Exclusive : బాలయ్యను కలవబోతున్నా.. రీ ఎంట్రీ పక్కా, త్వరలోనే హైదరాబాద్‌కి : సింహాద్రి హీరోయిన్ అంకిత
Send us your feedback to audioarticles@vaarta.com
అగ్ర దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన చిత్రం ‘‘సింహాద్రి’’. ఇద్దరూ కెరీర్ స్టార్టింగ్‌లో చేసిన ఈ సినిమా రికార్డుల దుమ్ముదులిపింది. 20 ఏళ్ల కిందట ప్రభంజనం సృష్టించిన ఈ సినిమాను జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు కానుకగా రీ రిలీజ్ చేస్తున్నారు. దీనికి సంబంధించి ఇటీవల ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా ఘనంగా నిర్వహించారు. ఈ నేపథ్యంలో ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన హీరోయిన్‌గా నటించిన అంకిత ‘‘IndiaGlitz’’కి వర్చువల్‌గా ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా అంకిత ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.
ఎన్టీఆర్ నా శ్రేయోభిలాషి :
సింహాద్రి సినిమాలో నటించడం తనకు ఎంతో గర్వంగా వుందన్నారు. కొన్ని సినిమాలు ప్రత్యేకంగా నిలిచిపోతాయని అలాంటి వాటిలో సింహాద్రి కూడా ఒకటని అంకిత అన్నారు. ప్రస్తుతం తాను అమెరికాలో వంటున్నానని.. త్వరలోనే మళ్లీ ఎంట్రీ ఇస్తానని ఆమె స్పష్టం చేశారు. లాహిరి లాహిరి సినిమాలో చేస్తుండగా తన పేరును ఎన్టీఆరే రాజమౌళికి సిఫారసు చేశారని అంకిత అన్నారు. ఆర్ఆర్ఆర్ సినిమాను తాను చూశానని.. ఆస్కార్ అవార్డ్ అందుకున్న తొలి తెలుగు సినిమా కావడం, అలాంటి వ్యక్తులతో నేను కూడా పనిచేయడం గర్వంగా వుందన్నారు. ఎన్టీఆర్ సెట్స్‌లో అందరికీ గౌరవం ఇచ్చేవారని.. అప్పట్లో అందరూ హార్డ్ వర్క్ చేసేవారని అంకిత తెలిపారు. ప్రస్తుతం విదేశాల్లో వుండటం వల్ల ఎన్టీఆర్‌తో టచ్‌లో లేనని.. కానీ ఆయన తన శ్రేయోభిలాషి అని ఆమె చెప్పారు.
త్వరలో మళ్లీ రీ ఎంట్రీ ఇస్తా :
తెలుగు సినీ పరిశ్రమను, హైదరాబాద్ నగరాన్ని తాను ఎంతో మిస్ అవుతున్నానని.. మంచి కథ దొరికితే ఖచ్చితంగా రీ ఎంట్రీ ఇస్తానని అంకిత తెలిపారు. తాను ఇటీవల ‘‘మనస్వి’’ అనే సినిమా చేశానని అది ఓటీటీలో రిలీజ్ అయ్యిందని తెలిపారు. సింహాద్రి అంత పెద్ద హిట్ అవుతుందని తాము అనుకోలేదని అంకిత చెప్పారు. చిత్ర విజయాన్ని ఘనంగా జరుపుకున్నామని.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో విజయోత్సవ యాత్రలు చేశామని ఆమె గుర్తుచేసుకున్నారు. దుబాయ్, కువైట్‌లలో జరిగిన సక్సెస్ సెలబ్రేషన్స్‌లో ఎన్టీఆర్‌తో పాటు పాల్గొన్నామని ఆమె తెలిపారు.
రాజమౌళి ఈ స్థాయికి వస్తారని అప్పుడే ఊహించా :
రాజమౌళి ఖచ్చితంగా దేశం గర్వించే దర్శకుడిగా ఎదుగుతారని తాను అనుకున్నానని అంకిత వెల్లడించారు. ఆయన క్రమశిక్షణ, కష్టపడేతత్వం ఈస్థాయికి వచ్చేలా చేశాయని ఆమె తెలిపారు. ఒక్కో మెట్టూ ఎదుగుతూ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నారని అంకిత అన్నారు. బాహుబలి సినిమాకు తాను పెద్ద అభిమానినని, ఎన్నోసార్లు ఆ సినిమా చూశానని అంకిత చెప్పారు. రాజమౌళి తన రికార్డులను ఆయనే బ్రేక్ చేసుకుంటూ వెళ్తున్నారని ప్రశంసించారు. అమెరికాలో వున్నప్పటికీ తెలుగు సినిమాను మిస్ కావడం లేదని.. ఓటీటీల్లో, కొన్ని సార్లు థియేటర్‌లో మన సినిమాలు చూస్తున్నానని ఆమె చెప్పారు. ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా సింహాద్రి రిలీజ్ అవుతోందని.. ఈ సినిమాను న్యూజెర్సీలో ఖచ్చితంగా చూస్తానని అంకిత వెల్లడించారు.
ఎన్టీఆర్‌తో డ్యాన్స్ చేయడం కష్టం
ఎన్టీఆర్‌తో డ్యాన్స్ చేయడం కష్టమన్న అంకిత.. ఆయన కాళ్లలో ఏదో మ్యాజిక్ వుందని, ఆ స్పీడ్‌ను అందుకునేందుకు తాము కష్టపడాల్సి వచ్చేదని తెలిపారు. ఆ సమయంలో కొరియోగ్రాఫర్ లారెన్స్ ఎంతో సాయం చేశారని అంకిత గుర్తుచేసుకున్నారు. ఇన్నేళ్లయినా తనను మరిచిపోకుండా అభిమానులు చూపిస్తున్న ప్రేమకు ఆమె ధన్యవాదాలు తెలిపారు. సింహాద్రిని 4కేలో హై రెజిల్యూషన్‌లో చూడటం కోసం తాను ఎదురుచూస్తున్నానని.. ప్రేక్షకులు ఆ అనుభూతిని మిస్ కావొద్దని అంకిత చెప్పారు. అలాగే ఎన్టీఆర్‌కు జన్మదిన శుభాకాంక్షలు చెప్పారు. బాలయ్యతో ఇప్పటికీ టచ్‌లోనే వున్నానని.. రెండేళ్ల క్రితం జూమ్ కాల్‌లోనూ మాట్లాడానని అంకిత తెలిపారు. ఈ ఏడాది జూలైలో ఫిలడెల్ఫియా కన్వెన్షన్ సెంటర్‌కు బాలకృష్ణ రానున్నారని.. అప్పుడు ఖచ్చితంగా ఆయనను కలుస్తానని చెప్పారు. నందమూరి కుటుంబంలోని హరికృష్ణ, బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్‌లతో కలిసి నటించే అదృష్టం తనకు దక్కిందని.. సెట్స్‌లోని ప్రతి ఒక్కరిని వీరు ఎంతో గౌరవిస్తారని అంకిత చెప్పారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments