మరింత విషమించిన గాన గంధర్వుడి ఆరోగ్యం
Send us your feedback to audioarticles@vaarta.com
గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆరోగ్య పరిస్థితి మళ్లీ విషమించింది. ఆగస్ట్ తొలి వారంలో కరోనా బారిన పడిన ఆయన అప్పటి నుంచి చెన్నైలోని ఎంజీఎం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. ఇటీవల ఆయన కరోనా నుంచి కోలుకున్నారు. అయితే నేటి సాయంత్రం ఆయన ఆరోగ్యం ఒక్కసారిగా విషమించింది. తాజాగా ఆసుపత్రి వర్గాలు బాలు ఆరోగ్య పరిస్థితిపై బులిటెన్‌ను విడుదల చేసింది. ఆయన ఆరోగ్య పరిస్థితి మరింత విషమించిందని ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి.
‘‘కరోనాతో బాధపడుతూ ఆగస్టు 5న ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం ఎంజీఎం హెల్త్ కేర్‌లో జాయిన్ అయ్యారు. అప్పటి నుంచి ఆయనకు ఎక్మో వెంటిలేటర్ సహా ఇతర మార్గాల ద్వారా చికిత్సను అందిస్తున్నాం. గడిచిన 24 గంటల్లో ఆయన పరిస్థితి మరింత విషమించింది. ఎస్పీబీ ఆరోగ్యాన్ని ఎంజీఎం ఆసుపత్రి వర్గాలు నిరంతరం పర్యవేక్షిస్తున్నాయి’’ అని ఆసుపత్రి వర్గాలు హెల్త్ బులిటెన్‌లో పేర్కొన్నాయి.
ఆగస్ట్ 5న తనకు కరోనా సోకిందని.. వైద్యులు హోం ఐసోలేషన్‌లో ఉండి చికిత్స తీసుకోమని సూచించారని.. కానీ ఇంట్లో వాళ్లు ఇబ్బంది పడతారని.. తాను చికిత్స నిమిత్తం ఆసుపత్రిలో చేరానంటూ ఓ వీడియోను విడుదల చేశారు. ఆ తరువాత కొద్ది రోజుల పాటు బాగానే ఉన్న ఆయన ఆరోగ్యం సడెన్‌గా ఒకరోజు విషమించింది. దీంతో వైద్యులు బాలుని ఐసీయూకి తరలించి ఎక్మో సాయంతో వెంటిలేటర్‌పై ఉంచి వైద్యం అందిస్తూ వస్తున్నారు.
ఇటీవలే కరోనా నెగిటివ్..
కాగా.. బాలుకి ఇటీవలే పరీక్షల్లో కరోనా నెగిటివ్ అని తేలింది. అప్పటి నుంచి ఆయన క్రమంగా కోలుకుంటున్నారని ఆయన కుమారుడు ఎస్పీ చరణ్ హెల్త్ బులిటెన్‌లో పలుమార్లు తెలిపారు. బాలు వైద్యానికి చక్కగా స్పందిస్తున్నారని.. ఫిజియో థెరపీ కూడా చేస్తున్నామని వెల్లడించారు. అంతా బాగుంది.. త్వరలోనే ఇక ఆయన క్షేమంగా ఇంటికి తిరిగి వస్తారని దేశ వ్యాప్తంగా ఆయన అభిమానులు సంతోషిస్తుండగా.. నేడు ఒక్కసారిగా ఆయన ఆరోగ్యం విషమించిందని ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout