CM Jagan:సీఎం జగన్ అధ్యక్షతన సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ మీట్.. ఎప్పుడంటే..?
- IndiaGlitz, [Monday,April 22 2024]
ప్రస్తుత డిజిటల్ కాలంలో సోషల్ మీడియాకు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ఏ విషయాన్ని అయినా క్షణాల్లో వైరల్ చేసే సత్తా సోషల్ మీడియాకు ఉంది. దేశ రాజకీయాలనే మార్చగలిగే సత్తా దీనికి ఉందనడంలో ఎలాంటి సందేహం లేదు. అంతెందుకు సోషల్ మీడియా వాడని వారు లేరంటే అతిశయోక్తి కాదు. 60 ఏళ్లు పైబడిన ముసలోళ్లు నుంచి 20 ఏళ్లు దాటిన కుర్రాళ్లు దాకా సోషల్ మీడియాలను వినియోగిస్తున్నారు. కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్స్లుగా రాణిస్తున్నారు. తమకు నచ్చిన అంశంపై ప్రజలకు అర్థమయ్యేలా క్షుణ్ణంగా వివరిస్తూ పాపులారిటీ దక్కించకుంటున్నారు.
అందుకే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ అనే పదం ఇప్పుడు ఓ సెన్షేషన్. సమాచార విప్లవం సరికొత్త పుంతలు తొక్కిన ఈ రోజుల్లో న్యూస్ పేపర్లు, టీవీ ఛానళ్లను మించి ప్రత్యేక ఉనికిని చాటుకుంటున్న వాళ్లే ఈ ఇన్ఫ్లుయెన్సర్స్. వీరు ఎలాంటి అంశాన్నైనా అందరికీ అర్థమయ్యేలా సమాచారం ఇస్తారు. దీంతో ఇంటర్నెట్ యూజర్లు వీరికి ఇట్టే అభిమానులుగా మారిపోతున్నారు. సోషల్ మీడియాలో వీరి ఫాలోయింగ్ మామూలుగా ఉండదు. వాళ్లు పెట్టే వీడియోలు పెద్ద చర్చనీయాంశమవుతాయి కూడా.
దీంతో సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ ఇప్పుడు అన్ని వర్గాలను ప్రభావితం చేయగలుగుతున్నారు. అందుకే వీళ్లు ఇప్పుడు రాజకీయాలపైనా ప్రభావితం చూపుతున్నారు. ఇన్ఫ్లుయెన్సర్స్ పార్టీలకు సంబంధించి ప్రచారం చేస్తే పరిస్థితులు తమకు అనుకూలంగా ఉంటాయన్న ప్రచారం జోరుగా ఉంది. ఇందులో భాగంగానే ఏపీలోని అధికార వైయస్ఆర్‌సీపీ కూడా ఇన్ఫ్లుయెన్సర్స్‌తో ప్రచారానికి సిద్ధమైంది. ఈ క్రమంలోనే ఈనెల 23న భీమిలిలో ఇన్ఫ్లుయెన్సర్స్‌తో సీఎం జగన్ సమావేశం నిర్వహిస్తున్నారు. ఈ సమావేశానికి రాష్ట్ర నలుమూలల నుంచే కాకుండా ఇతర ప్రాంతాల నుంచి కూడా వైయస్ఆర్‌సీపీకి అనుబంధంగా పనిచేస్తున్నవారు హాజరుకానున్నారు.
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి సోషల్ మీడియా కార్యకర్తలు, సమాజాన్ని ప్రభావితం చేయగలిగే ఇన్ఫ్లుయెన్సర్స్‌ను ఉద్దేశించి ప్రసంగిస్తారు. పోలింగ్ సమీపిస్తున్న తరుణంలో రానున్న ఈ కొద్దిరోజులు పార్టీకి ఎంతో విలువైనది. ఈ కాలాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకుని పార్టీని బలోపేతం చేయడంతో పాటు తమ పాలనలో సాధించిన విజయాలు.. ప్రజలకు దక్కిన సంక్షేమం, లభించిన రాజకీయ, సామాజిక ప్రాధాన్యం లాంటి అంశాలను మరింతగా ప్రజల్లోకి తీసుకెళ్లడానికి ఎలా కృషి చేయాలన్నది దిశానిర్దేశం చేస్తారు.
అలాగే టీడీపీ, దాని అనుబంధ మీడియా చేస్తున్న దుష్ప్రచారాన్ని తిప్పికొట్టడం, ప్రభుత్వం నుంచి జరిగిన మంచిని మరింతగా ప్రజల్లోకి తీసుకెళ్లే అంశం మీద ఐక్యంగా నిర్ణయం తీసుకునేందుకు ఈ సమావేశం ఒక గొప్ప వేదిక కానుంది. కాగా ప్రస్తుతం భీమిలిలో ఏర్పాటుకానున్న ఇన్ఫ్లుయెన్సర్స్ మీట్ రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది