సౌఖ్యం కథ మామూలుగానే ఉంటుంది...కానీ కథనం చాలా డిఫరెంట్ గా ఉంటుంది. - డైరెక్టర్ ఎ.ఎస్.రవికుమార్ చౌదరి
- IndiaGlitz, [Thursday,December 24 2015]
మనసుతో చిత్రంతో దర్శకుడిగా పరిచయమై...యజ్నం సినిమాతో సక్సెస్ సాధించి తనకంటూ ఓ గుర్తింపు ఏర్పరుచుకున్న డైరెక్టర్ ఎ.ఎస్.రవి కుమార్ చౌదరి. వీరభద్ర, ఆటాడిస్తా, ఏం పిల్లో ఏం పిల్లడో, పిల్లా నువ్వులేని జీవితం చిత్రాలను అందించిన ఎ.ఎస్.రవికుమార్ చౌదరి తాజాగా తెరకెక్కించిన చిత్రం సౌఖ్యం. గోపీచంద్, రెజీనా జంటగా నటించిన సౌఖ్యం చిత్రం ఈనెల 24న రిలీజ్ అవుతుంది. ఈ సందర్భంగా సౌఖ్యం గురించి డైరెక్టర్ ఎ.ఎస్.రవి కుమార్ చౌదరి ఇంటర్ వ్యూ మీకోసం...
సౌఖ్యం కాన్సెప్ట్ ఏమిటి..?
సౌఖ్యం అచ్చమైన తెలుగు పదం. మీరు బాగున్నారా అని అడగడానికి మీరు సౌఖ్యమా..? అని అడుగుతాం. సౌఖ్యం అంటే అందరూ బాగుండాలి అని అర్ధం. ఈ సినిమాలో మా హీరో గోపీచంద్ తన చుట్టూ ఉన్న వాళ్లతో పాటు అందరూ బాగుండాలి అని కోరుకునే క్యారెక్టర్. హీరో ఒక అమ్మాయిని ప్రేమిస్తాడు. ఆ అమ్మాయిని హీరో కుటుంబ సభ్యులు ఎలా అంగీకరించారు. ఫ్యామిలీ మెంబర్స్ అంగీకరించడానికి హీరో ఏం చేసాడనేది ఆసక్తిగా ఉంటుంది. కథ మామూలుగానే ఉంటుంది. కానీ..కథనం ఇంట్రస్టింగ్ గా ఉంటుంది. 2 గంటల 15 ని.లు ఆడియోన్స్ ను కట్టిపడేసేలా ఉంటుంది.
రైటర్ శ్రీధర్ సీపాన కథ చెప్పినప్పుడు మీకు నచ్చిన పాయింట్ ఏమిటి..?
శ్రీధర్ సీపాన కథ చెప్పినప్పుడు ఎంటర్ టైన్మెంట్ బాగా నచ్చింది. ఈ సినిమాలో చాలా క్యారెక్టర్స్ ఉన్నాయి. ఆ క్యారెక్టర్స్ తో హీరో ఎంటర్ టైన్మెంట్ చేసే విధానం నన్ను బాగా ఆకట్టుకుంది. అలాగే ప్రతి రీల్ లో ఓ ట్విస్ట్ ఉంటుంది. థియేటర్ కి వచ్చిన ప్రేక్షకుడు ఏమాత్రం బోర్ ఫీలవ్వకుండా టెన్షన్స్ మర్చిపోయి హాయిగా నవ్వుకునేలా ఈ సినిమా ఉంటుంది.
గోపీచంద్, బాలక్రిష్ణ, సాయిథరమ్ తేజ్...తో వర్క్ చేసారు కదా..? ఎవరితో వర్క్ చేసినప్పుడు కంఫర్ట్ ఫీలయ్యారు..?
నేను అందరితో కంఫర్ట్ గా ఉంటాను. బాలయ్యబాబుతో నాకు ఎంత కంఫర్ట్ ఉంటుందో...గోపీచంద్ దగ్గర కూడా అంతే కంఫర్ట్ ఉంటుంది. వీళ్లిద్దరి దగ్గర ఎంత కంఫర్ట్ ఫీలవుతానో సాయిథరమ్ తేజ్ దగ్గర కూడా అంతే కంఫర్ట్ ఫీలవుతాను.
మీరు రాసిన కథ కాకుండా వేరే కథను డైరెక్ట్ చేసినప్పుడు ఉండే ప్లస్ అండ్ మైనస్ ఏమిటి..?
నాకు రెండింటికీ పెద్ద తేడా ఏమి అనిపించలేదు. కథ రాసేంత వరకు నేను కేవలం రచయితను మాత్రమే. నేను డైరెక్ట్ చేసేటప్పుడు మాత్రమే డైరెక్టర్ ని.అలాగే వేరే రచయిత కథ చెబుతున్నప్పుడు వింటాను. ఆతర్వాత డైరెక్టర్ వర్క్ స్టార్ట్ అవుతుంది.కథ నాదైనా రచయితదైనా ఓ పరిమితి ఉంటుంది. డైరెక్టర్ గా ఉన్నప్పుడు నా కథ అయినా ఓకె. వేరే వాళ్ళ కథ అయినా ఓకె.
గోపీచంద్, ఎ.ఎస్.రవికుమార్ చౌదరి సినిమా అంటే యాక్షన్ ఎక్కువ ఎక్స్ పెక్ట్ చేస్తారు. మరి...యాక్షన్ ఎపిసోడ్స్ ఉంటాయా..?
మీరు చెప్పినట్టు గోపీచంద్, నేను కలసి సినిమా చేసేమంటే ఖచ్చితంగా యాక్షన్ ఉంటుందని ఎక్స్ పెక్ట్ చేస్తారు. అందుచేత యాక్షన్ ఎపిసోడ్స్ ని మిస్ చేయలేదు. ఇందులో మూడు యాక్షన్ ఎపిసోడ్స ఉన్నాయి. మూడు యాక్షన్ ఎపిసోడ్స్ ఒకేలా ఉండవు...చాలా డిఫరెంట్ గా ఉంటాయి. ఈ యాక్షన్ ఎపిసోడ్స్ ను కథలో భాగంగానే చేసాం తప్ప కావాలని పెట్టినట్టు అసలు అనిపించదు.
యజ్నం, లక్ష్యం, శౌర్యం, లౌక్యం..ఇప్పుడు సౌఖ్యం..సెంటిమెంట్ ప్రకారమే టైటిల్ పెట్టారా..?
నేను ఈ విషయం గురించి గోపిని అడిగితే...నాకు సెంటిమెంట్ ఏమీ లేదండి. ఆటోమేటిక్ గా అలా వచ్చేస్తుంది అని చెప్పాడు. సున్నా లేకుండా ఒక్కడున్నాడు సినిమా ఉంది. అలాగే ఆక్సిజన్ టైటిల్ లో కూడా సున్న లేదు. ఇక ఈ సినిమా టైటిల్ విషయానికి వస్తే....హీరో అందరూ బాగుండాలి అని కోరుకుంటాడు. అందుచేత హీరో క్యారెక్టర్ బట్టి సౌఖ్యం అనే టైటిల్ పెట్టాం.
ఈ సినిమాలో హీరో గోపీచంద్ ఏం చేస్తుంటాడు..?
హీరో చదువు పూర్తి చేసుకుని తండ్రికి తోడుగా ఉంటాడు. అంతే కానీ...హీరోకి ప్రత్యేకించి ప్రొఫెషన్ అంటూ ఏమీ పెట్టలేదు.
పిల్లా నువ్వులేని జీవితం హీరోయిన్ రెజీనానే సౌఖ్యంలో కూడా హీరోయిన్ గా సెలెక్ట్ చేసారు..?
ఈ సినిమాలో హీరోయిన్ క్యారెక్టర్ కి రెజీనానే కరెక్ట్ అనిపించి సెలెక్ట్ చేసాం. రెజీనా తన గత చిత్రాలన్నింటి కంటే ఈ సినిమాలో చాలా అందంగా కనిపిస్తుంది. సౌఖ్యం తర్వాత రెజీనాకి మంచి కమర్షియల్ బ్రేక్ వస్తుందని గట్టిగా నమ్ముతున్నాను.
గోపీచంద్ తో గతంలో యజ్నం చేసారు కదా..? అప్పటికీ ఇప్పటికీ గోపీచంద్ లో వచ్చిన మార్పు ఏమిటి..?
గోపీచంద్ లో ఉండే ఫ్రెండ్లీ నేచర్ లో కానీ...డైరెక్టర్ కి ఇచ్చే రెస్పక్ట్ లో కానీ ఏమాత్రం మార్పు లేదు. కానీ ఆర్టిస్ట్ గా మాత్రం చాలా మెచ్యూర్డ్ గా ఉన్నాడు. యజ్నం అప్పుడు చాలా మాస్ గా రఫ్ గా ఉండేవాడు. ఇప్పుడు తన హెయిర్ స్టైల్, బాడీ లాంగ్వేజ్, లుక్ లో యూత్ ఫుల్ గా కనిపిస్తున్నాడు.
పిల్లా నువ్వులేని జీవితం ముందు మీకు గ్యాప్ వచ్చింది. ఇప్పుడు గ్యాప్ లేకుండా సినిమాలు చేస్తున్నారు కారణం..?
గ్యాప్ రావడానికి గ్యాపే కారణం.(నవ్వుతూ..) అలా.. గ్యాప్ వచ్చేసింది అంతే. ఇక నుంచి గ్యాప్ లేకుండా సినిమాలు చేయడానికి ట్రై చేస్తాను.
మీకు తొలి చిత్రం మనసుతో నిర్మాత ఆనంద్ ప్రసాద్ గారితో ఇప్పుడు సౌఖ్యం సినిమా చేయడం ఎలా ఉంది..?
నా తొలి చిత్రం మనసుతో కి ఆనంద్ ప్రసాద్ గారే అవకాశం ఇచ్చారు. అప్పుడు నాకు మెచ్యూరిటీ లేకపోవడం వలనో...నా టైం బాగోలేకపోవడం వలనో అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయాను. ఆతర్వాత నుంచి ఆనంద్ ప్రసాద్ గార్ని కలుస్తునే ఉన్నాను. అయితే ఈసారి సినిమా చేస్తే మంచి సినిమా చేయాలి. హిట్ సినిమా చేయాలి అని వెయిట్ చేసాం. ఇప్పుడుకి సెట్ అయ్యింది.
మ్యూజిక్ డైరెక్టర్ అనూప్ గురించి..?
పిల్లా నువ్వులేని జీవితం తర్వాత అనూప్ తో నాకు రెండో సినిమా ఇది. పిల్లా నువ్వులేని జీవితం కంటే ఎక్కువ కేర్ తీసుకుని ఈ సినిమాకి మ్యూజిక్ అందించాడు. ఐదు సాంగ్స్ కి ఒకదానితో ఒకటి సంబంధం లేకుండా డిఫరెంట్ గా ఉంటాయి. సాంగ్స్ ఎంత బాగా చేసాడో..రి రీకార్డింగ్ కూడా అంతకన్నా బాగా చేసాడు.
క్రిస్మెస్ కి చాలా సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. మరి..ఈ పోటీని తట్టుకుని సౌఖ్యం ఏరేంజ్ సక్సెస్ సాధిస్తుంది అనుకుంటున్నారు..?
అందరూ సౌఖ్యంగా ఉండాలి. సౌఖ్యం సినిమా ఆడాలి. సౌఖ్యంతో పాటు రిలీజ్ అవుతున్న అన్ని సినిమాలు బాగా ఆడాలి. ఇండస్త్రీ పచ్చగా ఉండాలి.