Download App

Solo Brathuke So Better Review

జీవితంలో పెళ్లికి ఉన్న ప్రాధాన్యత ఏంటి? అసలు పెళ్లి చేసుకున్న వాళ్లందరూ హ్యాపీగా ఉన్నారా? పెళ్లి చేసుకోని వారు సంతోషంగా ఉన్నారా? ... ఇలాంటి పాయింట్స్‌తో పాటు పెళ్లి చేసుకున్న వారందరూ బాధలు పడుతున్నారంటూ  చాలా సినిమాలే వచ్చాయి. అయితే ఎన్ని సినిమాలు వచ్చినా! పెళ్లి విశిష్టత, భార్య గొప్పతనాన్ని వివరించేలా ముగింపు తీసుకున్నవే. ఇప్పుడు అలాంటి పాయింట్‌తోనే రూపొందిన చిత్రం 'సోలో బ్రతుకే సో బెటర్‌'. సాయితేజ్‌ హీరోగా సుబ్బు అనే డెబ్యూ డైరెక్టర్‌ రూపొందించిన ఈ సినిమా ఈ ఏడాది మే 1నే విడుదల కావాల్సింది. కానీ.. కరోనా ప్రభావంతో విడుదల కాకుండా ఆగింది. ఇక  ఈ సినిమా ఓటీటీలోనే విడుదలవుతుందని అందరూ అనుకుంటున్న సమయంలో థియేటర్స్‌ ఓపెన్‌ చేయడంతో నిర్మాతలు సినిమాను థియేటర్స్‌లో విడుదల చేశారు. అసలు సోలో బ్రతుకే సో బెటర్‌ సినిమాతో సాయితేజ్‌ ఏం చెప్పాలనుకున్నాడు. పెళ్లి వద్దని టీజర్‌, ట్రైలర్స్‌లో చెప్పిన తేజ్‌.. సినిమాలో ఏం చెప్పాడు? అనే విషయం తెలుసుకోవాలంటే కథలోకి వెళదాం...

కథ:

విరాట్‌(సాయితేజ్‌) వైజాగ్‌లో ఇంజనీరింగ్‌ చదివే కుర్రాడు. ఆ సమయంలో పెళ్లి వల్ల మగవాళ్లు వాళ్ల స్వేచ్ఛను కోల్పోతున్నారని గట్టిగా నమ్ముతాడు. అతని ఆ నమ్మకం అతని మావయ్య(రావు రమేశ్‌) వల్ల క్రియేట్‌ అవుతుంది. ఆ ఆలోచన పెరిగి పెద్దదై పెళ్లికి వ్యతిరేకంగా ఓ గ్రూపును స్టార్ట్‌ చేయడంతో పాటు.. ఏకంగా పెళ్లి వల్ల కోల్పోయే స్వేచ్ఛ గురించి 108 శ్లోకాలతో ఓ పుస్తకం రాసేస్తాడు. అదే సమయంలో విరాట్‌కి పెళ్లి గొప్పతనం తెలుస్తుంది. సోలో బ్రతుకు .. సో బెటర్‌ కాదని, సోల్‌ లేని బ్రతుకు అనే విషయాలు తెలుస్తాయి. అప్పుడు పెళ్లి చేసుకోవాలని అనుకుంటాడు. అప్పుడు విరాట్‌ను అమృత(నభా నటేశ్‌) పెళ్లి చేసుకుంటానని తనకు జరుగుతున్న పెళ్లిని ఆపేస్తుంది. అసలు నిజంగానే అమృత, విరాట్‌ను పెళ్లి చేసుకుంటుందా? పెళ్లిని ఆపేయడం వెనుక అమృత ఆలోచన ఏంటి?  అనే విషయాలు తెలుసుకోవాలంటే సినిమా కథలోకి వెళదాం...

సమీక్ష:

విరాట్‌ అనే యువకుడు పెళ్లి గురించి వ్యతిరేకత పెంచుకున్న కుర్రాడు. ఓకే దర్శకుడు చెప్పాలనుకున్న విషయం.. టైటిల్‌లోనే చెప్పేశాడు. మరి అసలు మావయ్య తనకు జీవితంలో భార్యతో గొడవపడే చిన్న చిన్న గొడవలనుబేస్‌ చేసుకుని చెప్పే విషయాలతో హీరో అలా మారిపోతాడా? తనేం చిన్న పిల్లాడు కాదు. ఇంజనీరింగ్‌ చదివే కుర్రాడు... ఒకసారిగా పెళ్లిపై అంత వయొలెంట్‌గా ఎందుకు మారిపోతాడు? అనే విషయాలపై బలమైన పాయింట్స్‌ను సుబ్బు చూపించలేకపోయాడు. అలాగే సినిమాలో అటు హీరోకి తన తల్లిదండ్రులతో ఉన్నఎమోషన్స్‌ను బలంగా చూపించలేదు. హీరో క్యారెక్టరైజజేషన్, అతను పెళ్లి వద్దంటూ స్నేహితులతో గొడవలు పడే సందర్భాలు అన్నింటితో ఇంటర్వెల్‌ వరకు సినిమా నడిచిపోతుంది. మధ్యలో దిరనన. .. అంటూ సత్య చేసే కామెడీ. తుంబ కష్టం అంటూ వెన్నెల కిషోర్‌ కన్నడ కామెడీ జస్ట్‌ ఓకే.. హీరోయిన్‌ నభా పాత్ర ఎంట్రీ ఇంటర్వెల్‌ నుండే ఉంటుంది. ఆమె హీరో వదిలేసిన సోలో బ్రతుకు ఆశయాలను కాలేజ్‌లో క్యారీ చేస్తుంటుంది. సెకండాఫ్‌లో పెళ్లి గురించి మంచి అభిప్రాయం ఏర్పరుచుకున్న హీరో .. పెళ్లి చేసుకోవాలని హీరోయిన్‌కు దగ్గరయ్యే సన్నివేశాలు అన్నీ ఇది వరకు చాలా సినిమాల్లో చూసినవే. ఫస్టాఫ్‌లో హీరో క్యారెక్టర్‌ను పెళ్లికి వ్యతిరేకంగా చూపిన దర్శకుడు .. సెకండాఫ్‌లో హీరోయిన్‌కు ఆపాదించి సినిమాను నడిపించాడు. హీరో ఆమెను లవ్‌లో దింపే ప్రయత్నాల్లో ఎంత వరకు సక్సెస్‌ అవుతాడు అని అందరూ అనుకుంటున్న తరుణంలో క్లైమాక్స్‌లో ఓ చిన్న ఫైట్‌.. హీరోయిన్‌ తండ్రి ఆమెకు చెప్పే ఓ చిన్నమాటతో అప్పటి వరకు గొప్ప ఉద్యమం చేసిన హీరోయిన్‌ మారిపోతుంది. అదేంటో అర్థం కాదు.. అంటే అప్పటి వరకు దర్శకుడు అనుకున్న బలమైన పాయింట్‌ కాస్త బేస్‌ లెస్ అయిపోతుంది. ఇలాంటి పాయింట్‌ను హైలెట్‌ చేస్తూ సినిమా ఎందుకు తీశారా? అని సగటు ప్రేక్షకుడికి అనిపించకమానదు. తమన్‌ పాటలు వినడానికి బావున్నాయి. అయితే కథలోని బలవంతంగా చొప్పించినట్లుగా ఉన్నాయి. వెంకట్‌ సి.దిలీప్‌ సినిమాటోగ్రఫీ బావుంది. ఇక వెన్నెల కిషోర్‌ కామెడీ ఒకట్రెండు సందర్భాల్లో తప్ప... ఇక నవ్వించదు. బలమైన ఎమోషన్స్‌, కామెడీ లేకపోవడం సినిమాకు మైనస్‌. రావు రమేశ్‌ క్యారెక్టర్‌ను హీరోకి పెళ్లిపై చెడు అభిప్రాయం కలగడానికి, దాన్ని మార్చడానికి ఉపయోగించుకున్నట్లే ఉంది. ఇక రాజేంద్రప్రసాద్‌, వీకే నరేశ్‌ పాత్రలను... అంత సీనియర్‌ యాక్టర్స్ పాత్రలకు స్కోప్‌ లేకుండా పోయింది. కరోనా ప్రభావం తర్వాత విడుదలవుతున్న స్టార్‌ సినిమా కాబట్టి చూడాలనుకుంటే తప్ప.. అంత ప్రాధాన్యతతో సినిమాను చూడాల్సిన అవసరం లేదు.

చివరగా.. సోలో బ్రతుకే సో బెటర్‌.. తుంబ కష్టం

Read 'Solo Brathuke So Better' Review in English

Rating : 2.0 / 5.0