‘తరతరాల నిశీధి దాటే చిరు వేకువ జాడే.. పవన్’!!
- IndiaGlitz, [Saturday,December 28 2019]
టాలీవుడ్ పవర్‌స్టార్, జనసేన అధినేత పవన్ కల్యాణ్ గురించి ప్రత్యేకించి మరీ చెప్పనక్కర్లేదు.. ఆయనేంటో ఆయన్ను దగ్గర్నుంచి చూసిన వీరాభిమానులు, మెగాభిమానులకు తప్ప మరొకరికి అంత పూర్తిగా అర్థం కాడు.. కాలేడు కూడా. సినిమాల్లో నంబర్ వన్‌గా నిలిచిన పవన్.. రాజకీయాల్లోకి రాణించాలని భగీరథ ప్రయత్నాలు చేసినప్పటికీ అవన్నీ వర్కవుట్ కాలేదు. రెండు చోట్ల పోటీ చేసి ఓటమిపాలైనప్పటికీ ఆత్మవిశ్వాసం కోల్పోకుండా తన సత్తా ఏంటో అటు అధికార పార్టీకి.. ఇటు ప్రతిపక్షాలకు చూపిస్తూ.. ప్రజా సమస్యలపై అలుపెరగని పోరాటం చేస్తున్నాడు. అయితే.. మధ్య మధ్యలో కొన్ని పుకార్లు.. పలువురు పవన్‌పై చేస్తున్న తీవ్ర విమర్శలతో వీరాభిమానులు కాసింత అసంతృప్తికి లోనవుతున్నప్పటికీ తాజాగా జనసేనానికి సంబంధించిన 99టీవీ ఓ ప్రత్యేక మెగజైన్ వెలువరించింది.
అసలు ఏంటిది!?
‘తరతరాల నిశీధి దాటే చిరు వేకువ జాడతడే!’ అనే శీర్షికతో ఈ ప్రత్యేక సంచిక వచ్చింది. ఈ సంచిక మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ డైలాగ్స్‌తో ప్రారంభమైంది. అసలు పవన్ రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత సాధించిందేంటి..? ప్రభుత్వంపై చేసిన పోరాటాలేంటి..? ప్రజా సమస్యలపై ఆయన పోరాడి పరిష్కార మార్గాలు చూపిన విషయాలేంటి..? అనేవి ఈ సంచికలో ఉన్నాయి. కాగా.. ‘తరతరాల నిశీధి దాటే చిరు వేకువ జాడతడే అనేది సూపర్‌స్టార్ మహేశ్ నటించిన ‘అతడు’ సినిమాలోని టైటిల్ సాంగ్ అనే విషయం తెలిసిందే. మహేశ్ సాంగ్ కావడంతో ఆయన వీరాభిమానులు ట్రోలింగ్స్ కూడా చేస్తున్నారు!
సంచికలో ఏమున్నాయ్..!
మరీ ముఖ్యంగా ఉద్దానం సమస్యలపై పోరాటం, రాజధాని రైతులకు తోడుగా ఉన్న పవన్, తుఫాన్ బాధితులగా అండగా ఉన్న సందర్భం, ఆర్టీసీ కార్మికుల కోసం గొంతుకై ఉన్న పవన్, భనవ కార్మికులకు తోడుగా నిలబడిన సందర్భాలు ఇలా ఎన్నె ఎన్నో విషయాలను న్యూస్ 99 తెలుగు దినపత్రిక ప్రత్యేక సంచికలో పేర్కొంది. కాగా ప్రస్తుతం ఈ ప్రత్యేక సంచిక నెట్టింట్లో బాగా వైరల్ అవుతోంది. మెగాభిమానులు, పవన్ ఫ్యాన్స్ పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. మరోవైపు అంతే రీతిలో ‘మీ డబ్బాలు మీరు కొట్టుకోండ్రా.. డబ్బా రాయుడు’ అంటూ విమర్శలు సైతం వస్తున్నాయ్.