Khudiram Bose: డిసెంబర్ 22న పార్లమెంట్ సభ్యుల కోసం ‘ఖుదీరామ్ బోస్’ ప్రత్యేక ప్రదర్శన
- IndiaGlitz, [Thursday,December 22 2022]
ఈరోజు మనం అనుభవిస్తున్న స్వేచ్ఛ, స్వాతంత్య్రాల కోసం ఎందరో మహనీయులు వారి ప్రాణాలను తృణ ప్రాయంగా త్యజించారు. వారందరిదీ ఒక్కో చరిత్ర. అలాంటి వారిలో ఖుదీరామ్ బోస్ ఒకరు. దేశం కోసం చిన్న వయసులోనే ప్రాణ త్యాగం చేసి అమరుడయ్యారు ఖుదీరామ్ బోస్ (Khudiram Bose). ప్రస్తుతం ఇండియన్ సినిమాల్లో బయోపిక్స్ హవా నడుస్తుంది. ఆ ట్రెండ్‌లో పాన్ ఇండియా మూవీగా రూపొందిన చిత్రం ‘ఖుదీరామ్ బోస్’. జాగర్లమూడి పార్వతి సమర్పణలో గోల్డెన్ రెయిన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై డి.వి.ఎస్.రాజు దర్శకత్వంలో రజితా విజయ్ జాగర్లమూడి ఈ చిత్రాన్ని నిర్మించారు. రాకేష్ జాగర్లమూడి (Rakesh Jagarlamudi)టైటిల్ పాత్రలో నటించారు.
తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, బెంగాలీ, హిందీ భాషల్లో రూపొందిన ఈ చిత్రాన్ని ఇటీవల గోవాలో జరిగిన ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియాలో ప్రదర్శించగా చాలా మంచి స్పందన వచ్చింది. అలాగే డిసెంబర్ 22న గురువారం సాయంత్రం ఆరు గంటలకు ‘ఖుదీరామ్ బోస్’ చిత్రాన్ని గౌరవనీయులైన పార్లమెంట్ సభ్యులకు ప్రదర్శించనున్నారు. న్యూఢిల్లీ మహదేవ్ రోడ్‌లోని ఫిల్మ్స్ డివిజన్ ఆడిటోరియంలో ఈ ప్రదర్శన జరగనుంది. దీనికి సంబంధించి సంబంధిత ఫిల్మ్స్ డివిజన్ అన్నీ ఏర్పాట్లను చేయాల్సిందని మినిస్టరీ ఆఫ్ ఇన్‌ఫర్మేషన్ అండ్ బ్రాడ్‌కాస్టింగ్ తరఫున ప్రభుత్వ సెక్రటరీ సురజిత్ ఇందు ఆదేశాలను జారీ చేశారు.
ఈ చిత్రానికి సంగీత దర్శకుడిగా మణిశర్మ, ప్రొడక్షన్ డిజైనర్‌గా నేషనల్ అవార్డ్ విన్నర్ తోట తరణి, స్టంట్ డైరెక్టర్‌గా కనల్ కన్నన్, సినిమాటోగ్రాఫర్‌గా రసూల్ ఎల్లోర్, ఎడిటర్‌గా మార్తాండ్ కె.వెంకటేష్ బాధ్యతలను నిర్వహించగా బాలాదిత్య రైటర్‌గా వర్క్ చేశారు.