సోమిరెడ్డికి కోలుకోలేని షాక్.. వైసీపీలో చేరిన సోదరుడు
Send us your feedback to audioarticles@vaarta.com
ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలు దగ్గరపడుతుండటంతో నేతల జంపింగ్‌లు ఎక్కువయ్యాయి. ఇప్పటికే పలువురు సిట్టింగ్‌లు అటు నుంచి ఇటు.. ఇటు నుంచి అటు పార్టీలు మారిన విషయం తెలిసిందే. ముఖ్యంగా మరోసారి సీటు దక్కించుకోవాలని టీడీపీ ఆపరేషన్ ఆకర్ష్ మొదలెడితే..
ఈసారి ఎలాగైనా సరే సీఎం పీఠం దక్కించుకోవాల్సిందేనని వైసీపీ భావిస్తోంది. మరోవైపు జనసేన అధినేత పవన్ కల్యాణ్ సైతం జోరు పెంచి.. అభిమానులు, కార్యకర్తల్లో నూతనోత్సాహం నింపుతూ ముందుకెళ్తున్నారు. ఇక చేరికల విషయానికొస్తే అధికార, ప్రతిపక్ష పార్టీల్లో చేరే నేతల సంఖ్య రోజురోజుకు ఎక్కువవుతోంది.
నెల్లూరు జిల్లాలో అంతంత మాత్రమే ఉన్న టీడీపీకి.. ముఖ్యంగా మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డికి కోలుకోలేని షాక్ తగిలింది. ఇప్పటికే తన బావ రామకోటారెడ్డి వైసీపీ తీర్థం పుచ్చుకోవడంతో రైట్ హ్యాండ్ పోయిందనుకుని బాధపడుతున్న సోమిరెడ్డికి... సోదరుడి రూపంలో మరో షాక్ తగిలింది.
సోమిరెడ్డి సోదరుడు సుధాకర్ రెడ్డి టీడీపీకి టాటా చెప్పి వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. సోమిరెడ్డి బద్ధ శత్రువైన సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్ రెడ్డి సమక్షంలో సుధాకర్ వైసీపీలో చేరడం గమనార్హం. ఈ సందర్భంగా సుధాకర్ రెడ్డికి వైసీపీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు కాకాణి.
ఈ సందర్భంగా కాకాణి మాట్లాడుతూ.. సోమిరెడ్డి అవినీతి సహించలేకే నేతలు టీడీపీని వీడుతున్నారని.. రాబోయే ఎన్నికల్లో వైసీపీ భారీ మెజారిటీతో అధికారంలోకి వస్తుందని ఆయన కాకాణి గోవర్ధన్ రెడ్డి చెప్పుకొచ్చారు.
కాగా ఇప్పుడున్న ఎమ్మెల్సీ పదవికి సైతం రాజీనామా చేసిన సోమిరెడ్డి.. 2019 ఎన్నికల్లో అయినా గెలిచి తీరాలనే కసితో సర్వేపల్లి నియోజకవర్గంలోని ప్రజలకు దగ్గరవుతున్నారు. తాను చేసిన మంచి పనులు, అభివృద్ధి పనులే తనను గెలిపిస్తాయని ధీమా వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇలాంటి తరుణంలో సొంత కుటుంబీకులు వరుస షాక్‌లు ఇస్తుండటం గమనార్హం. అయితే 2019 ఎన్నికల్లో సోమిరెడ్డి పరిస్థితి ఎలా ఉంటుందో వేచి చూడాల్సిందే మరి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout