రాయలసీమ వరకు పవన్ కు నా మద్దతు - సీనియర్ నటుడు నరేష్
- IndiaGlitz, [Monday,November 21 2016]
కామెడీ చిత్రాల కథానాయకుడుగా...ఎన్నో సక్సెస్ ఫుల్ మూవీస్ లో నటించి...నేడు క్యారెక్టర్ ఆర్టిస్టుగా విభిన్న పాత్రలతో ఆకట్టుకుంటున్న సీనియర్ నటుడు నరేష్. నిత్యామీనన్ ప్రధాన పాత్రలో శ్రీప్రియ తెరకెక్కించిన విభిన్న కథా చిత్రం ఘటన. ఈ చిత్రంలో నరేష్ విలన్ గా నటించి మెప్పించారు. ఈ సందర్భంగా ఘటన మూవీ గురించి ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ గురించి సీనియర్ నటుడు నరేష్ చెప్పిన విశేషాలు ఆయన మాటల్లోనే...
కృష్ణ - ఎస్వీఆర్ స్పూర్తి..!
హీరోగా 100 చిత్రాలకు పైగా నటించాను. నాకు హీరోగా కృష్ణ గారు స్పూర్తి అయితే....క్యారెక్టర్ ఆర్టిస్టుగా ఎస్వీఆర్ స్పూర్తి. క్యారెక్టర్ ఆర్టిస్టుగా మారిన తర్వాత దృశ్యం, భలే భలే మగాడివోయ్, అ ఆ, గుంటూరు టాకీస్...ఇలా గత రెండు సంవత్సరాలుగా క్యారెక్టర్ ఆర్టిస్టుగా మంచి పాత్రలు పోషించే అవకాశం వచ్చింది. దృశ్యం సినిమాలో ఎమోషనల్ ఫాదర్ గా నటిస్తే గుంటూరు టాకీస్ లో పాత్ర నన్ను మాస్ ఆడియోన్స్ కు దగ్గర చేసింది. ఆతర్వాత అ ఆ సినిమాలో తండ్రి పాత్రలో కొత్త యాంగిల్ లో నటించాను. ఈ రెండు సంవత్సరాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా సక్సెస్ ఫుల్ మూవీస్ లో నటించినందుకు చాలా సంతోషంగా ఉంది.
నవరస నటుడు అంటే అన్నీ చేయాలి..!
హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా ఎన్నో సినిమాల్లో నటించిన నాకు విలన్ గా నటించలేదే అనే అసంతృప్తి ఉంది. అయితే...అనుకోకుండా ఘటన సినిమాలో విలన్ గా నటించే అవకాశం వచ్చింది. దర్శకురాలు శ్రీప్రియ ఘటన సినిమాలో విలన్ క్యారెక్టర్ కి నేను అయితేనే బాగుంటాను అని నాతో ఆ క్యారెక్టర్ చేయించారు. నా పై నమ్మకంతో నాతో విలన్ పాత్ర చేయించిన శ్రీప్రియకు థ్యాంక్స్ తెలియచేస్తున్నాను. ఫస్ట్ టైమ్ విలన్ గా నటించిన నాకు ఊహించని విధంగా ఇండస్ట్రీలోని హీరోలు, దర్శకనిర్మాతలు విలన్ గా అద్భుతంగా నటించావ్ అని అభినందిస్తుండడం ఆనందంగా ఉంది. ఇక నుంచి విలన్ గా నటించేందుకు నేన రెడీగా ఉన్నాను. యాక్షన్ మూవీస్ లో విలన్ గా నటించాలి అనుకుంటున్నాను.
శతమానం భవతి - సరికొత్త గెటప్..!
శర్వానంద్ హీరోగా వేగేశ్న సతీష్ దర్శకత్వంలో రూపొందుతున్న శతమానం భవతి సినిమాలో నటిస్తున్నాను. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రంలో ఓ మంచి పాత్ర పోషిస్తున్నాను. ఇంకా చెప్పాలంటే ఈ మూవీలో బంగార్రాజు అనే కీలక పాత్ర పోషిస్తున్నాను. ఇందులో నా గెటప్ బాడీ లాంగ్వేజ్ చాలా కొత్తగా ఉంటాయి. ఈ సినిమాతో నా కెరీర్ లో గుర్తుండే పాత్రగా మంచి పేరు వస్తుంది అని ఆశిస్తున్నాను.
మా లో కొత్త నిర్ణయాలు..!
మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ జాయింట్ సెక్రటరీగా పేద కళాకారులను ఆదుకునేందుకు నావంతు ప్రయత్నం చేస్తున్నాను. అలాగే కళాకారులకు హౌసింగ్ లోన్స్ కోసం కొత్త నిర్ణయాలు తీసుకున్నాం. వాటిని త్వరలో తెలియచేస్తాను. తెలుగు నటుల్లో అన్నిరకాల పాత్రలు చేయగల నటులు ఉన్నా ఇండస్ట్రీ ఉపయోగించుకోవడం లేదు. పరభాషా నటులు వద్దు అని చెప్పడం లేదు...వాళ్లు చేసే పాత్రలు చేయగల మన నటులు ఉన్నప్పడు మనవాళ్లను ఉపయోగించుకోవాలి అని చెబుతున్నాను.
రాయలసీమ వరకు పవన్ కు నా మద్దతు..!
రాయలసీమలో నేను కళాకారుల ఐక్యవేదిక పేరుతో ఒక సంస్థ స్ధాపించి 18,000 కళాకారులకు సహాయ సహకారాలు అందించాను. పవన్ కళ్యాణ్ అనంతపురం కరువు గురించి మాట్లాడడం...తన వంతు సహాయం చేస్తాను అనడం నిజంగా అభినందనీయం. రాష్ట్రంలో కొత్త ప్రాంతీయ పార్టీ అవసరం ఎంతైనా ఉంది. నేను బి.జె.పి కి దూరంగా ఉన్నాను. అలాగని పార్టీని విడలేదు. పవన్ జనసేన పార్టీలోకి ఆహ్వానిస్తే వస్తారా అని అడిగితే...ప్రస్తుతం నా దృష్టి అంతా సినిమాల మీదే ఉంది. రాయలసీమ వరకు పవన్ కు నా మద్దతు ఉంటుంది అని తెలియచేసారు.