మీ అసౌకర్యానికి చింతిస్తున్నా.. కఠిన నిర్ణయాలు తప్పవ్..!
Send us your feedback to audioarticles@vaarta.com
కరోనా నేపథ్యంలో దేశం మొత్తాన్ని సంపూర్ణంగా మూసివేస్తున్నట్లు (లాక్డౌన్) ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈనెల 24న సంచలన ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. ఈ మూసివేత అనేది 21 రోజుల పాటు అనగా.. ఏప్రిల్-15 వరకు కొనసాగుతుందని ప్రధాని స్పష్టం చేశారు. ఈ లాక్‌డౌన్‌తో అక్కడక్కడా ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. స్వగ్రామాలకు వెళ్లలేక.. ఉన్న చోట ఉండలేక నానా తంటాలు పడుతున్నారు. ఎక్కడికక్కడ పోలీసులు నిలిపివేస్తూ.. ఎక్కువ మాట్లాడితే లాఠీ చార్జ్ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయ్. ఈ క్రమంలో ప్రజలు పడుతున్న ఇబ్బందులకు చలించిన ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి మన్ కీ బాత్‌లో మాట్లాడారు.
లెక్కచేయకపోతే ఇబ్బందే..!
ప్రజలకు కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నానని.. దినసరి కూలీలు పడుతున్న కష్టాన్ని తాను అర్థం చేసుకున్నానని మోదీ చెప్పుకొచ్చారు. ప్రపంచ పరిస్థితులు చూశాకే కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చిందని.. ఇది జీవన్మరణ పోరాటం అని తెలిపారు. ‘రోగం వచ్చినప్పుడే చికిత్స చేయాలి.. లేదంటే ఇబ్బందులొస్తాయి. ఎవరికో సాయం చేసేందుకు లాక్డౌన్లో పాల్గొనడంలేదు. ప్రజల రక్షణ కోసమే దేశంలో లాక్డౌన్ అమలు చేస్తున్నాం. కరోనా ఏ ఒక్క ప్రాంతానికో పరిమితమైనది కాదు. కొందరు ఇప్పటికీ సీరియస్‌నెస్‌ను అర్థం చేసుకోవడంలేదు. మీరు నిబంధనలు బేఖాతరు చేస్తే ఇతరులకు ఇబ్బంది’ అని మోదీ తెలిపారు.
కఠిన నిర్ణయాలు తప్పవ్..!
‘కరోనా వైరస్ అందరికీ సమానమే, పేద, ధనిక తేడాలేదు. కరోనాపై మనం చేస్తున్న యుద్ధం గెలిచి తీరాల్సిందే. ప్రభుత్వం విధించిన లక్ష్మణరేఖను ఎవరూ దాటొద్దు. లాక్‌డౌనే కరోనా వైరస్ నివారణకు పరిష్కార మార్గం. నిబంధనలు ఉల్లంఘిస్తే ప్రజల ప్రాణాలకే ముప్పు. కరోనా వైరస్‌ను జయించినవారు మనకు స్ఫూర్తిప్రదాతలు. కరోనా మానవత్వానికి సవాల్ విసురుతోంది. కరోనాపై గెలవాలంటే కఠిన నిర్ణయాలు తప్పవు. అందరూ ఏకమై కరోనాపై యుద్ధం చేయాలి. ప్రభుత్వ నిబంధనలు, స్వీయ నియంత్రణ పాటించాలి’ అని మోదీ మరోసారి పిలుపునిచ్చారు.
'లక్ష్మణ రేఖ' దాటకుండా ఉండాల్సిందే!
ఓ వైద్యుడు ఫోన్ చేసి, నిత్యమూ కరోనా కేసులతో ఊపిరి సలపడం లేదని, తామంతా ఒత్తిడిలో కూరుకుపోతున్నామని వ్యాఖ్యానించారు. ఇందుకు మోదీ స్పందిస్తూ ఆయనకు ధైర్యం చెప్పారు. ఈ విపత్కర పరిస్థితుల్లో వైద్యుల సేవలను జాతి ఎన్నటికీ మరచిపోబోదని అన్నారు. ఎంత విధి నిర్వహణలో ఉన్నా, కుటుంబానికి కూడా కొంత సమయం కేటాయించాలని, స్వీయ ఆరోగ్యంపైనా శ్రద్ధ పెట్టాలని సూచించారు. మరికొన్నిరోజుల పాటు 'లక్ష్మణ రేఖ' దాటకుండా ఉండాల్సిందేనని మోదీ స్పష్టం చేశారు. ఈ క్రమంలో ప్రతిఒక్కరూ ధైర్యంతో కరోనాపై పోరాడాలన్నారు. కరోనా వైరస్ కట్టడికి వైద్యులు, నర్సులు, ఇతర వైద్య సిబ్బంది చేస్తున్న కృషి అభినందనీయమని మోదీ చెప్పుకొచ్చారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments