వెన్నెల'కంటి వెలుగులు'

  • IndiaGlitz, [Wednesday,November 30 2016]

ఇవాళ నవంబర్ 30. సినీ గీత రచయత వెన్నెలకంటి పుట్టిన రోజు. ఆయన నాకు సినీ గీత రచయిత కాక ముందు నుంచీ పరిచయం. అదీ బాలు గారి పుణ్యమే. ఓ సారి నేను మద్రాసు వెళ్ళినప్పుడు రూమ్ దొరక్క బాధ పడుతూ బాలు గారికి ఫోన్ చేస్తే - ఓ హోటల్ పేరు చెప్పి 'ఫలానా రూమ్ లో వెన్నెలకంటి రాజేశ్వర ప్రసాద్ అని ఒకాయన వుంటాడు. మనవాడే. నేను ఫోన్ చేస్తాను. అక్కడికి వెళ్ళి ఫ్రెష్ అయి రండి. ఈలోగా మరో రూమ్ చూద్దాం.' అన్నారాయన. అలాగేనని వెళ్ళాను. 'మాది నెల్లూరండీ... సినిమాల్లో పాటలు రాయడానికి వచ్చాను' అంటూ తనను తాను పరిచయం చేసుకున్నారు వెన్నెలకంటి. ఆరోజు నుంచి ఈ రోజు వరకూ మా స్నేహం నిరాటంకంగా కొనసాగుతూనే వుంది. సినీ రచయితగా ఆయన ఎదుగుదల ప్రతి మెట్టూ చూస్తూ ఆనందిస్తూ వున్న ఆయన స్నేహ బృందంలో నేను వున్నందుకు కించిత్ గర్వంగా కూడా వుంటుంది నాకు. వారబ్బాయి శశాంక్ వెన్నెలకంటి పెళ్ళికి చెన్నై వెళ్ళాను నేను. ఆ పెళ్ళి రిసెప్షన్ లో సాయికుమార్ తమ్ముడు రవి (బొమ్మాళీ ఫేమ్) బాలు గారి పాటలు పాడడం ఓ ప్రత్యేకత. రవి అంత బాగా పాడతాడని చాలా మందికి తెలియదు. సూపర్ సింగర్స్ లో ఈ రవిని యాంకర్ గా పెట్టి ఎన్నో మంచి మంచి పాటలు పాడిద్దామని ప్రపోజల్ పెట్టాను. 'సమకాలీనులు మెచ్చరధిప' అనే పద్యంలోని వాక్యం చాలాసార్లలాగే మరోసారి ఋజువయ్యింది. ఆ తర్వాత వెన్నెలకంటి గారితో ఘంటసాల అవధానం చేయించాను. ఈ కాన్సెప్ట్ 'ఆ సమకాలీనులకి' అర్ధం అయ్యింది. పరుచూరి గోపాలకృష్ణ, ఆర్పీ పట్నాయిక్, భాస్కరభట్ల రవికుమార్, హేమచంద్ర, మాళవిక పృచ్చకులు. చాలా బాగా వచ్చిందా ఎపిసోడ్.

వెన్నెలకంటి సహృదయుడు, రస హృదయుడు. ఓ సారి ఓ బుక్ నాకు పంపిస్తూ నన్ను 'గడ్డం లేని ఋషి' అని సంబోధించారు. 'అదేంటలా అన్నారు ? ' అని నేనడిగితే 'పాటల కోసం మీరు చేస్తున్న కృషి తపస్సు లాంటిదే' అని అభినందించారు. తనే ప్రయోగం చేసినా నాతో పంచుకుంటారు. 'తేనెటీగ' అనే సినిమాలో 'కలలో తెర తీయాలా' అనే తమాషా ప్రయోగం ఒకటి చేశారు వెన్నెలకంటి. ఇటువంటి ప్రయోగం అంతకుముందు ఎవ్వరూ చెయ్యలేదు. ఈ పాట పల్లవి లో 'కలలో తెర తీయాలా' అని వుంది కదా ... ఆ 'తీయాల' లో 'తీయ' అనే పదాన్ని తీసుకుని 'తీయగ ఎద వేగాల' అని ఆ తర్వాత వుంటుంది. ఆ ' వేగాల' తో 'వేగాలలో వేడి' అని ఆ తర్వాత వుంటుంది. మొదటి లైన్ చివర వున్న 'తీయాల' కి తర్వాత లైన్ లో వున్న 'తీయగ' లో వున్న 'తీయ' కి అర్ధాలు వేరు. ఇలా పాట మొత్తం వుంటుంది.

'దీన్నేం అలంకారం అంటారో తెలియడం లేదు' అని అన్నారు వెన్నెలకంటి పాటని వినిపించిన తర్వాత. రెండు రకాల అర్ధాలతో ఒకే పదాన్ని వాడితే 'యమకం' అంటారు. (అచ్చెరువున - అచ్చెరువున - వేటూరి - సప్తపది - రేపల్లియ యద ఝల్లన / చుక్కానవ్వవే - నావకు చుక్కానవ్వవే - వేటూరి - సీతాకోక చిలుక - -- మిన్నేటి సూరీడు వచ్చెనమ్మా) మొదటి పాదంలో విడిచిన పదాన్ని రెండో పాదం లో స్వీకరించి కొనసాగించడాన్ని 'ముక్తపదగ్రస్తం' అంటారు. (గోదారి గట్టుంది గట్టు మీద చెట్టుంది - దాశరథి - మూగ మనసులు) "ఈ రెండు లక్షణాలూ ఈ పాటలో వున్నాయి కనుక 'యమక ముక్తపదం' అని అనొచ్చేమో” అని అన్నాన్నేను. "బావుంది. అనుకోవచ్చు" అని అన్నారాయన.

మరోసారి వారిద్దరి అబ్బాయిల పేర్ల మీద మా సంభాషణ మళ్ళీంది. పెద్దబ్బాయి పేరు శశాంక మౌళి రెండో అబ్బాయి పేరు రాకేందు మౌళి. ఇద్దరూ సినీ పరిశ్రమలో మంచి పేరు సంపాదించుకున్నారు. "శశాంక మౌళి అని అనొచ్చు. కానీ రాకేందు మౌళి అని అనకూడదు కదా. పైగా ఇప్పటి వరకూ ఎవ్వరూ అనలేదు కూడా ? " అని అడిగాను. దానికాయన నొచ్చుకోలేదు. "నిజమే .. బాలేందు మౌళి అని వుంటే అది కరెక్ట్ గా వుండేది. కానీ ఏదో ఫ్లో లో అలా వచ్చేసింది" అని జవాబిచ్చారు మనస్ఫూర్తిగా. ఇదీ ఏ భేషజం లేని వెన్నెలకంటి మనస్తత్వం, వ్యక్తిత్వం ...

ఇలా జరిగిపోతూ, సాగిపోతోంది మా స్నేహం. ఈ బంధం కూడా ఇలాగే జీవితాంతం వుండాలని ఆయన పుట్టిన రోజు పూటా కోరుకుంటూ, శుభాకాంక్షలతో ...

- డాక్టర్ రాజా (మ్యూజికాలజిస్ట్)

'తేనెటీగ' చిత్రం లో వెన్నెల కంటి రాసిన ప్రయోగాత్మక ప్రేమ గీతం

కలలో తెర... తీయాలా
తీయగ ఎద... వేగాలా
వేగాలలో వేడి
వేడింది వెన్నంటి
వెన్నంటి నా సోకు
సోకింది నిన్నంటి // కలలో తెర //
అంటుకున్న తీయని పగలుగ
పగలు రేయి కానీ చల్లగ
చల్లుతుంటె వలపుల జల్లుగ
ఝల్లుమంది హృదయం, అదరగ
అదరాల మధుకీల సిగ్గిల్లగా
గిల్లింది గిలిగింత తాపాలుగా
పాలించగా నీ వీక్షణం
క్షణమాగునా నా పయ్యెదా // కలలో తెర //
ఎదల సొదల కథలాపొద్దిక
పొద్దుపొడుపు అసలే ఒద్దిక
ఒద్దికైన ముద్దే వాడక
వాడుకైన వరసే తోడిక
తోడాలి నయనాలు సిరివెన్నెలా
నెలకొంది నెలవంక ఎద కోవెలా
వెల లేనిదీ విలువైనది
నది చేరిన కడలే ఇది // కలలో //

More News

గోపీచంద్ ఆక్సిజన్ లో సాక్షిచౌదరి స్పెషల్ సాంగ్

ఎగ్రెసివ్ హీరో గోపీచంద్ కథానాయకుడిగా ఎ.ఎం.జోతికృష్ణ దర్శకత్వంలో శ్రీసాయిరాం క్రియేషన్స్ పతాకంపై ఎస్.ఐశ్వర్య నిర్మిస్తున్నచిత్రం 'ఆక్సిజన్'. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ను శరవేగంగా జరుపుకుంటుంది. ఈ చిత్రంలో హీరోయిన్ సాక్షిచౌదరి ఓ స్పెషల్ సాంగ్ చేసింది. ఈ సందర్భంగా...

కాటమరాయుడు సెట్ కాదంటున్నశివబాలాజీ..!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ -శృతిహాసన్ జంటగా నటిస్తున్న తాజా చిత్రం కాటమరాయుడు. ఈ చిత్రాన్ని గోపాల గోపాల ఫేమ్ డాలీ తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో పవన్ తమ్ముళ్లుగా శివబాలాజీ, అజయ్, కమల్ కామరాజు నటిస్తున్నారు.

ఈటీవీ చేతికి నాగ్‌

అక్కినేని నాగార్జున‌, ద‌ర్శ‌కేంద్రుడు కె.రాఘ‌వేంద్రరావు కాంబినేష‌న్‌లో క‌మ‌ర్షియ‌ల్ సినిమాలే కాదు, భ‌క్తిర‌స చిత్రాలు కూడా రూపొందాయి. అన్న‌మ‌య్య‌, శ్రీరామ‌దాసు, శిరిడిసాయి వంటి భ‌క్తి క‌థా చిత్రాలు వీరి కాంబోలోనే వ‌చ్చి సెన్సేష‌న‌ల్ హిట్స్‌గా పేరు తెచ్చుకున్నాయి.

అల్లు అర‌వింద్ ప్లాన్ ఫ‌లిస్తుందా..? ధృవ కి ఆ రికార్డ్ ద‌క్కుతుందా..?

మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ న‌టించిన తాజా చిత్రం ధృవ‌. స్టైలీష్ డైరెక్ట‌ర్ సురేంద‌ర్ రెడ్డి ఈ చిత్రాన్ని తెర‌కెక్కించారు. ఈ భారీ యాక్ష‌న్ ఎంట‌ర్ టైన‌ర్ ధృవ డిసెంబర్ 9న ప్ర‌పంచ వ్యాప్తంగా ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తుంది.

బాలయ్య దృష్టిలో

నందమూరి బాలకృష్ణ తన ప్రెస్టిజియస్ 100వ చిత్రం గౌతమిపుత్ర శాతకర్ణి సినిమాను సంక్రాంతికి విడుదల చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నారు.