కోవిడ్ రోగిని హైదరాబాద్‌కు విమానంలో తరలించిన సోనూసూద్!
Send us your feedback to audioarticles@vaarta.com
గత ఏడాది లాక్‌డౌన్ సమయంలో రోడ్డుపైకి వచ్చి నిరంతరం సేవలందించి ప్రముఖ నటుడు సోనూసూద్ రియల్ హీరో అనిపించుకున్నారు. వలస కార్మికులను స్వగ్రామాలకు పంపించడంలో విశేష కృషి చేశారు. అప్పటి నుంచి కూడా ఆయన తన సేవలను అందిస్తూనే ఉన్నారు. ఇటీవలే సోనూ కూడా కరోనా బారిన పడ్డారు. ప్రస్తుతం ఆయన హోం క్వారంటైన్‌లో ఉన్నారు. అలా ఉండి కూడా తను అవసరమైన వారికి సేవలందించడం విశేషం. తాజాగా ఇప్పటి వరకూ ఇండియాలో ఎవరూ చేయలేని పనిని ఆయన చేసి మరోసారి రియల్ హీరో అనిపించుకున్నారు .
తాజాగా సోను సూద్ తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న కోవిడ్ రోగిని ప్రత్యేక చికిత్స కోసం నాగ్‌పూర్ నుంచి హైదరాబాద్‌కు ఎయిర్ అంబులెన్స్ విమానంలో పంపించారు. అసలు విషయంలోకి వెళితే నాగపూర్‌కి చెందిన భారతి అనే 25 ఏళ్ల యువతి కరోనా కారణంగా బాధపడుతోంది. ఈ క్రమంలోనే ఆమె తీవ్ర అనారోగ్యం బారిన పడటంతో సోనూ ఆమెను నాగ్‌పూర్‌లోని వోక్‌హార్ట్ ఆసుపత్రికి తరలించారు. అయితే ఆమె ఊపిరితిత్తులు దాదాపు 90 శాతం డ్యామేజ్ అయ్యాయి. ఈ క్రమంలోనే ఆమెకు ఊపిరితిత్తుల మార్పిడి లేదంటే ప్రత్యేక చికిత్స అవసరమని వైద్యులు నిర్ణయించారు.
ఇలాంటి చికిత్స ఎక్కడ సాధ్యమని ఆరా తీయగా.. హైదరాబాద్‌లోని అపోలో ఆసుపత్రిలో మాత్రమే సాధ్యమని తెలిసి వెంటనే సోనూ అపోలో ఆసుపత్రికి చెందని డైరక్టర్లతో సంప్రదింపులు జరిపారు. ఎక్మో చికిత్స ద్వారా వైద్యం అందించవచ్చని తెలుసుకున్నారు. దీని ద్వారా శరీరానికి కృత్రిమంగా రక్తం పంపింగ్ చేయడం వల్ల ఊపిరితిత్తులపై ఒత్తిడిని తొలగించవచ్చని వైద్యులు సూచించారు. అయితే ఈ ఎక్మో చికిత్స కోసం మొత్తం ఆరుగురు వైద్యులు ఒకరోజు ముందుగానే హైదరాబాద్‌కు రావాలి. దీని కోసమే ఎయిర్ అంబులెన్స్ ఏర్పాటు చేశారు. అలాగే హైదరాబాద్‌లో భారతికి అవసరమైన ది బెస్ట్ ట్రీట్‌మెంట్‌ను అందించగలిగారు.
దీని గురించి సోను సూద్ మాట్లాడుతూ, “అవకాశాలు 20% మాత్రమే మరి ముందుకు వెళదామా? వద్దా? అని వైద్యులు నన్ను అడిగారు. అయితే ఆమె వయసు 25 ఏళ్ల మాత్రమే. మహమ్మారితో ఆమె పోరాడి క్షేమంగా తిరిగి రావాలి. అందుకే నేను ఈ అవకాశాన్ని తీసుకున్నాము, వెంటనే ఎయిర్ అబులెన్స్ బుక్ చేశా. హైదరాబాద్ లోని అపోలో హాస్పిటల్ లో చికిత్స బాగా జరుగుతోంది, ఆమె కోలుకొని త్వరలో తిరిగి వస్తుందని ఆశిస్తున్నా” అని తెలిపారు. కోవిడ్ 19 పాండమిక్ సమయంలో ఒకరిని ఎయిర్ అంబులెన్స్‌లో చికిత్సకు తీసుకురావడం ఇదే మొదటి సారి. తనకు పాజిటివ్ వచ్చి హోం క్వారంటైన్‌లో ఉండి కూడా.. భారతికి బతికేందుకు అవకాశం 20 శాతం మాత్రమేనని తెలిసి కూడా.. ఆమెను బతికించేందుకు సోనూసూద్ పడుతున్న తాపత్రయం ప్రశంసనీయం. ఈ రియల్ హీరోకు మరోసారి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments