మరోసారి మానవత్వం చాటుకున్న సోనూసూద్.. యువకుడిని తన చేతులతో మోసుకుని ఆసుపత్రికి

  • IndiaGlitz, [Wednesday,February 09 2022]

సోనూసూద్... వెండితెరకు విలన్‌గానే తెలిసిన ఈ వ్యక్తి, అతని వ్యక్తిత్వం కోవిడ్ కష్టకాలంలో లోకానికి తెలిసింది. మానవసేవే మాధవ సేవ అన్న మాటను ఆచరణలో చూపుతూ... కష్టం అని తెలిసిన వెంటనే ఆదుకుంటూ వస్తున్నారు సోనూసూద్. కరోనా లాక్‌డౌన్ సమయంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న వలస కూలీలను బస్సులు, విమానాల ద్వారా స్వస్థలాలకు చేర్చారాయన. ఆ తర్వాత సెకండ్ వేవ్‌లో ఆక్సిజన్ సిలిండర్లు అందజేసి.. ఎంతోమంది ప్రాణాలు కాపాడారు సోనూ. ఈ చర్యలతో ఆయన రియల్ హీరోగా దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఎన్నో చోట్ల సోనూసూద్‌కు అభిమాన సంఘాలు కూడా వెలిశాయంటే అతిశయోక్తి కాదు.

తాజాగా మరోసారి మానవత్వం చాటుకున్నారు ఈ రియల్ హీరో. రోడ్డు ప్రమాదానికి గురైన యువకుడి ప్రాణాలు కాపాడారు. వివరాల్లోకి వెళితే... తన సొంతూరు పంజాబ్ రాష్ట్రం మొగా జిల్లాలో ప్రయాణం చేస్తుండగా... రోడ్డు మీద జరిగిన ఓ ప్రమాదాన్ని సోనూ చూశారు. రెండు కార్లు ఢీ కొట్టుకోవడంతో అందులో యువకులు అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయారు. అంతే క్షణం కూడా ఆలస్యం చేయకుండా.. స్వయంగా కారు లోపల తీవ్ర గాయాలపాలై పడివున్న యువకుడిని స్వయంగా ఆస్పత్రికి తీసుకువెళ్లారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఇక సినిమాల విషయానికి వస్తే ఆచార్య, తమిళరాసన్ చిత్రాలతో దక్షిణాదిని.. పృథ్వీరాజ్, ఫతేహీ చిత్రాలతో బాలీవుడ్‌ని పలకరించేందుకు సోనూసూద్ సిద్ధమవుతున్నారు. అలాగే రోడీస్ కొత్త సీజన్‌కి హోస్ట్‌గా కొత్త అవతారం ఎత్తనున్నారు సోనూ.