సాయం అందించాలని సోనూసూద్ పిలుపునకు విశేష స్పందన

లాక్‌డౌన్ మొదలు చేతికి ఎముక లేదన్నట్టుగా కష్టాల్లో ఉన్న జనానికి సాయం అందిస్తూ వస్తున్న ప్రముఖ నటుడు, రియల్ హీరో సోనూసూద్ ప్రస్తుతం సాయం కోసం అర్థిస్తున్నారు. అయితే ఆ సాయం తనకోసం కాదు లెండి.. ఆపదలో ఉన్న వారి కోసం. తన శక్తిమేర ఇప్పటి వరకూ సాయం అందిస్తూ వచ్చిన సోనూసూద్.. ఇక తనతో చేతులు కలపాలని అర్థిస్తున్నారు. కరోనా బాధితుల కోసం తన శక్తి మేర సాయమందిస్తున్నానని.. వారిని ఆదుకునేందుకు మరిన్ని ఆపన్న హస్తాలు కావాలని.. దయచేసి ముందుకు రావాలంటూ ప్రజలకు సోనూ పిలుపునిచ్చారు.

దాదాపు అడిగిన వారికి లేదనకుండా క్షణాల్లో వారికి అవసరమైన వైద్యావసరాలను సోనూసూద్ తీర్చారు. కాగా.. దేశవ్యాప్తంగా కరోనా కేసులు పెరిగి.. ఆస్పత్రులకు రోగులు పోటెత్తుతండటంతో సమస్యల్లో ఉన్నవారు సాయం కోసం సోనూసూద్‌ను సంప్రదిస్తున్నారు. ప్రస్తుతం ఆయన సోషల్ మీడియాను ఒక్కసారి పరిశీలిస్తే.. ఎందరో ఆసుపత్రుల్లో బెడ్ దొరకని వారికి బెడ్ అరేంజ్ చేశారు అలాగే ఆక్సిజన్ అవసరమైన వారికి ఆక్సిజన్ అందించారు. కనీసం బతికేందుకు 20 శాతం కూడా అవకాశం లేని ఓ యువతికి పెద్ద మొత్తం ఖర్చు చేసి వైద్యం అందిస్తున్నారు. ఇక కరోనా రోగుల సంఖ్య లెక్కకు మించి ఉండటంతో వారిని ఆదుకునేందుకు ప్రజలూ ముందుకు రావాలని సోనూసూద్‌ పిలుపునిచ్చారు.

తనకు రూ.100 కోట్లతో తెరకెక్కే సినిమాలో చేయడం కన్నా కరోనా రోగులకు బెడ్లు, ఆక్సిజన్‌, మందులు అందజేస్తుండటంలోనే ఎక్కువ సంతృప్తి ఉంటుందని సోనూ సూద్‌ వెల్లడించారు. సాయం కోరిన ప్రతి ఒక్కరి కష్టాన్ని తీర్చేందుకు మేము శక్తిమేర ప్రయత్నిస్తున్నామని... బాధితుల అవసరాలు తీర్చేందుకు తమకు మరిన్ని ఆపన్న హస్తాలు కావాలని సోనూసూద్ కోరారు. దయచేసి ముందుకు రావాలని పిలుపునిచ్చారు. మీ శక్తి మేర సాయం చేయాలని సోనూ కోరారు. ఆయన ఈ పిలుపునకు నెటిజన్ల నుంచి గొప్ప స్పందన లభిస్తోంది. సోనూ కరోనాపై చేస్తున్న పోరులో తామూ భాగస్వాములం అవుతామంటూ వేలల్లో జనం పోస్టులు పెడుతున్నారు.