close
Choose your channels

అప్పుడనిపించింది సాహిత్యం కన్నా సంగీతం ఎంత బలమైనదోనని.... సి.నారాయణరెడ్డి

Friday, July 28, 2017 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

బైటకి తన్నుకొచ్చిన భావాన్నైనా, జీవాన్నైనా సమానంగా ప్రేమించగల ప్రతి కవికీ అంతర్మథనం, ప్రతి తల్లికీ ప్రసవ వేదన తప్పనిసరి... అన్నాడో మినీ కవి. సృజనాత్మక ప్రక్రియ ఏదైనా సరే. ఒక చిన్నపాట అయినా సరే!

అబార్షన్ చేసేద్దాం అని అనుకొని ఏదో కారణాల వల్ల గర్భాన్ని నిలబెట్టుకుంటే అలా పుట్టినపిల్లాడు విపరీతమైన పేరు ప్రఖ్యాతుల్ని తెచ్చుకుంటే ఎలా ఉంటుందో శివరంజనీ నవరాగిణీ` పాటని తల్చుకుంటే అలా ఉంటుంది`` అని అన్నారు డాక్టర్ సి.నారాయణరెడ్డి.

తెలుగు సినీ గీతాల చరిత్రలో నారాయణరెడ్డికి ఒక యుగం ఉంది. హైదరాబాద్‌ నుంచి పాటలు రాయటానికి మద్రాసు వెళ్తూ ఎయిర్‌పోర్టులో దిగగానే రెండు జేబుల్లోంచి పాటలు తీసి ఇచ్చేవారని ఆయన గురించి చెప్పుకునేవారు. పాటలు రాయడంలో తనకంటూ ఓ శైలిని, పాట` వాన్ని రుచి చూపించిన డాక్టర్‌ సి.నారాయణరెడ్డి కొన్ని పాటల పుట్టుపూర్వోలత్తరాలను ఇలా విశదీకరించారు…

తూర్పు​-పడమర`` చిత్రానికి మాతృక అయిన అపూర్వ రాగంగళ్‌` చిత్రంలో జేసుదాసు పాడిన అతిశయరాగం ఆనందరాగం` మంచి హిట్‌గీతం. దాన్ని తెలుగులోకి యథాతథంగా తీసుకుందామనుకున్నారు. అలా చెయ్యడం నాకూ, రమేష్‌నాయుడికి ఇష్టం లేదు. నిర్మాత రాఘవ ఆ పాటని డబ్‌చేద్దాం. రాయండి మీరు - డబ్బింగ్‌ బాగా రాస్తారు` అని అన్నాడు.

విషయం ఏమిటంటే అంతకు ముందు నేను - శివాజీ గణేశన్‌ నటించిన కర్ణ` సినిమాకి పాటలు డబ్‌చేశాను. రాఘవ ఆ సినిమాకి ప్రొడక్షన్‌ వ్యవహారాలు చూసుకునేవాడు. అంచేత నన్ను మళ్లీ డబ్‌చేయమని ఒత్తిడి చేశాడు. మరో మంచి పాట రాసుకోవచ్చు కదా` అన్నాను. అంత మంచిపాట రాయగలరా` అని అన్నారు రాఘవ. నాకది సవాల్‌గానే అనిపించింది. రాగాన్ని-రమణిని పోలుస్తూ ఓ పాట రాస్తాను` అని అన్నాను. రమేష్‌నాయుడు కొత్తదనం కోసం శివరంజని రాగాన్ని సూచించారు. అంతకు ముందు ఒకటీ అరా తప్ప విషాదానికి ఉపయోగించే ఈ శివరంజని` రాగాన్ని శృంగార భావ వ్యక్తీకరణకు ఎక్కువగా వాడలేదు.

ఆ రోజు అలా పుట్టిన ఆ శివరంజనీ నవరాగిణి` పాట తర్వాత ఎన్నిటికో ఒరవడులను దిద్దింది. ఆ రాగం పేరుతో దాసరి నారాయణరావు ఒక సినిమానే తీశారు. బాలూ హిట్స్‌లో అదొక మాస్టర్‌పీస్‌గా నిలిచిపోయింది. ఆనాడు మేంగాని ఆ తమిళగీతాన్నే డబ్‌చేసి ఉంటే...`` అని ఆర్థోక్తిలో ఆగిపోయారు సి.నా.రె. ఆయన ఆగిపోయినా ఏమై ఉండేది?`` అని రిథమిక్‌గా ప్రశ్నించాయి ఆయన కళ్లు.

ఎవరో అన్నారు-ఆయన కళ్ళలోనే వుంది లయ అని. లయ అనగానే సి.నా.రె. రాసిన పాటల్లో గుర్తొచ్చేది. చరణ కింకిణులు ఘల్లు ఘల్లుమన` అనే చెల్లెలి కాపురం`` చిత్రంలోని పాట.

ఈ పాట వెనుక కూడా మంచి చరిత్రే ఉంది. విశ్వనాథ్‌గారు సీను వివరించినప్పుడు నాలోని కవి నాచేత రాయించిన పాట చరణ కింకిణులు`. విశ్వనాథ్‌గారు బావుంది` అని అన్నారు గాని బాలయ్య మాత్రం భాష సామాన్యుడికి అందుబాటులో లేదేమో` అన్న అనుమానాన్ని వ్యక్తం చేశారు. కావాలంటే మరోపాట రాస్తాను కానీ ఈ పాటలో ఒక్క అక్షరం కూడా మార్చవద్దు. ఉంచితే ఇది ఇలాగే ఉంచండి` అని అన్నాను. సరే, ట్యూన్‌లో ఎలా వస్తుందో చూద్దాం`` అని అన్నాడు బాలయ్య.

`చరణ కింకిణులు అని వచ్చే చోట కాలి అందియలు అంటూ ఉంచి సంస్కృత పదాలు వచ్చే చోట పూర్తిగా తెలుగు పదాలే వుంచి రాయలేక కాదు. అది అలా ఉంటేనే బావుండుననిపించింది. పైగా అది అశువుగా ఒక కవి గుండెల్ని చీల్చుకు వచ్చిన పాట కూడా!

సరే ...ట్యూన్‌ సిద్ధమయింది. ఇంకో గమ్మత్తు వుందిక్కడ. మహదేవన్‌పాటలో చరణాలకి, పల్లవికి ట్యూన్‌చేశాడు గాని చివర్నవచ్చే ఫాలనేత్ర సంప్రభవ జ్వాలలు ప్రసవశరుని దహియించగా`` దగ్గర్నుండి ట్యూన్‌చేయలేదు. ఆ వాక్యాలు మీరు ఒక కవిగా ఎలా అంటారో అలా అనండి` అని అడిగాడు మహదేవన్‌. ఆనాడు నేను ఏ ఆవేశంతో ఆ వాక్యాలు పలికానో అవే పాటలోకి వచ్చాయి. నా బాణీలో నేను పలికిన ఆ వాక్యాల్ని యథాతథంగా టేపు చేసుకున్నారు. అవే బాలూ ప్రాక్టీస్‌చేసి పాటలో ప్రవచించాడు. ఆ తర్వాత ఎన్నో పాటలలో సంస్కృత పదాలు చోటు చేసుకోవడం, అదే ఆవేశంలో పాటలు పాడడం జరిగింది కూడా!- అన్నారు సి.నా.రె.!

ఆవేశం`` ప్రస్తావన రాగానే మా సంభాషణ మరో పాట మీదకి ఉరికింది. అది అనుబంధం ఆత్మీయత అంతా ఒక బూటకం``.

ఆ సీను చెప్పగానే మామూలు ప్రకారం తెలుగు సినిమా పద్ధతిలో వెళ్లిపోయావా అమ్మా`` టైపులో ఒక పాట రాసేసాను. పాట పూర్తయిపోయింది కూడా. పాటంతా అయిపోయాక రమేష్‌నాయుడు అన్నాడు. నారాయణరెడ్డిగారి స్పెషాలిటీ కనిపించడం లేదు` అని.

రమేష్‌నాయుడులో ఒక ప్రత్యేకత ఉంది. పాట పూర్తిగా తన దగ్గరికి వచ్చేవరకు ఏ కామెంటూ పాస్‌చెయ్యడు. అంతేకాక చక్కటి జడ్జిమెంట్‌ నిర్మొహమాటంగా చెప్పగలడు కూడా. రమేష్‌నాయుడు అలా అనగానే నాకు కాస్త పౌరుషం వచ్చింది.

మన తెలుగు సినిమాల సంప్రదాయం ప్రకారం రాశాను`` అని అన్నాను.

సంప్రదాయం సంగతి అలా ఉంచండి. అదే పరిస్థితిలో మీరుంటే ఒక కవిగా మీరేం అనేవారు`` అని అన్నారు రమేష్‌నాయుడు.

ఒక కవిగా అంటాను కానీ తీసుకునే దమ్ములు మన సినిమా వాళ్లకున్నాయా`` అని అడిగాను.

ఆహా...ఎందుకు తీసుకోరూ? ముందర ఓ కవిగా మీరేం అంటారో అని అనండి`` అని రెచ్చగొట్టాడాయన.

అప్పుడు సినీగీతం, నేపథ్యం అన్నీ మర్చిపోయి యస్వీరంగారావు వైపునుంచి ఆలోచించాను. ఆవేశంతో ఆశువుగా అనుబంధం, ఆత్మీయత అంతా ఒక బూటకం. ఆత్మతృప్తి కొరకు మనుషులు ఆడుకునే నాటకం వింత నాటకం, చెత్త నాటకం`` అని అన్నాను.

అదే ఓ కాగితం మీద రాసివ్వండి`` అని అన్నాడు రమేష్‌నాయుడు.

ఏమిటి ఇదా`` అన్నాను.

అవును...ఇదే...బావుంది కానివ్వండి``

అంతే, గబగబా పాట మొదటి చరణం వరకు తయారయిపోయింది. ఇంతలో దాసరి నారాయణరావు వచ్చారు. విని బావుంది. షాట్స్‌ రాసిస్తాను. మిగిలింది కానివ్వండి`` అని అన్నారు. ఆయన చకచకా షాట్స్‌రాసిచ్చారు. అవతల భార్య తరపు బంధువుల షష్టిపూర్తి, ఇవతల తల్లి చావు... అటు బాండు మేళం ఇటు చావు మేళం... అటూ తారాజువ్వలు, ఇటు చితిమంటలు... అలా మొత్తం షాట్స్‌ రాసిచ్చాడాయన. చూస్తుండగానే నిముషాల మీద పాట తయారయిపోయింది`` అంటూ ఆగారు సినారె.

గులేబకావళికథ``చిత్రంలోని నన్ను దోచుకుందువటే`` పాట ద్వారా తెలుగు సినీ సాహిత్యంపై చెయ్యి చేసుకున్నారు సి.నారాయణరెడ్డి. రుసస్పర్శతో``కాదు....రసస్పర్శ``తో! తన చేత మొదటిసారి సినీ గీతాలు రాయించిన ఎన్‌.టి.రామారావు తనలోని కవితాత్మను ఎలా జ్వలింపచేశారో సోదాహరణంగా పేర్కొన్నారు సినారె.

అప్పటికి బంధం` అన్నపదం అంతగా వాడబడలేదనుకుంటాను. అలాగే నా మనసు దోచుకోవటం` అంటూ వుండేదిగాని నన్ను దోచుకోవటం` అలాంటివి లేవనుకుంటాను. అలాగే సినీ గీతాల్లో అంతవరకు ఎవరూ ఉపయోగించని దొరసాని, కర్పూర కళికలాంటి పదాల్ని ప్రయోగించినపుడు ఎంతగానో ప్రోత్సహించారు రామారావుగారు.

రామారావుగారికి తమాషా అయిన అలోచనలు వస్తుంటాయి. దురోధ్యనుడికి డ్యూయెట్‌పెడితే ఎలా ఉంటుంది` అనే స్పార్క్‌ఆయనదే. దాని ఫలితమే దానవీర శూరకర్ణ``లో రాజస శృంగారాన్ని ప్రతిబింబించే చిత్రం హాయ్‌భళారే చిత్రం` పాట.

అంతేగాక, హిడింబి పాడితే ఎలా ఉంటుంది అనే ఆలోచన కూడా ఆయనదే. ఛాంగురే బంగారు రాజా` పాట. ఆ పాట రాసేటప్పుడు కూడా అంతగా ఎవరూ ఉపయోగించని తెలుగు పదాలు వాడితే ఎలా ఉంటుంది అని అనుకొని ఆ పాటలో అవి జొప్పించటం, మెప్పించటం జరిగింది. ఛాంగురే, మజ్జారే, అయ్యారే, మచ్చకంటి, పచ్చలపిడిబాకు (ఇది తెలంగాణా జానపదం) లెస్స, హైలెస్స ఇవి మచ్చుకి.

ఇలా చెప్పుకుంటూ పోతే చాలా పాటలున్నాయి. మబ్బులో ఏముంది` పాట జముకుల సంప్రదాయానికి చెందినది: ముత్యాలముగ్గు`లోని గోగులు పూచే ఓ లచ్చ గుమ్మడి` పాట పల్లవికి ఆధారం - తెలంగాణా ప్రాంతంలో విశేష ప్రచారం ఉన్న జానపద గీతం. కొత్తగా పెళ్లయిన ఓ పల్లెటూరి నాయిక, పట్నవాసపు చదవును అభ్యసించిన నాయకుడు ప్రొద్దుటి నుంచి రాత్రి వరకు ఎలా గడిపారో అనే బాపూ, రమణల ఊహలకు రాయబడిన పాట యిది. దానికి నా చిన్నప్పటినుంచీ వింటూ నా మెదడు పొరలలో దాచుకున్న తెలంగాణా ప్రాంతపు జానపద గీతాన్ని పాటకు ప్రారంభంగా వాడుకున్నాను. ఆ తరువాత పొద్దుపొడిచే`` అంటూ ఎత్తుకుంటుంది నాయిక`` అంటున్న సి.నా.రె వాక్రప్పవాహానికి అడ్డువేసి పుత్తడి వెలుగులు కొత్తగ మెరిసె`` అనే వాక్యం పల్లెఊరి నాయిక ఊహాపరిధికి ఎక్కువగా లేదా?`` అని అడిగాను.

అప్పుడు ఆ ఆలోచన రాకపోలేదు గానీ పుత్తడి బొమ్మ పూర్ణమ్మలాగా వుంటుంది. బాగానే ఉంది అని ఉంచెయ్యమన్నారు. అలా అంటున్న నాయికతో పొద్దు కాదది నీ ముద్దు మోమున` అంటూ నాయిక చెప్పే ప్రతిదాన్ని ఇంకోలా అభివర్ణిస్తాడు నాయకుడు. కవితా ప్రయోగపరంగా దాన్ని ప్రతియోగరీతి (బై కాంట్రాస్ట్‌) అని అంటారు`` అని అన్నారు సి.నా.రె.

ఆరుద్ర పాటల సంకలనంగా రూపొందిన కొండగాలి తిరిగింది`` అనే పుస్తకంలో ఊహలు గుసగుసలాడే` పాట వుంది. చాలామంది ఊహల్లో అది మీ పాటగానే వుంది. దాని గురించి స్పష్టీకరిస్తే బావుంటుంది...

నేనెప్పుడూ ఊగిసలాడే` అనే పదాన్ని ఇప్పటివరకూ వాడలేదు. అలా వాడవలసిన సందర్భం వస్తే ఊగాడింది`` అని వాడుతుంటాను. అది నా పద్ధతి`` అని వివరించారు సినారె.

మరి ఆకాశవాణి వారు కూడా ఆ పాటని మీ పాటగా చాలాసార్లు అనౌన్స్‌చేశారే?``

దాన్దేముంది? ఇప్పటికి ఎన్నిసార్లో నా పాటని దాశరథి పాటగా, దాశరథి పాటని నా పాటగా చెప్పుకుంటూ వుంటారు`` అని నవ్వారాయన.

కొన్ని కొన్ని పాటలు మీరు ఆత్రేయకు పోటీగా,లేదా ఆత్రేయ రాసిన పాటలను దృష్టిలో పెట్టుకొని రాశారని అనుకునేవారు ​- నిజమేనా?``

ఏమిటవి?``

కలెక్టర్‌జానకిలో నీవన్నది నీవనుకున్నది`` అనే పాటకి దసరాబుల్లోడు`లో నల్లవాడే అమ్మమ్మ అల్లరి పిల్లవాడే` పాటని, పవిత్ర హృదయాలు`లోని మనసే మనిషికి తీయని వరం` అనే పాటకి ప్రేమ్‌నగర్‌లో మనసున గతి ఇంతే` అనే పాటని ఇన్‌స్పిరేషన్‌గా వాడుకున్నట్టు పరిశీలకుల అభిప్రాయం. మీరేమంటారు?``

సినారె ఒక్క క్షణం నిశితంగా చూశారు. ఒక పచ్చినిజం చెప్పబోతున్నారనే భావన ఆ క్షణం ఒక్కసారిగా తటాలుమని మెరిసింది.

ఇక్కడో విషయం చెప్పాలి. కలెక్టర్‌జానకి`` చిత్రానికి మాతృక అయిన ఇరుకోడుగళ్‌`` తమిళ చిత్రం దసరాబుల్లోడు`` కంటే ముందు విడుదలయింది. నీవన్నది నీవనుకున్నది`` టైపు పాట... అంటే... ఇద్దరు ఆడవాళ్లు తమ ప్రియుడి కోసం వాద ప్రతివాదనలను కొనసాగించుకునే ధోరణి ఆ ఇరుకోడుగళ్‌`` చిత్రంలో ఉంది. ఆ పాట రాసింది కణ్ణదాసన్‌. ఇటువంటి కొత్త కొత్తకొత్త పద్ధతులకెన్నిటికో నాందీవాచకం పలికినవాడు కణ్ణదాసన్‌.

మద్రాసులో ఉండే సినీకవుల అదృష్టం ఏమిటంటే కొత్తగా ఎవరేమి రాసినా అక్కడ కవులకు ముందు తెలుస్తుంది. ఆ తమిళ గీతాన్ని ఆత్రేయ విని వుండవచ్చు. ఆయన కణ్ణదాసన్‌ని కాపీ చేశారని నేనననుగానీ ఆ పద్ధతి ఆయన గుండెల్లో నాటుకుని ఉంటుంది. దసరాబుల్లోడు` పాటల టైములో అది బయటికి వచ్చి ఉంటుంది. తర్వాత కలెక్టర్‌జానకి` వచ్చింది. ఆ చిత్రానికి తమిళ మాతృకను అనుసరించవలసి వచ్చింది. కనుక నీవన్నది నీవనుకున్నది` పాటకి కణ్ణదాసన్‌ని మూలంగా తీసుకున్నాను. ఆత్రేయను దృష్టిలో పెట్టుకొని రాశానని నీవన్నది నిజంగా నీవనుకున్నదే`. అది నిజంగా నిజం కాదు.

పోతే - మనసే మనిషికి తీయని వరమూ` పాట గురించి నువ్వన్నావు చూడు అది- చాలావరకూ నిజం. మేం పవిత్ర హృదయాలు` సినిమాకి పాటలు రాయడానికి కూర్చున్నప్పుడు సంగీత దర్శకుడు టి.చలపతిరావు ఆత్రేయ రాసిన ప్రేమనగర్‌` పాటను ప్రస్తావించాడు.

అప్పటికే మనసుగతి ఇంతే` పాట పెద్ద హిట్‌. దానికి టి.చలపతిరావు ఇదేవిటండీ, ఆత్రేయ ఈ పాటలో పలాయన వాదాన్ని, నిరాశావాదాన్ని సమర్థిస్తున్నారు? అదేమంత మెచ్చుకోదగ్గ విషయం కాదండీ` అన్నాడు. చలపతిరావు అభ్యుదయవాది. నేనూ ఆశావాదినే. అవును. మనసు మనిషికి శిక్ష అని ఎందుకనుకోవాలి. వరంకావచ్చు కదా. పక్షులకుంటాయా పరీక్షలు? రాళ‍్లకు పడతాయా శిక్షలు? మనిషన్న వాడికే శిక్షలు. పరీక్షలు, అందుకే మనిషికి నిండు మనసు కావాలి`` అని అన్నాన్నేను. అదేపాట రూపంలోకి ఉరికింది. ఆ పాటే - మనసే మనిషికి తీయనివరము`.

వరం అనగానే చటుక్కున స్ఫురించేది సున్నిత, నిశిత, సునిశిత, శృంగారానికి సినారె పెట్టింది పేరుగా, పట్టింది పాటగా ముద్ర పడ్డారని. నిజంగా అది ఆయనకు వరం. కొన్నికొన్ని పాటలను ఎంత త్వరగా ఆయన రాసేవారంటే నిర్మాతలు ​‍అరెరె సినారె.... అప్పుడే పాటను రాసేసినారే?`` అని ఆశ్చర్యపోయేవారు. కానీ వరకట్నం`లోని మరదలా మరదలా` పాటలో పల్లెటూరి చిన్నోడు`లోని నీళ్ళేమంటున్నాయి ఓ వదినా`` పాటలో, భక్తతుకారం``లోని పూజకు వేళాయెరా`` పాటలో శృంగారాన్ని కాస్త శ్రుతి ఎక్కువగా పెంచి ఉపయోగించారనిపించి వాటికి కారణాలని అడగటం జరిగింది.

నిజమే.... తెలంగాణా ప్రాంతంలో వదినా మరదళ్ళ సరసాలు, ఛలోక్తులు కాస్త ఎక్కువ మోతాదులోనే ఉంటాయి. పైగా నీవన్న ఆ మొదటి రెండు పాటలు వదినా మరదళ్ళు పాడుకుంటూ ప్రియుడి గురించి ప్రస్తావించుకునేవే. అందుచేత ఆ రెండు పాటలలోనూ కాస్త శృంగారం ఎక్కువగానే పడింది. పోతే తుకారం`లోని పూజకు వేళాయెరా` పాటలోని శృంగారం నేను అలంకార శాస్త్రాన్ని అనుసరించి వాడినది. జఘన మండలాన్ని పృథ్వీ మండలంతో పోల్చటం లాంటివన్నీ అలంకార శాస్త్రజ్ఞులు చెప్పినవే. కాకపోతే అంతటి సాంద్రశృంగారం అక్కడ పలికితేగాని వెంటనే అది ప్రబల వైరాగ్యానికి దారితీయదు. తర్వాత వచ్చే తోలుతిత్తులై పోవునులే`, వాడివత్తలై పోవునులే` లాంటి వైరాగ్య సూచ్యానికి మొదట అంతటి శృంగార వాచ్యం తప్పలేదు. సంగీత దర్శకుడు ఆదినారాయణరావు కూడా ఈ శాస్త్రాలన్నీ క్షుణంగా చదవినవాడు కూడా!`` అని ఓ లిప్తపాటు ఆగి శృంగారం ప్రస్తావన వచ్చింది కాబట్టి ఇక్కడో విషయం చెప్పాలి`` అన్నారు నారాయణరెడ్డి.

పూర్వం పాటల్లో శృంగార సూచకం రహస్యంగా పొంచిఉన్నా సరే తొలగించమనేవారు సెన్సారు వారు. రాముడు-భీముడు`` చిత్రంలో హోయ్‌ తళుకు తళుకుమని`` అనే పాటలో "రమ్మనకు పగలే నను రా రమ్మనకు - అంటే రాత్రి రమ్మనా? తొలగించండి`` అని అన్నారు. వారి అభీష్టానుసారమే రమ్మనకు ఇప్పుడే ననురా రమ్మనకు` అని మార్చి తిరిగి రికార్డు చేసి జోడించడం జరిగింది. ఆ సినిమా ఎప్పుడైనా వస్తే మళ్లీ చూడండి - అక్కడ లిప్‌సింక్‌`` కాదు. రికార్డులలో మాత్రం పగలే ననురా రమ్మనకు`` అనే ఉంది.`` అని వెల్లడించారు సినారె.

ఇప్పుడీ పాటకీ చివరి క్షణంలో ఎలా అయితే మరొక పదం వేసి నడిపించారో అలా ట్యూన్‌అంతా అయిపోయాక దానికి సాహిత్యం సమకూర్చాక, చివర్న మీకు రాయాలనిపించి ఓ వాక్యమో, ఓ పదమో చేర్చితే దానిని తిరిగి ట్యూన్‌చెయ్యటం జరిగిందా?``

ఓ ....ఎందుకు జరగలేదూ...? అలా ఉదహరించాలంటే శారద` చిత్రంలోని శారదా ననుచేరగా` పాటని చెప్పుకోవాలి`` అని తిరిగి కొనసాగించారు నారాయణరెడ్డి.

శారద చిత్రంలో శారదా నను చేరగా`` పాటకి చక్రవర్తి లాలల, లల, లాలలా`` అంటూ ట్యూన్‌ఇచ్చాడు. సరే, హీరోయిన్‌శారద అని, సినిమాలో పాత్రపేరు కూడా శారదే అని తెలుసు. శారదా నను చేరగా`` అని రాశాను. పల్లవి, చరణాలు అన్నీ పూర్తయి పోయాయి. కానీ పల్లవిలో చక్రవర్తి ఇచ్చిన ట్యూన్‌ఏమిటమ్మా సిగ్గా ఎరుపెక్కే లేత బుగ్గా`` అనే వాక్యం వరకే సరిపోతుంది. తర్వాత వెంటనే పల్లవిని పాడుకునేటట్టుగా మలచాడు చక్రవర్తి. రాస్తూ ఉండగా పల్లవిని మరికాస్త పొడిగిస్తే బావుండుననిపించింది. మరో వాక్యం రాయనా`` అని అడిగాను తప్పకుండా...రాయండి రాయండి`` అంటూ ప్రోత్సహించారు చటర్జీ, చక్రవర్తీ. వెంటనే ఓ శ్రావణ నీరద శారదా`` అన్నాను. ఎందుకంటే ఆ చిత్రంలో శారద కరుణరసపూరితమైన పాత్రకు రూపకల్పన. శ్రావణ నీరదము అంటే కరిగిపోయే స్వభావానికి ప్రతీక. అలా కలిసొచ్చేట్టు శ్రావణ నీరద శారదా`` అని అన్నాను. బావుంది. ఏదీ. చక్రవర్తీ, అది ట్యూన్‌లో అను`` అని అన్నారు చటర్జీ. వెంటనే దాన్ని తన ట్యూన్‌లో అన్నాడు చక్రవర్తి. అదే అలా వుండిపోయింది అక్కడ. చక్రవర్తి ట్యూన్‌ఎంత బలంగా చొచ్చుకుపోయిందో చెప్పటానికి ఇంకో చిన్న ఉదాహరణ.

ఓసారి నేను కరీంనగర్‌వెళ్తున్నాను. దారిలో ఓ కుర్రాడు ఈ పాటని ఆలపించుకుంటూ నడుస్తున్నాడు. పాట ఎలా పాడతాడో చూద్దాం అని అతన్ని గమనించసాగాను. ఈ శారదా` పాటను పాడుతూ శ్రావణ నీరద శారదా` దగ్గరకొచ్చేసరికి అతడు ఓ శ్రావణ రీరద శారదా`` అని అన్నాడు. అప్పుడనిపించింది సాహిత్యం కన్నా సంగీతం ఎంత బలమైనదో``.

ఇప్పటివరకూ మీరు చాలా పాటల గురించి చెప్పారు గాని ఇక్కడేం రాయాలి? ఎలా రాయాలి?`` అని మిమ్మల్ని సందిగ్ధావస్థలో పడేసిన పాట గురించి చెప్పనేలేదు. అటువంటివేమీ లేవా?``

సీతా కళ్యాణం లోని గంగావతరణం`` నన్ను ఓ క్షణం అటువంటి అవస్థకు గురిచేసిన పాట కిందే లెక్క`` అని అన్నారు సినారె.

సాధారణంగా కొన్ని పాటలకు ఒక ఫ్లో`` కావాలి. అటువంటి ఫ్లో` ఉన్న పాటల్ని నేను ఆశువుగా చెప్పగలనే గాని చెప్తూ రాయలేను`` అంటూ కొనసాగించారు డాక్టర్‌సి.నారాయణరెడ్డి.

నా అదృష్టం ఏమిటంటే అలా ఫ్లో`తో రాసిన పాటలకు కొందరు ప్రతిభావంతులు వ్రాయసగాళ్లు`గా వ్యవహరించడం జరిగింది. కొన్ని పాటలకు కోడి రామకృష్ణ, రేలంగి నరసింహరావు, ఎమ్వీయల్‌ఇలా నేను చెప్తుంటే వాళ్లు రాసుకోవడం జరిగింది.

ఈ సీతా కళ్యాణం`` లోని గంగావతరణం`` పాటకి ఫ్లో` కావాల్సి వచ్చింది. బాపూ, రమణలది సాధారణంగా బడ్జెట్‌పిక్చర్‌కదా - ఈ పాటని నాకు రాయడానికి పక్కన ఎవరూ లేరు. మీరు చెప్పండి-నేను రాస్తాను`` అన్నారు ముళ్ళపూడి వెంకటరమణ. అలా ఆ పాట మొదలయింది.

బాపూ చెప్పిన షాట్సుకి అనుగుణంగా ఆ పాటని రాయడం జరిగింది. ఇప్పుడు ఉద్రేకంగా చెలరేగిన గంగని శివుడు తన జటాజూటంలో బంధిస్తాడు. అందునుంచి బైటకి ఉరకలేక అటు ఇటూ చూస్తూ ఉన్న గంగని భగీరథుడు విడిపిస్తాడు`` అని షాట్స్‌ని చెప్పడం జరిగింది. ఈ కథ తెలిసినదే అయినా జటాజూటంలో గంగను బంధించడం, గంగ బైటికి రావాలని ప్రయత్నించడం బాపు ఎలా తీస్తారు. దీనికి ఎలా రాయాలి అనే మీమాంసలో పడ్డాను కొంతసేపు.

అప్పుడు బాపు అనుకున్న షాట్స్‌బొమ్మలుగా వేసి ఇచ్చాడు. అదేవిధంగా చిత్రీకరించడం జరిగింది కూడా. ఆ బొమ్మల్ని చూడగానే, ఆ రకంగా నవ్వత్వం కనబడగానే నాలోని కవితాగంగ ఒక్కసారి ఇలా పెల్లుబికింది. ఆ రస గంగధారను అయిగిరి నందిని నందిత మోహిని`` ట్యూన్‌లో అనుకుంటూ ఇలా రాశాను.

జడ అను అడవిని వడివడి అడుగిడి
జాడ ఎరుంగనిదై
తడబడి నడచుచు వడివడి పడకుచు
నుడివడి పోయినదై
ఒక పరి యిటు చని ఒక పరి అటు చని
మొకమే చెల్లనిదై``

అలాగే భక్తకన్నప్ప చిత్రంలో కండ గెలిచింది` పాటలో కూడా జరిగింది. పాట మధ్యలో డ్రమ్స్‌ని అనుకొని చూస్తూ ఉన్నట్లు బొమ్మవేసి ఇచ్చాడు బాపూ. దాన్ని చూడగానే పుట్టిందే - ఎంత చక్కని మేను ఎంతో చల్లని చూపు అనే చరణం`` అని ముగించారు నవ్య కవిత నయాగరా నారాయణరెడ్డి.

అక్షరానికి లయ జ్ఞానాన్ని జోడించి నిరంతంరం నర్తించే నిర్విరామ సంగీతం - నారాయణరెడ్డి

సంప్రదాయాన్ని జీర్ణించుకున్న ప్రయోగం.. ప్రయోగంలో జీవిస్తున్న సంప్రదాయం - నారాయణరెడ్డి

బద్ధకం ఆయన బద్ధ శత్రువు
అందుకే ఆయన నిలువెత్తు చైతన్యానికి సంకేతం
ఒక శతాబ్దికి సరిపడే శబ్దాబ్ధిని పుక్కిట పట్టిన వాడాయన
శబ్ద సౌందర్యాన్ని సున్నితంగా, సుతారంగాతప్ప
వేరొకలా స్పృశించలేడాయన.
ఆయన స్పృజించే భావసాగరంలో ఒలలాడేవారికి
ఇహలోక భవసాగరాలు పిల్లకాలువల్లా కనిపిస్తాయి
వాక్కు విలువ తెలిసి మరీ వాడే వాగనుశాసనుడు
ఒక్కొక్కసారి కేవలం కనులతో మాత్రమే వాక్కుని
శాసించే వాగని శాసనుడు` - నారాయణరెడ్డి
ప్రతిరోజూ మార్నింగ్‌వాక్‌తో మొదలయ్యే
ఆయన వాక్చాతుర్యం
సాయంసభల వరకూ ఎంత సవ్వళించినా
కాగితంపై పవ్వళించే వరకూ విశ్రమించదు
వశిష్టుడంతటి వాడందామా అంటే వయసొప్పుకోదు
ఎందరి హృదయాలలోనో ఇష్టుడై వసించే వసిష్టుడు
అని అనకుంటే మనసూరుకోదు
ఆయన రసహృదయ వసిష్టుడు` మాత్రమే కాక
కవితలోనూ జీవితంలోనూ ఎప్పుడూ
సిస్టమాటిక్‌`గా వుండే విశిష్టుడు కూడా
అందుకేఆయన్ని విసిష్టమాటిక్‌` కవి అని పిలుచుకుంటే
అదిఆత్మీయంగా వుటుంది. తాదాత్మీయంగా వుంటుంది.
పదాలమ్మ పాలను, పదవులింట వెన్ననూ
ఎంతెంతగా ఆరగించినా
మనసుకు ఆ జిడ్డంటని వ్యక్తి, అభివ్యక్తి - నారాయణరెడ్డి

- డాక్టర్ రాజా (మ్యూజికాలజిస్ట్)

(సుమారు 40 ఏళ్ళ క్రితం డాక్టర్ సి. నారాయణ రెడ్డి గారు ఇచ్చిన ఇంటర్వ్యూని జూలై 29న ఆయన జయంతిని పురస్కరించుకుని)

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.   

Comments

Welcome to IndiaGlitz comments! Please keep conversations courteous and relevant to the topic. To ensure productive and respectful discussions, you may see comments from our Community Managers, marked with an "IndiaGlitz Staff" label. For more details, refer to our community guidelines.
settings
Login to post comment
Cancel
Comment