తన విగ్రహాన్ని తానే తయారు చేయించుకున్న బాలు...!
- IndiaGlitz, [Saturday,September 26 2020]
గానగంధర్వుడు ఎస్.పి.బాలసుబ్రమణ్యం అంత్యక్రియలు పూర్తయ్యాయి. ఐదు దశాబ్దాలు.. 12 భాషల్లో 40వేలకు పైగా పాటలు...ఇది సామాన్యులకు సాధ్యమయ్యే విషయం కాదు. ఈ రికార్డు సాధించడం సాధించడం మరొకరికి సాధ్యం కాదిది. బాలు మన మధ్య లేకపోవచ్చు కానీ.. ఆయన పాట మాత్రం అజరామరం. కరోనా వైరస్‌తో హాస్పిటల్‌లో జాయిన్ కాకముందు బాలు తన విగ్రహాన్ని తానే చేయించుకున్నారట. ఈ విషయాన్ని సాక్షాత్తు సదరు విగ్రహం చేసిన వ్యక్తే చెప్పారు. మరి బాలసుబ్రహ్మణ్యం తన విగ్రహాన్ని తాను ఎందుకు తయారు చేసుకున్నారనే వివరాల్లోకి వెళితే..
తూర్పు గోదావరి జిల్లాలోని కొత్తపేటకు చెందిన శిల్పి డి.రాజ్‌కుమార్ వడయార్‌తో తన తల్లిదండ్రుల విగ్రహాలను తయారు చేయించాలని బాలసుబ్రహ్మణ్యం సంప్రదించారు. ఆయన తయారు చేసిన ఆ విగ్రహాలను చూసి బాలు ఎంతగానో సంతోషపడ్డారు. వీరి విగ్రహాలను నెల్లూరులోని వేదపాఠశాలలో పెట్టాలనుకుంటున్నట్లు బాలు భావించారు. రాజ్‌కుమార్ చేసిన విగ్రహాలను చూసి హ్యాపీగా ఫీలైన బాలు తన విగ్రహాన్ని కూడా తయారు చేయమని ఆయన్ని కోరారు. తన రికార్డింగ్ స్టూడియో విగ్రహాన్ని పెట్టుకోవాలనుకుంటున్నారు బాలు. రాజకుమార్ బాలు విగ్రహాన్ని తయారు చేసి బాలుకు వీడియో పంపారు. అది చూసిన ఆయన చాలా బావుందని, ఎలాంటి మార్పులు, చేర్పులు చేయించాల్సిన అవసరం లేదని అన్నారు. ఎలా ఆ విగ్రహాన్ని అందిస్తారో చెప్పాలని కూడా ఆడియో రూపంలో అడిగారు. కానీ ఇప్పుడు బాలు తన విగ్రహాన్ని ప్రత్యక్షంగా చూసుకోలేకపోయారని శిల్పి రాజ్‌కుమార్ బాధపడుతున్నారు.