సుకుమార్‌కు ప్ర‌త్యేక‌మైన రోజు ఇది

  • IndiaGlitz, [Monday,May 07 2018]

'రంగస్థలం'తో సంచలన విజయం అందుకున్న ద‌ర్శ‌కుడు సుకుమార్. 1980ల నాటి గ్రామీణ వాతావరణాన్ని పునః సృష్టించి వెండితెరపై మ్యాజిక్ చేశారు.  అంతేగాకుండా, రామ్ చరణ్‌ని కొత్త కోణంలో చూపి అబ్బురపరిచారు. అలాంటి సుకుమార్‌ను తెలుగువారికి దర్శకుడిగా పరిచయం చేసిన‌ సినిమా 'ఆర్య'. 2004లో విడుదలైన ఈ సినిమాతో వన్ సైడ్ లవ్‌కి  అర్థం చెప్తూనే.. ప్రేమకి కొత్త భాష్యం చెప్పారు సుకుమార్.

అలాగే ఈ సినిమాతో అల్లు అర్జున్‌ని స్టార్ హీరోగా చేశారు ఈ టాలెంటెడ్ డైరెక్ట‌ర్‌. ఈ సినిమాకి సంబంధించిన కథ, కథనంతో పాటు పాటలు కూడా శ్రోతలను అలరించాయి. అలాగే తొలి చిత్రంతోనే బెస్ట్ డైరెక్టర్‌గా ఫిల్మ్ ఫేర్‌ను సొంతం చేసుకున్నారు సుకుమార్. దిల్ రాజు నిర్మాణంలో మే 7, 2004న‌ విడుదలైన ఈ సినిమా అప్పట్లో బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది. ఆ తర్వాత 'జగడం', 'ఆర్య 2', '100% లవ్', '1 నేనొక్కడినే', 'నాన్నకు ప్రేమతో' లాంటి సినిమాలను తెరకెక్కించి బ్రిలియంట్ డైరెక్టర్ అనిపించుకున్నారు సుకుమార్‌.

ఇండస్ట్రీలో అడుగుపెట్టి 14 సంవత్సరాలైనా.. సుక్కు చేసినవి కేవలం 7 సినిమాలంటే.. ఈ లెక్కల మాస్టర్ ఒక సినిమా కోసం ఎంత టైమ్ కేటాయిస్తారో ఈయన ట్రాక్ రికార్డ్‌ చెప్ప‌క‌నే చెబుతోంది. అంతేకాదు.. తను నిర్మించిన 'కుమారి 21ఎఫ్'తో నిర్మాతగా కూడా బ్లాక్ బస్టర్ హిట్‌ను అందుకున్నారు సుకుమార్. నేటితో ద‌ర్శ‌కుడిగా 14 ఏళ్ళ కెరీర్‌ను పూర్తిచేసుకుంటున్న సుకుమార్‌.. మున్ముందు మ‌రిన్ని విజ‌యాలు అందుకోవాలని ఆశిద్దాం.