికారులు, న్యాయమూర్తులు ప్రోత్సాహకులుగా ఉండటం గమనార్హం.