బాలు హెల్త్ అప్‌డేట్: సోమవారం శుభవార్త చెబుతామన్న ఎస్పీ చరణ్
- IndiaGlitz, [Thursday,September 03 2020]
గాన గంధర్వుడు ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం ఆరోగ్యం నిలకడగా ఉందని ఎంజీఎం ఆసుపత్రి వైద్యులు వెల్లడించారు. ఎస్పీబీకి వెంటిలేటర్, ఎక్మో సహాయంతో చికిత్స అందిస్తున్నామని, ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని పేర్కొంది. ‘‘కోవిడ్ - 19 కారణంగా చికిత్స కోసం ఎంజీఎం హెల్త్ కేర్‌లో జాయిన్ అయిన ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారి ఆరోగ్యం నిలకడగా ఉంది. ప్రస్తుతం ఐసీయూలో వెంటిలేటర్‌పై ఎక్మో సాయంతో చికిత్సను అందిస్తున్నాం.
ఆయన ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉంది. ఆయన వైద్యానికి బాగా రెస్పాండ్ అవుతూ బాగా కోలుకుంటున్నారు. మా వైద్య నిపుణులు ఆయన ఆరోగ్యాన్ని నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. బాలు ఆరోగ్య పరిస్థితిపై ఆయన కుమారుడు ఎస్పీ చరణ్ సైతం ఓ వీడియోను విడుదల చేశారు. సోమవారం నాటికి తన తండ్రి ఆరోగ్యంపై ఓ శుభవార్త వెలువడే అవకాశం ఉందని ఆయన తెలిపారు.
‘‘నాన్న గారి ఆరోగ్యం వరుసగా నాలుగో రోజు నిలకడగా ఉంది. దేవుడి దయ వల్ల.. ఆయన త్వరగా కోలుకోవాలన్న ప్రతి ఒక్కరి ఆకాంక్షకు అనుగుణంగా సోమవారం గుడ్ న్యూస్ ఉండే అవకాశం ఉందని ఆశిస్తున్నా’’ అని ఎస్పీ చరణ్ వెల్లడించారు. ఆగస్ట్ 5న కరోనా కారణంగా బాలు ఎంజీఎం ఆసుపత్రిలో చేరారు. ఆ తరువాత కొద్ది రోజులకే ఆయన ఆరోగ్యం విషమించింది. అప్పటి నుంచి ఎస్పీబీని ఐసీయూకి తరలించి వైద్యం అందిస్తున్నారు.