ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా సోము వీర్రాజు..
- IndiaGlitz, [Tuesday,July 28 2020]
ఏపీ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా ఎమ్మెల్సీ సోము వీర్రాజు నియమితులయ్యారు. ప్రస్తుతం ఏపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న కన్నా లక్ష్మీనారాయణను పక్కకు తప్పించి బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సోము వీర్రాజుకు పట్టం కట్టారు. నడ్డా ఆదేశాల మేరకు పార్టీ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్ ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. 2018లోనే అధ్యక్ష పదవి కోసం కన్నా, సోము వీర్రాజుల మధ్య పోటీ జరిగింది. ఆ సమయంలో పార్టీ కన్నాకు పార్టీ అధ్యక్ష పదవిని అప్పగించి.. సోమూకు ఎన్నికల కమిటీ బాధ్యతలను అప్పగించింది.
పార్టీలో సాధారణ కార్యకర్తగా తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించిన సోము వీర్రాజు.. అనతి కాలంలోనే కీలక నేతగా ఎదిగారు. బీజేపీ ఫైర్ బ్రాండ్ నాయకుడిగా పేరు పొందిన ఆయన 2006 నుంచి వరుసగా పార్టీ ప్రధాన కార్యదర్శిగా వ్యవహరిస్తూ వస్తున్నారు. 2013 నుంచి జాతీయ కార్యవర్గ సభ్యుడిగా కొనసాగుతున్నారు. 2015లో ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. ఆయన కాలపరిమితి మరో ఏడాదితో ముగుస్తుంది. ఈలోగానే పార్టీ అధ్యక్ష పదవి సోము వీర్రాజును వరించింది.