సింగర్స్ మెంబర్షిప్ తీసుకోవాలి - 'ఇస్రా' ప్రెస్‌మీట్ లో ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం
Send us your feedback to audioarticles@vaarta.com
ఇండియన్ సింగర్స్ రైట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రస్తుతం సభ్యత్వ నమోదు కార్యక్రమం జరుగుతోంది. ఈ సంస్థ తరఫున బుధవారం హైదరాబాద్‌లో ప్రెస్‌మీట్ జరిగింది. ప్రముఖ గాయకుడు ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆయనతో పాటు ఇండియన్ సింగర్స్ రైట్స్ అసోసియేషన్ అడ్వైజర్స్ లో ఒకరైన సంజయ్ టాండన్, తెలుగు సంగీత దర్శకులు ఆర్.పి.పట్నాయక్, శ్రీలేఖ, వేణు, కౌసల్య, కె.ఎం.రాధాకృష్ణన్, సింహా తదితరులు పాల్గొన్నారు.
ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం మాట్లాడుతూ `` నేను ఇప్పటిదాకా ఎన్నో పాటలు పాడాను. రాయల్టీ రూపంలో ఏమీ సంపాదించలేదు. 2012లో రాయల్టీ గురించి పార్లమెంట్లో బిల్లు పాస్ కావడానికి ముందు నాకు వచ్చిందేమీ లేదు. కానీ ఇప్పుడు రాయల్టీ అనేది సింగర్స్ హక్కు. దీని కోసమే ఇస్రా కృషి చేస్తోంది. అర్హులందరూ ఇస్రాలో సభ్యులుగా చేరాలి. ఏదైనా ఒక పాట పాడిన వారు రూ.2వేలు కట్టి ఇందులో సభ్యత్వం తీసుకోవచ్చు. ఇప్పటికి 410 మంది సభ్యులున్నారు. భవిష్యత్తులో ఈ సంఖ్య అపారంగా పెరుగుతుందనే నమ్మకం ఉంది. గాయనీగాయకులకు భాషతో సంబంధం లేదు. నన్ను, ఏసుదాస్‌గారిని ఏ భాషవాళ్లంటే ఏమని చెబుతారు? రాయల్టీ గురించి మాట్లాడితే అవకాశాలు తగ్గిపోతాయేమోననే భయాలు పెట్టుకోవద్దు. రాయల్టీ వద్దని గతంలో ఎవరైనా సంతకాలు చేసినా, అవి ఇప్పుడు చెల్లవు. కాబట్టి అందరూ ధైర్యంగా సభ్యత్వం తీసుకోండి. జీవితాంతం రాయల్టీ రూపంలో ఎంతో కొంత వస్తూనే ఉంటుంది. సినిమా పాటలు పాడినా, జానపదాలు పాడినా, , గజల్, ఆధ్యాత్మిక, క్లాసికల్ పాటలు పాడిన వారందరూ రాయల్టీ పొందడానికి అర్హులే`` అని అన్నారు.
ఇస్రా బోర్డ్ ఆఫ్ అడ్వైజర్స్‌లో ఒకరైన సంజయ్ టాండన్ మాట్లాడుతూ ‘‘ ఇంతకు మునుపు ఉన్న ఐపీఆర్‌యస్‌కు ఇప్పుడు మేం పెట్టుకున్న ఇస్రాకు సంబంధం లేదు. మా సంస్థ వల్ల ఐపీఆర్‌యస్ వారి ఆదాయానికి ఎలాంటి గండీ పడదు. ప్రస్తుతం స్టేడియంలలో సీటుకు రూ.1.60 చొప్పున వసూలు చేస్తున్నాం. డిమాండ్‌ని బట్టి భవిష్యత్తులో ఇది పెరగవచ్చు, తగ్గనూ వచ్చు. ఇప్పటికే రాయల్టీ విషయమై యు.యస్, యు.కె., బ్రెజిల్‌తో మాట్లాడాం. ఇటీవల బ్రెజిల్ నుంచే మాకు రూ.40లక్షలు వచ్చాయంటే మన సంగీతానికి అక్కడున్న ఆదరణ ఎలాంటిదో అర్థమవుతుంది. ఇలాంటి వేడుకల్లో కొన్ని తరహాల పాటలకే ప్రాముఖ్యత ఉంటుంది కనుక ఆయా సింగర్లకే ఎక్కువ మొత్తం డబ్బులు అందుతున్నాయి. చాలా సీనియర్లకు కూడా కొన్నిసార్లు నామమాత్రపు రాయల్టీని అందిస్తున్నాం.
దూరదర్శన్, ప్రసార భారతి నుంచి రావాల్సిన బ్యాలన్స్ చెక్కుల కోసం ఇటీవల సంప్రదించాం. వారి నుంచి వస్తే సీనియర్లకు కూడా మంచి మొత్తాన్ని అందజేయవచ్చు. రేడియో, టీవీ, ఇంటర్నెట్, సెల్‌ఫోన్స్‌తో పాటు స్పోర్ట్స్ జోన్స్, జిమ్స్ వంటి వాటి నుంచి మాకు ఎక్కువ రాయల్టీ వస్తుంది. ముంబై, ఢిల్లీ వంటి నగరాల్లోనూ దీని గురించి ప్రచారం కల్పించి రాయల్టీని అడుగుతున్నాం. ఇప్పటిదాకా 2016లో రూ.51లక్షల రూపాయలను వసూలు చేసి అందరికీ పంచిపెట్టాం. 2017లో రూ.1.2కోట్లను వసూలు చేసి పంచాం. ఒక్కసారి మా దగ్గర సభ్యత్వం తీసుకుంటే, ప్రతి ఏటా రాయల్టీని అందిస్తుంటాం. ఇస్రాలో సభ్యత్వం లేని వారికి చెందిన నగదును మూడేళ్లపాటు మా దగ్గర దాస్తాం. అప్పటికీ సభ్యత్వం తీసుకుని మమ్మల్ని సంప్రదించకపోతే, వారికి సంబంధించిన నిధులను దయనీయమైన స్థితిలో ఉన్న గాయకుల సంక్షేమ నిధికి అందిస్తాం. సభ్యులందరికీ ఆరోగ్య భీమా పథకాన్ని ఏర్పాటు చేస్తున్నాం. మృతిచెందిన గాయనీగాయకులకు సంబంధించిన రాయల్టీని వారివారసులకు అందిస్తాం. అయితే వారు చట్టపరమైన వారసులయి ఉండాలి. అలాంటి వారసులకు 50 ఏళ్ల పాటు రాయతీ వస్తుంది’’ అని అన్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout