డోర్నకల్ చిన్నారి వైద్యానికి సోనూసూద్ సాయం..
Send us your feedback to audioarticles@vaarta.com
సాయం అడగటమే ఆలస్యం.. చేతికి ఎముక లేదన్నట్టుగా ప్రముఖ నటుడు సోనూసూద్ సాయం అందిస్తూ ఉంటారు. లాక్డౌన్ సమయంలో అసలు సోనూ అంటే ఏంటో ప్రజానీకానికి తెలిసి వచ్చింది. అప్పటి నుంచి ఆయన ఎవరో ఒకరికి సాయం అందిస్తూనే ఉన్నారు. కష్టంలో నిజాయితీ ఉంటే చాలు.. ఎంతటి సాయానికైనా సోనూ వెనుకాడరు. తాజాగా ఓ చిన్నారి కాలేయ మార్పిడికి అవసరమైన వైద్య ఖర్చులు 20 లక్షల రూపాయలను భరించేందుకు ముందుకు వచ్చారు.
సోనూసూద్ మరోసారి తన దాతృత్వాన్ని చాటుకున్నారు. మహబూబాబాద్ జిల్లాకు చెందిన ఓ బాలుడి కాలేయ మార్పిడికి వైద్య ఖర్చుల్ని భరిస్తానని ఆ చిన్నారి తల్లిదండ్రులకు అభయం ఇచ్చారు. డోర్నకల్ మండలం పెరుమాండ్ల సంకీసకు చెందిన దేశబోయిన నాగరాజు మహబూబాబాద్ ఆర్టీసీ డిపోలో జూనియర్ డ్రైవరుగా పని చేస్తున్నాడు. నాగరాజు కుమారుడు హర్షవర్ధన్ (6) పుట్టినప్పటి నుంచే కాలేయ సంబంధ వ్యాధితో బాధపడుతున్నాడు. అప్పటి నుంచి కుమారుడిని బతికించుకోవడం కోసం నాగరాజు దంపతులు వైద్యం కోసం రూ. 6 లక్షల వరకు ఖర్చు చేశారు.
అయితే హర్షవర్దన్‌కు హైదరాబాద్‌లో వైద్యులు కాలేయ మార్పిడి చేయాలని, రూ. 20 లక్షలు ఖర్చవుతుందని చెప్పారు. నాగరాజు సహోద్యోగులంతా కలిసి కొంత మేర సహాయాన్ని అందించారు. అంతేకాకుండా హర్షవర్ధన్ గురించి సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడంతో సోనూసూద్ స్పందించారు. తనవంతు సాయం చేస్తానని సోనూ తెలిపారు. దీంతో వరంగల్-2 డిపోలో పనిచేస్తున్న కండక్టర్ రంజిత్ యాదవ్ తమ బంధువుల సాయంతో హైదరాబాద్‌లో ఉన్న సోనూసూద్ వద్దకు గురువారం నాగరాజును తీసుకువెళ్లారు. బాలుడి అనారోగ్య పరిస్థితిని వివరించగా వైద్య ఖర్చులను అందజేస్తానని హామీ ఇచ్చారు. సోనూ ఒక చిన్నారి ప్రాణాన్ని నిలబెట్టేందుకు ముందుకు రావడం పట్ల నెటిజన్లు, ఆర్టీసీ ఉద్యోగులు, నాగరాజు దంపతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments