విషమంగానే ఎస్పీ బాలు ఆరోగ్యం..
- IndiaGlitz, [Wednesday,August 19 2020]
గాన గంధర్వుడు ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం ఆరోగ్య పరిస్థితి ఇంకా విషమంగానే ఉంది. తాజాగా ఆయన చికిత్స పొందుతున్న చెన్నైలోని ఎంజీఎం ఆసుపత్రి వర్గాలు హెల్త్ బులిటెన్‌ను విడుదల చేశాయి. ‘‘కరోనా కారణంగా ఎంజీఎం హెల్త్ కేర్‌లో అడ్మిట్ అయిన ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం పరిస్థితి ఇంకా క్రిటికల్‌గానే ఉంది. ఆయనను ఐసీయూలో వెంటిలేటర్‌పై ఉంచి చికిత్సను అందిస్తున్నాం. నిపుణుల బృందం ఆయన ఆరోగ్య పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తోంది’’ అని హెల్త్ బులిటెన్‌లో ఆసుపత్రి వర్గాలు పేర్కొన్నాయి.
కాగా ఎస్పీ బాలు సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి రావాలని నిన్న సామూహిక ప్రార్థనలకు టాలీవుడ్ పిలుపునివ్వగా.. నేడు కోలీవుడ్ పిలుపునిచ్చింది. ఆగస్ట్ 20న జరగనున్న ఈ సామూహిక ప్రార్థనల కార్యక్రమంలో సినీ పరిశ్రమకు చెందినవారు మాత్రమే కాకుండా.. సంగీత ప్రియులూ సైతం పాల్గొనాలని కోరుతూ రజినీకాంత్, కమల్‌హాసన్, భారతీరాజా, ఇళయరాజా, ఏఆర్ రెహమాన్, వైరముత్తు తదితరులు ఒక ప్రకటన విడుదల చేశారు.
కాగా.. బాల సుబ్రహ్మణ్యం క్షేమంగా తిరిగి రావాలని దేశం మొత్తం కాక్షింస్తోంది. సెలబ్రిటీలంతా ఆయన ఆరోగ్యంగా తిరిగి రావాలని కోరుతూ ట్వీట్లు చేస్తున్నారు. మరోవైపు ఎస్పీబీ ఆరోగ్యంపై ప్రధాని కార్యాలయం కూడా ఆరా తీసినట్టు సమాచారం. అటు తమిళనాడు ముఖ్యమంత్రి పళని స్వామి.. ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఆసుపత్రి వర్గాలకు ఫోన్ చేసి బాలు ఆరోగ్యం గురించి తెలుసుకున్నట్టు తెలుస్తోంది.