ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం పరిస్థితి విషమం..
- IndiaGlitz, [Friday,August 14 2020]
ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఈ నెల 5న ఆయనకు కరోనా సోకింది. దీంతో ఆయన చెన్నైలోని ఎంజీఎం హెల్త్ కేర్‌లో చికిత్స నిమిత్తం చేరారు. శుక్రవారం ఎస్పీ బాలు ఆరోగ్య పరిస్థితిపై వైద్యులు హెల్త్ బులిటెన్‌ను విడుదల చేశారు. గురువారం రాత్రి నుంచి ఆయన పరిస్థితి ఆందోళనకరంగా మారినట్టు తెలుస్తోంది. దీంతో వైద్యులు వెంటనే ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంను ఐసీయూకి తరలించి వైద్యం అందిస్తున్నట్టు తెలుస్తోంది.
ఆగస్ట్ 5వ తేదీన తనకు కరోనా సోకిందని ప్రస్తుతం తాను ఆరోగ్యంగానే ఉన్నానని తెలియజేస్తూ ఆయన ఓ వీడియోను విడుదల చేసిన విషయం తెలిసిందే. జలుబు, జ్వరం తప్ప తన ఆరోగ్యం బాగానే ఉందని ఎవరూ కంగారు పడొద్దని సూచించారు. వైద్యులు తనను సెల్ఫ్ క్వారంటైన్‌లో ఉండమని సూచించారని కానీ తన కుటుంబ సభ్యులకు ఇబ్బంది అవుతుందని తాను ఆసుపత్రిలో చేరినట్టు తెలిపారు. తన స్నేహితులంతా ఆసుపత్రిలోనే ఉన్నారని.. తనను జాగ్రత్తగా చూసుకుంటున్నారని వెల్లడించారు.
‘‘నేను రెండు మూడు రోజులుగా కాస్త ఇబ్బందికరంగా ఫీలవుతున్నా. చెస్ట్‌లో ఫ్లమ్ ఫామ్ అవుతోంది. జలుబు, జ్వరంతో బాధపడుతున్నా. ఈ మూడు ఇబ్బందులు తప్ప మరే ప్రాబ్లమ్ లేదు. కానీ నేను దాన్ని ఈజీగా తీసుకోదలుచుకోలేదు. కాబట్టి ఆసుపత్రికి వెళ్లి పరీక్ష చేయించుకున్నాను. కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. మైల్డ్‌గా ఉండటం వలన సెల్ఫ్ క్వారంటైన్‌లో ఉండి వైద్యుల సూచనలను పాటించమని చెప్పారు. కానీ నేను ఇంట్లో ఉంటే నా ఫ్యామిలీ మెంబర్స్‌కి ఇబ్బందవుతుందని హాస్పిటల్‌లో అడ్మిట్ అయ్యాను. నా స్నేహితులంతా ఇక్కడ ఉన్నారు. చాలా జాగ్రత్తగా చూసుకుంటున్నారు. నేనెలా ఉన్నానోనని ఎవరూ కంగారు పడొద్దు. నేను బాగానే ఉన్నాను’’ అని ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం తెలిపారు.