ఎస్పీబీపై బెంగతో వీరాభిమాని మృతి
- IndiaGlitz, [Thursday,August 20 2020]
గానగంధర్వుడు ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం పరిస్థితి విషమంగా ఉన్న విషయం తెలిసిందే. దీంతో ఆయన అభిమానులంతా తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. తాజాగా ఆయన వీరాభిమాని ఒకరు విపరీతమైన బెంగతో హఠాన్మరణం పాలయ్యారు. ‘పాడుతా తీయగా’ కార్యక్రమానికి బాలు జడ్జిగా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. ఈ కార్యక్రమానికి హరీంద్రబాబు అనే వ్యక్తి అస్సలు మిస్ అవకుండా హాజరవుతూ వచ్చారు.
ఇప్పటి వరకూ హరీంద్రబాబు ‘పాడుతా తీయగా’ కార్యక్రమానికి సంబంధించి ఏ ఒక్క ఎపిసోడ్‌ను కూడా మిస్ అవకపోవడం విశేషం. ఆడియన్స్ కూర్చొని ప్రతీ ఒక్క పాటనూ ఆయన ఆస్వాదించేవారు. ఆయనకు సినిమా పాటలపై విపరీతమైన పరిజ్ఞానం, ఇష్టం ఉండటంతో ఆ కార్యక్రమానికి అస్సలు గైర్హాజరు అయ్యేవారు కాదు. అంతే కాకుండా ‘పాడుతా తీయగా’ కార్యక్రమంలో పాల్గొనే పార్టిసిపెంట్స్ అందరినీ కలిసి అభినందించి ఆశీర్వదించేవారు.
హరీంద్రబాబు ప్రతి పాటనూ ఆస్వాదించడాన్ని ఒకసారి బాలు గమనించారు. అంతేకాకుండా హరీంద్ర బాబు ప్రతి ఎపిసోడ్‌కూ హాజరవడం ఆయనకు ఆశ్చర్యమనిపించింది. దీంతో బాలు స్వయంగా ఆయనను వేదికపైకి ఆహ్వానించి సన్మానించారు. అప్పటి నుంచి వారిద్దరి మధ్య మంచి సాన్నిహిత్యం ఉండేది. ఈ పరిచయం 15 ఏళ్లుగా కొనసాగుతోంది. ఏదైనా పాట వివరాలు తెలియకపోతే బాలుని అడిగి హరీంద్రబాబు తెలుసుకునే వారు. బాలు పరిస్థితి విషమించింది అన్న దగ్గర నుంచి ఆయన విపరీతమైన బెంగ పెట్టుకున్నారు. ఆయన కోలుకోవాలని ప్రార్థనలు నిర్వహిస్తున్నారు. అదే బెంగతో నేటి ఉదయం 3:30 గంటలకు హరీంద్రబాబు హఠాన్మరణం పాలయ్యారు.