ఎస్పీబీకి క‌రోనా నెగ‌టివ్‌

ప్ర‌ముఖ గాయ‌కుడు ఎస్‌.పి.బాల‌సుబ్ర‌హ్మ‌ణ్యం క‌రోనా వైర‌స్ కార‌ణంగా కొన్నిరోజులుగా హాస్పిట‌ల్‌ల‌కే ప‌రిమిత‌మైన సంగ‌తి తెలిసిందే. ఆయ‌న ఆరోగ్యం బాగుప‌డాల‌ని ఆయ‌న అభిమానులు, సంగీతాభిమానులు కోరుకుని ప్రార్థ‌న‌లు కూడా చేశారు. క్ర‌మంగా ఎస్పీబీ ఆరోగ్యం కుదుట‌ప‌డుతుంది. రీసెంట్‌గా జ‌రిపిన క‌రోనా ప‌రీక్ష‌ల్లో ఆయ‌న‌కు క‌రోనా నెగ‌టివ్ వ‌చ్చింది. ఈ విష‌యాన్ని ఆయ‌న త‌న‌యుడు ఎస్‌.పి.చ‌ర‌ణ్ స్పెష‌ల్ వీడియో ద్వారా తెలియ‌జేశారు. ‘‘క్ష‌మించండి.. నాన్న ఆరోగ్యం గురించి వారాంతంలో అప్‌డేట్ ఇవ్వ‌లేక‌పోయాను. ప్ర‌స్తుతం ఆయ‌న ఊపిరితిత్తులు పనితీరు మెరుగ్గా ఉంది. దాంతో వెంటిలేట‌ర్‌ను తొల‌గిస్తార‌ని మేం భావించాం. అయితే ఆయ‌న ఊపిరితిత్తుల్లో ఇంకా ఇన్‌ఫెక్ష‌న్ ఉండ‌టంతో వెంటిలేట‌ర్ తీయ‌డానికి సాధ్య‌ప‌డ‌లేదు. తాజాగా చేసిన క‌రోనా ప‌రీక్ష‌ల్లో నెగ‌టివ్ వ‌చ్చింది’’ అన్నారు.

ఆగ‌స్ట్ 5 నుండి ఎస్‌.పి.బాల‌సుబ్ర‌హ్మ‌ణ్యం క‌రోనా సోక‌డంతో చెన్నైలోని ఎంజీఎం హాస్పిట‌ల్‌లో జాయిన్ అయ్యారు. ఒకానొక దశ‌లో ఆయ‌న ఆరోగ్యం క్రిటిక‌ల్ ద‌శ‌కు చేరుకుంది. అయితే ఇక్క‌డి డాక్ట‌ర్స్ వైద్యంతో పాటు విదేశీ డాక్ట‌ర్స్ కూడా వైద్య స‌ల‌హాలు ఎంత‌గానో ఆయ‌న‌కు ఉప‌యోగ‌ప‌డ్డాయి. క్ర‌మంగా ఆయ‌న కోలుకుంటూ వ‌స్తున్నారు.