2008 అహ్మాదాబాద్ పేలుళ్ల కేసు: 38 మందికి మరణశిక్ష... న్యాయస్థానం సంచలన తీర్పు
- IndiaGlitz, [Friday,February 18 2022]
పద్నాలుగేళ్ల నాటి అహ్మదాబాద్ వరుస బాంబు పేలుళ్ల కేసులో ప్రత్యేక న్యాయస్థానం శుక్రవారం సంచలన తీర్పు వెల్లడించింది. ఈ కేసులో ఇప్పటికే 49 మందిని దోషులుగా తేల్చిన కోర్టు ఈరోజు వారికి శిక్షలు ఖరారు చేసింది. దోషుల్లో 38 మందికి మరణ శిక్ష విధిస్తున్నట్లు న్యాయస్థానం సంచలన తీర్పు వెలువరించింది. మిగిలిన 11 మంది దోషులకు జీవిత ఖైదు విధించింది.
2008 జులై 26న అహ్మదాబాద్ నగరంలో ఉగ్రవాదులు వరుస బాంబు పేలుళ్లతో మారణహోమం సృష్టించడంతో యావత్ దేశం ఉలిక్కిపడింది. 70 నిమిషాల వ్యవధిలో 21 బాంబు పేలుళ్లు చోటుచేసుకున్నాయి. ఈ ఘటనలో 56 మంది ప్రాణాలు కోల్పోగా.. 200 మందికి పైగా గాయపడ్డారు. ఈ కేసులో దర్యాప్తు చేపట్టిన పోలీసులు దేశంలోని పలు ప్రాంతాల నుంచి 78 మందిని అదుపులోకి తీసుకున్నారు. వీరికి నిషేధిత ఉగ్ర సంస్థ ఇండియన్ ముజాహిదీన్(ఐఎం)తో సంబంధాలున్నాయని తేలింది. 2009 డిసెంబరులో విచారణ ప్రారంభం కాగా ఒక నిందితుడు అప్రూవర్‌గా మారడంతో మిగిలిన 77 మందిపై కోర్టులో విచారణ కొనసాగింది. 13 ఏళ్ల పాటు జరిగిన విచారణలో 1,100 మంది సాక్ష్యులను న్యాయస్థానం విచారించింది.
గతేడాది సెప్టెంబరులో విచారణ ముగియగా వీరిలో 49 మందిని దోషులుగా నిర్ధారిస్తూ ఈ నెల 8న ప్రత్యేక న్యాయస్థానం తీర్పు వెలువరించింది. సరైన సాక్ష్యాధారాలు లేని కారణంగా మిగిలిన వారిని నిర్దోషులుగా తేల్చింది. తాజాగా దోషులకు నేడు న్యాయస్థానం శిక్ష ఖరారు చేసింది.