Sonia Gandhi: రాజ్యసభ సభ్యులుగా సోనియా గాంధీ, తెలుగు రాష్ట్రాల ఎంపీలు ప్రమాణం
- IndiaGlitz, [Thursday,April 04 2024]
కాంగ్రెస్ అగ్రనాయకురాలు సోనియా గాంధీ రాజ్యసభ సభ్యురాలిగా ప్రమాణ స్వీకారం చేశారు. పార్లమెంట్ భవన్‌లో ఉపరాష్ట్రపతి జగ్‌దీఫ్ ధన్‌కర్ ఆమె చేత ప్రమాణం చేయించారు. దీంతో వచ్చే ఆరు సంవత్సరాల పాటు అంటే 2030 ఏప్రిల్ 4 వరకు ఆమె రాజ్యసభ ఎంపీగా కొనసాగుతారు. కాగా ఇన్నాళ్లూ ప్రత్యక్ష రాజకీయాల్లో ఉన్న సోనియా ఈసారి వయసు రీత్యా లోక్‌సభ ఎన్నికల పోటీ నుంచి తప్పుకున్నారు. 77 ఏళ్ల వయసులో ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయడం కష్టమని భావించిన ఆమె ఈమేరకు నిర్ణయం తీసుకున్నారు. 2004 నుంచి యూపీలోని రాయ్‌బరేలీ నుంచి లోక్‌సభ ఎంపీగా ఐదుసార్లు ప్రాతినిధ్యం వహించారు.
కాంగ్రెస్ పార్టీకి రాయ్‌బరేలీ నియోజకవర్గం కంచుకోట లాంటిది. ఇప్పుడు సోనియా పోటీ నుంచి తప్పుకోవడంతో అక్కడ బలమైన అభ్యర్థిని నిలబెట్టాలని యోచిస్తున్నారు. సోనియా కుమార్తె ప్రియాంకగాంధీని పోటీ చేయించాలనే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. మరోవైపు బీజేపీ కూడా ఆ స్థానాన్ని కైవసం చేసుకుని కాషాయం జెండా ఎగరేయాలని ప్రణాళికలు రచిస్తోంది. ఇప్పటికే దేశంలోనే కీలకమైన యూపీలో కాంగ్రెస్ పార్టీ ఘోరమైన స్థితికి చేరుకుంది. ఏకంగా రాహుల్ గాంధీనే అమేథీ నుంచి ఓడిపోయారు.
ఇదిలా ఉంటే తెలుగు రాష్ట్రాలకు చెందిన నేతలు కూడా రాజ్యసభ సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేశారు. ఏపీ నుంచి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన గొల్ల బాబూరావు, మేడా రఘునాథ్ రెడ్డి, వైవీ సుబ్బారెడ్డి.. ఇటు తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీకి చెందిన వద్దిరాజు రవిచంద్ర, కాంగ్రెస్ పార్టీ నుంచి రేణుకా చౌదరి, అనిల్ కుమార్ యాదవ్ ప్రమాణం చేశారు. గతంలో ఏపీ నుంచి సీఎం రమేశ్, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, కనకమేడల రవీంద్రకుమార్ రాజ్యసభ సభ్యులుగా ఉండేవారు. వీరి పదవికాలం ఏప్రిల్ 2వ తేదీతో ముగిసింది. మరోవైపు 42 సంవత్సరాల టీడీపీ చరిత్రలో తొలిసారి ఆ పార్టీకి రాజ్యసభలో ప్రాతినిధ్యం లేకుండా పోయింది. ఎగువ సభలో చోటు కావాలంటే మరో రెండు సంవత్సరాల పాటు ఆగాల్సిందే.