Spyder Review
కొన్ని క్రేజీ కాంబినేషన్స్ ప్రేక్షకుల్లో ఎప్పుడూ ఆసక్తిని కలిగిస్తుంటాయి. ఈ ఆసక్తితో పాటు అంచనాలను రెట్టింపు చేస్తాయి. అలా భారీ అంచనాల నడుమ విడుదలకు సిద్ధమైన చిత్రం `స్పైడర్`. ఈ సినిమాపై భారీ క్రేజ్ క్రియేట్ కావడానికి ముఖ్యమైన కారణాల్లో ముందు హీరో మహేష్. సూపర్‌స్టార్ ఇమేజ్ ఉన్న మహేష్ నటించిన చిత్రం అంటే మామూలుగానే ఎన్నో అంచనాలుంటాయి. అలాంటిది ఎ.ఆర్.మురుగదాస్ దర్శకత్వంలో మహేష్ హీరోగా నటించిన సినిమా అంటే ఇంకెన్ని అంచనాలుంటాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. హీరోలను ప్రత్యేకమైన స్టయిల్‌లో విభిన్నంగా చూపించే దర్శకుడు ఎ.ఆర్.మురుగదాస్. ప్యాన్ ఇండియా డైరెక్టర్‌గా ఈయనకున్న క్రేజ్ ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. మరి ఇన్ని భారీ అంచనాల నడుమ విడుదలైన స్పైడర్ అభిమానులు ఆకట్టుకుందా? లేదా? అనే విషయాన్ని తెలుసుకోవాలంటే సినిమా కథలోకి వెళ్లాల్సిందే..
కథ:
శివ (మహేశ్) ఇంటలిజెన్స్ బ్యూరోలో పనిచేస్తుంటాడు. టాప్ ఫ్లోర్‌లో కాకుండా అండర్ గ్రౌండ్‌లో ఇంటిలిజెన్స్ బ్యూరోకి కావాల్సిన సమాచారాన్ని అందించే విభాగంలో పనిచేస్తుంటాడు. పబ్లిక్ పర్సనల్ కాల్స్ ని వినడం తప్పు అని, అలాంటి చర్యలకు ఎవరూ పాల్పడకూడదని ఆఫీసర్లు ఆర్డర్ పాస్ చేస్తాడు. అయితే వాళ్లు వద్దన్నపనినే చేస్తుంటాడు శివ. హెల్ప్, ఏడుపు సౌండ్స్ ఎక్కడ వినిపించినా తన సిస్టమ్‌లో బీప్ మోగేలా కొత్త సాఫ్ట్ వేర్‌లను తనంతట తాను సిద్ధం చేసుకుంటాడు. వాటిని తన సిస్టమ్స్ తో కలిపి వాడుకుంటాడు. నేరం జరగకముందు ఆపాలన్న ధ్యేయంతో పనిచేస్తుంటాడు. ఆ క్రమంలోనే అతనికి చార్లీ (రకుల్ ప్రీత్ సింగ్) గొంతు వినిపిస్తుంది. ఆమె వివరాలు కనుక్కుని 28 రోజులు ఫాలో చేస్తుంటాడు. ఎదుటివ్యక్తి గురించి ఏమీ తెలియకుండా, అతనితో బ్లైండ్ డేట్ చేయాలనే కోరిక చార్లీది. 96శాతం మార్కులు తెచ్చుకున్న ఆమె బ్లైండ్ డేట్ చేస్తే చదువు మీద ఏకాగ్రత పెరిగి 98 శాతం మార్కులు తెచ్చుకుని యు.ఎస్.లో స్కాలర్‌షిప్ సంపాదించాలని అనుకుంటుంది. బ్లైండ్ డేట్‌కు శివ కరెక్ట్ గా సరిపోతాడని కూడా భావిస్తుంది. చార్లీ ఫోన్ విన్నట్టే శివ ఇంకో ఫోన్ వింటాడు. ఆ ఫోన్‌లో మాట్లాడిన అమ్మాయిని రక్షించబోయి తన స్నేహితురాలిని పోగొట్టుకుంటాడు. దాంతో వెక్స్ అయి ఉద్యోగాన్ని వదిలేయాలని భావిస్తాడు. కానీ అది పరమార్థం కాదని, నేరాలకు పాల్పడిన వారిని పట్టుకోవాలని కూపీలాగుతాడు. ఆ క్రమంలో అతనికి భైరవుడు (ఎస్.జె.సూర్య), అతని తమ్ముడు (భరత్) గురించి తెలుస్తుంది. జనాభా సంఖ్యను తగ్గించడానికి ప్రభుత్వం, భూకంపాలులాగా ఈ భైరవుడు ఎలా పనిచేశాడు? అయినా మనుషులను చంపాలని అతనికి ఎందుకు అనిపిస్తుంది? వంటివన్నీ కథలో ఇంట్రస్టింగ్‌పాయింట్స్.
ప్లస్ పాయింట్స్:
తీసుకున్న ప్లాట్ కొత్తగా ఉంది. మారుతున్న కాలానికి అనుగుణంగా హీరో చేసే ప్రొఫెషన్‌ని చూస్ చేసుకోవడం బావుంది. పాటలు కొన్ని బావున్నాయి. మహేశ్ అన్ని యాంగిల్స్ లోనూ బాగా చేశారు. శాడిస్ట్ పాత్రలో ఎస్.జె.సూర్య చాలా సహజంగా నటించారు. అతని ప్రియమైన తమ్ముడి పాత్రలో భరత్ బావున్నాడు. రకుల్ తన గత చిత్రాలకు భిన్నంగా కళ్లద్దాలతో మెడికోగా కనిపించింది. పాటలు అక్కడక్కడా బావున్నాయి. కెమెరా పనితనం సందర్భానుసరంగా ఉంది. ఇంట్లో వారు ఆపదలో ఉన్నప్పుడు మనం దూరంగా ఉంటే, మనం చేరుకోవడానికి సమయం పడుతుందనుకుంటే, మనకన్నా ముందు ఇంటి తలుపులు తట్టే వారు.. వాటర్ కేన్ వ్యక్తి, పిజ్జా బోయ్, క్యాబ్ వాలా.. ఇంకా చాలా మంది ఉంటారు. అలాంటివారిని మన ఇంటికి పంపాలనే ఆలోచన బావుంది. పెళ్లయిన స్త్రీలు చేతకాని వారు కాదు. వాళ్ల కాలేజీ రోజుల్లో వాళ్లు స్టేట్ ర్యాంకులు, ఎన్‌సీసీలు.. ఇంకా చాలా వాటిల్లో ముందుండే ఉంటారు. కానీ పెళ్లయిన తర్వాత వారిలోని టాలెంట్ మరుగున పడుతుంది. అలా మరుగున పడ్డ టాలెంట్‌ను గుర్తించి ప్రోత్సహిస్తే వారు కూడా తెగువ చూపించగలరని చెప్పడం బావుంది.
మైనస్ పాయంట్లు:
కథ ఫ్లాట్‌గా సాగింది. స్క్రీన్‌ప్లేలో ఎక్కడా కొత్తదనం లేదు. తర్వాత ఏం జరుగుతుందో ముందే తెలిసిపోతుంది. దాంతో మిగిలిన సన్నివేశాలను లాక్కురావడం దర్శకుడికి కష్టంగా మారింది. ఆలోచింపజేసే మంచి డైలాగ్ కానీ, థ్రిల్ కలిగించే ట్విస్ట్ గానీ సినిమాలో లేవు. ఫస్ట్ పాటలోని కొన్ని లైన్లు కాపీ ట్యూన్‌లుగా వినిపిస్తాయి. ఆ తర్వాత వచ్చే పాటల్లోనూ హమ్మింగ్స్ విన్నప్పుడు కాపీ ట్యూన్లని అర్థమైపోతాయి. తెలుగు, తమిళ్ రెండు భాషల్లో చేసినప్పటికీ తల్లిపాత్రతో పాటు మరికొన్ని పాత్రలకు వేర్వేరుగా ఆర్టిస్టులను తీసుకుని ఉంటే మనవారికి మరికాస్త కనెక్ట్ అయి ఉండేది. డిజిటల్ హ్యాకింగ్, ఫోన్ రికార్డింగ్, ట్రాపింగ్, సీరియల్ మధ్యలో సిగ్నల్స్ హ్యాక్ చేసి, అమాంతం వేరే వ్యక్తి కనిపించడం, అప్పటికప్పుడు ఆ విషయాన్ని చానెల్‌కి చెప్పి కన్విన్స్ చేయడం వంటివి బీ,సీ ప్రేక్షకులకు పెద్దగా అర్థం కావు. అన్నిటికన్నా మించి ఇంటలిజెన్స్ బ్యూరో అధికారులు కూడా ఓ సామాన్య ఎంప్లాయి చెప్పే బెనిఫిట్ ప్లాన్స్ గురించి, రిటైర్‌మెంట్ పెన్షన్ గురించి ఆలోచించి, అతని వెనకాల మామూలు వ్యక్తిగా వెళ్లడం అనేది కన్విన్సింగ్‌గా అనిపించదు. పవర్‌ఫుల్ పోలీస్ అధికారులు కూడా శివ వెనుక నిలబడి చోద్యం చూసినట్టు చూడటం, పడిపోయే బిల్డింగ్‌లో శివ ఒక్కడే ఫైట్ చేయడం మింగుడుపడని అంశాలు. రోలర్ కోస్టర్ ఫైట్‌తో పాటు మరికొన్ని చోట్ల గ్రాఫిక్స్ పరంగా పెద్దగా నాణ్యత కనిపించదు.
సమీక్ష:
మహేష్ అంటే ఉన్న క్రేజ్ వేరు. లుక్ పరంగా, నటన పరంగా, డ్యాన్సులు పరంగా మహేష్ గురించి కొత్తగా చెప్పనవసరం లేదు. స్పైడర్ సినిమా విషయానికి వస్తే, మహేష్ లుక్స్ పరంగా చాలా బాగా కనపడ్డాడు. ఇక క్యారెక్టర్ పరంగా తను చేసిన నటన, పాటల్లో డ్యాన్సులు, ఫైట్స్ అన్నింటిలో మహేష్ మరోసారి తన ఎనర్జిటిక్ ఫెర్ఫామెన్స్ చేశాడు. రకుల్ పాత్ర గురించి చెప్పాలంటే మెడికల్ స్టూడెంట్‌గా కనపించిన రకుల్ పాత్రకు కథ పరంగా పెద్దగా ప్రాధాన్యం దక్కలేదు. డీ గ్లామర్‌గా కనపడటానికి కారణమేంటో మరి. ఇక మహేష్, రకుల్ మధ్య సన్నివేశాలు లవ్ సన్నివేశాల్లా అనిపించవు. ఇద్దరు స్నేహితులు కామన్‌గా మాట్లాడుకున్నట్లు కనపడతాయి. అసలు మార్కులు కోసం హీరోయిన్ బ్లైండ్ డేట్ చేయాలనుకోవడం ఎంటో అర్థం కాలేదు. ఇక మెయిన్ విలన్‌గా నటించిన ఎస్.జె.సూర్య సైకో పాత్రలో ఒదిగిపోయాడు. దర్శకుడు కావడంతో పాటు పలు చిత్రాల్లో నటించడం వల్ల ఎస్‌జె.సూర్య పాత్రలో ఒదిగిపోయాడు. మానసికరోగిలా చక్కగా నటించాడు. ఇక భరత్ క్యారెక్టర్ కూడా కథలో చిన్నదే అయినా, తన పాత్ర పరంగా భరత్ చక్కగానే నటించాడు. ఇక సినిమాలో హీరో స్నేహితులుగా నటించిన ప్రియదర్శి, ఆర్.జె.బాలాజీ వారి వారి పాత్రలకు న్యాయం చేశారు. ఇక షాయాజీ షిండే, నాగినీడు, జయప్రకాష్ సహా అందరూ వారి వారి పాత్రలకు న్యాయం చేశారు. ఇక మురుగదాస్ సినిమాలంటే తెలుగు ప్రేక్షకులకు గజినీ, తుపాకీ సినిమాలే గుర్తుకు వస్తాయి. అందుకు కారణం మురుగదాస్ క్యారెక్టర్స్‌ను డిజైన్ చేసిన తీరు, కథ, కథనం. కానీ స్పైడర్ విషయంలో మురుగదాస్ బలమైన కథ, కథనం రాసుకోలేదు. హీరోయిజం ఎలివేషన్‌లో కూడా పెద్ద వర్కువుట్ చేసినట్లు కననపడలేదు. కథలో లాజిక్స్ మిస్ అయ్యాడు. ఇక సినిమాకు ప్లస్ అయిన సన్నివేశాలంటే రోలర్ కోస్టర్ ఫైట్ సీన్, ప్రీ క్లైమాక్స్‌లో సూర్యను పట్టుకోవడంలో పోలీసులకు మహిళలు ఎలా సపోర్ట్ చేశారో చూపే సన్నివేశం, హీరో, విలన్ మధ్య జరిగే మైండ్ గేమ్ సీన్స్ ప్రేక్షకులను మెప్పిస్తాయి. హేరీస్ జైరాజ్ సంగీతం సినిమాకు ప్లస్ కాలేదనే చెప్పాలి. ట్యూన్స్ సరిగ్గా లేవు. ఇక బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ బాగానే ఉంది. సంతోష్ శివన సినిమాటోగ్రఫీ సినిమాకు పెద్ద ఎసెట్ అయ్యింది. నిర్మాణ విలువలు చాలా రిచ్‌గా ఉన్నాయి.
బాటమ్ లైన్: స్పైడర్.. పరావాలేదనిపించాడంతే
Spyder Movie Review in English
- Read in English