సౌరవ్ గంగూలీకి కరోనా.. ఆసుపత్రిలో చేరిక, వ్యాక్సిన్ వేయించుకున్నా పాజిటివ్
Send us your feedback to audioarticles@vaarta.com
భారత్‌లో కరోనా మహమ్మారి మళ్లీ తిరగబెడుతున్నట్లుగానే పరిస్థితులు కనిపిస్తున్నాయి. సామాన్యులతో పాటు పలువురు ప్రముఖులు ఒక్కొక్కరిగా వైరస్ బారినపడుతున్నారు. కరీనా కపూర్, అమృత అరోరా, కమల్ హాసన్, విక్రమ్, వడివేలతో పాటు తెలంగాణ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, ఎంపీ రంజిత్ రెడ్డి తదితరులకు పాజిటివ్‌గా తేలింది. ఇప్పుడు ఈ లిస్ట్‌లోకి భారత క్రికెట్ దిగ్గజం, బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ కూడా చేరారు.
కరోనా లక్షణాలు కనిపించడంతో దాదా నిన్న ఆర్టీపీసీఆర్ పరీక్షలు చేయించుకున్నారు. ఇందులో కొవిడ్ పాజిటివ్‌గా తేలడంతో.. ఆయన కోల్‌కతాలోని వుడ్‌లాండ్ ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతున్నారు. గంగూలీకి స్వల్ప లక్షణాలు మాత్రమే ఉన్నాయని బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి. ఇప్పటికే గంగూలీ కుటుంబసభ్యులు సైతం కోవిడ్ బారిన పడ్డారు. టీమిండియా మాజీ సారథి ఇప్పటికే రెండు డోసుల వ్యాక్సిన్ వేయించుకున్నారు. గంగూలీ కరోనా బారినపడ్డారని తెలుసుకున్న ఆయన అభిమానులు.. త్వరగా కోలుకోవాలని ఆకాంక్షింస్తూ సోషల్ మీడియాలో పోస్ట్‌లు పెడుతున్నారు.
ఇకపోతే ఈ ఏడాదిలో గంగూలీ హాస్పిటల్ పాలవ్వడం ఇది మూడోసారి. ఈ ఏడాది ఆరంభంలో.. ఛాతిలో ఇబ్బంది కారణంగా దాదా హాస్పిటల్‌లో చేరారు. అయితే పరీక్షల తర్వాత అది హార్ట్ అటాక్ అని తేలింది. కోల్‌కతాలోని తన నివాసంలో ఎక్సర్‌సైజ్ చేస్తుండగా.. గంగూలీ గుండెపోటుకు గురయ్యారు. దీంతో రైట్ కరోనరీ యాంజియోప్లాస్టీ నిర్వహించారు. కోలుకున్న అనంతరం డిశ్చార్జ్ కూడా చేశారు. అయితే మళ్లీ 20 రోజుల తర్వాత గంగూలీకి అదే విధంగా ఛాతిలో నొప్పి రావడంతో.. జనవరి 28న మరోసారి యాంజియోప్లాస్టీ నిర్వహించారు. ఈ క్రమంలోనే గుండెలో రెండు స్టంట్లను అమర్చారు వైద్యులు. ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన తర్వాత గంగూలీ తన రోజువారీ కార్యకలాపాల్లో మునిగిపోయారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments