జగన్ నిర్ణయానికి ఎదురు నిలిచిన వైసీపీ ఎమ్మెల్యే.. స్పీకర్ మద్దతు

ఏపీ సీఎం జగన్ చాలా మొండివారనేది జగమెరిగిన సత్యం. ఏదైనా కమిట్ అయితే ఆయన మాట ఆయనే వినరనే టాక్ తెలుగు రాష్ట్రాల్లో ఉంది. జగన్ డెసిషన్ తీసుకున్నారంటే ఎమ్మెల్యేలు, మంత్రులెవరూ దానిపై మాట్లాడేందుకు సాహసం కూడా చెయ్యలేరని ప్రజలు భావిస్తారు. అయితే ఇటీవల జగన్ తీసుకున్న ఓ నిర్ణయానికి మాత్రం సొంత పార్టీ ఎమ్మెల్యేనే ఎదురు నిలవడం ఆశ్చర్యాన్ని కలిగించింది. మరోవైపు ఆ ఎమ్మెల్యకు మద్దతుగా స్పీకర్ మాట్లాడటడం మరింత విశేషం. ఇప్పటికే ఎంపీ రఘురామ కృష్ణరాజు వ్యవహారం హాట్ టాపిక్ అవగా.. తాజాగా జగన్‌కు కొత్త తలనొప్పి వచ్చి పడింది.

అసలు విషయం ఏమిటంటే.. జిల్లాల పునర్విభజన చేయాలని సీఎం జగన్ నిర్ణయించారు. గతంలో ఆయన పాదయాత్ర చేసిన సమయంలో ప్రతి పార్లమెంటునూ ఒక జిల్లా చేస్తానని మాటిచ్చారు. ఇప్పుడు ఆ దిశగా అడుగులు పడుతున్నాయి. అయితే తమ జిల్లా శ్రీకాకుళం జోలికి మాత్రం రావొద్దని వైసీపీ ఎమ్మెల్యే ధర్మాన ప్రసాదరావు తెగేసి చెప్పారు. కారణం ఏంటంటే.. జిల్లాలో అభివృద్ధి చెందిన పాలకొండ, రాజాం, ఎచ్చెర్ల ప్రాంతాలు విభజన అంటూ జరిగితే విజయనగరం జిల్లాలోకి వెళ్లిపోతాయి. అదే జరిగితే తమ జిల్లా అభివృద్ధి 80 ఏళ్లు వెనక్కి వెళ్లిపోతుందని ధర్మాన భావిస్తున్నారు. దీనికి స్పీకర్ తమ్మినేని సీతారాం కూడా మద్దతు తెలపడం విశేషం. దీనిపై జగన్ ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.