Download App

Snehamera Jeevitham Review

ఆర్య స‌హా పలు చిత్రాల్లో కీల‌క పాత్ర‌లు, హీరో త‌మ్మ‌డు పాత్ర‌ల్లో న‌టిస్తూ వ‌చ్చిన శివ బాలాజీ నిజానికి హీరోగా తెలుగులోకి ఎంట్రీ ఇచ్చాడు. మ‌ధ్య క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్‌గా అవ‌తారం ఎత్తాడు. బిగ్‌బాస్ రియాల్టీ షో విన్న‌ర్‌గా శివ బాలాజీకి చాలా మంచి పేరు వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. దాని తర్వాత  శివ‌బాలాజీ హీరోగా, నిర్మాత‌గా చేసిన చిత్రం `స్నేహ‌మేరా జీవితం`.  1980 బ్యాక్‌డ్రాప్‌లో సినిమా తెర‌కెక్కింది. అస‌లు ఈ సినిమా ద్వారా శివ బాలాజీ స్నేహంలోని కొత్త కోణాన్ని ఏమైనా ట‌చ్ చేశాడా?  లేదా ? అని తెలుసుకోవాలంటే సినిమా క‌థేంటో చూద్దాం.

క‌థ:

మోహ‌న్‌(శివ బాలాజీ), చ‌ల‌ప‌తి(రాజీవ్ క‌న‌కాల‌) మంచి స్నేహితులు. చిన్న‌ప్ప‌ట్నుంచి క‌లిసే పెరుగుతారు. మోహ‌న్ అంటే చ‌ల‌ప‌తి చాలా ప్రేమ‌గా ఉంటాడు. త‌న‌ను ఎవ‌రేమ‌న్నా ఊరుకోడు. మోహ‌న్..ఇందిర(స్వ‌ర్ణ‌)ను ప్రేమిస్తాడు కానీ త‌న ప్రేమ‌ను ఆమెకు ఎప్ప‌టికీ చెప్ప‌డు. స్నేహితుడి ప్రేమ గురించి తెలుసుకున్న చ‌ల‌ప‌తి అత‌నికి స్నేహం చేయాల‌నుకుంటాడు. కానీ ఓ సంద‌ర్భంలో చ‌ల‌ప‌తి, ఇందిర‌లు సన్నిహితంగా ఉండ‌టం చూసిన మోహ‌న్ బాధ‌తో ఊరు విడిచి పెట్టి ప‌క్క ఊరెళ్లిపోతాడు. అక్క‌డ ఓ ప్రేమ జంట‌కు సాయం చేయాల‌నుకుంటాడు. ఆ క్ర‌మంలో త‌ను ఓ స‌మ‌స్య‌లో ఇరుక్కుపోతాడు. అస‌లు ఆ స‌మ‌స్యేంటి?  మోహ‌న్ ఆ స‌మ‌స్య నుండి ఎలా బ‌య‌ట‌ప‌డ్డాడు?   చివ‌రికి చల‌ప‌తి, మోహ‌న్‌లు క‌లుసుకున్నారా? అనే సంగ‌తి తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే.

స‌మీక్ష:

శివ బాలాజీ, రాజీవ్ క‌న‌కాల పాత్ర‌ల పరంగా ఇద్ద‌రూ చ‌క్క‌గా న‌టించారు. సునీల్ క‌శ్య‌ప్ నేప‌థ్య సంగీతం బావుంది. ట్యూన్స్ పెద్ద ఎఫెక్టివ్‌గా, ఆక‌ట్టుకునేలా లేవు. అలాగే స‌త్య కామెడీ ప్రేక్ష‌కుల‌ను కాస్త న‌వ్విస్తుంది. రాజీవ్ క‌న‌కాల పాత్ర చిత్రీక‌ర‌ణ, డైలాగులు కూడా ప్రేక్ష‌కుల‌కు న‌చ్చుతాయి. అయితే శివ బాలాజీ, రాజీవ్ క‌న‌కాల పాత్రల మ‌ధ్య ఎమోష‌న్స్ అంత బ‌లంగా క‌న‌ప‌డ‌వు. దానికి త‌గిన‌ట్లు ద‌ర్శ‌కుడు మ‌హేష్ స‌న్నివేశాల‌ను రాసుకోలేదు. ఫ‌స్టాఫ్ అంతా పాత్ర‌ల ప‌రిచ‌యంతోనే స‌రిపోతుంది. అస‌లు క‌థ‌లోకి సినిమా వెళ్ల‌డానికి చాలా స‌మ‌యం తీసుకున్నాడు ద‌ర్శ‌కుడు మ‌హేష్‌.  ప్రేమ జంట‌ను క‌ల‌ప‌డానికి శివ బాలాజీ చేసే ప్ర‌య‌త్నాలు చూసి అంత అవ‌స‌రమా అనిపిస్తుంది కూడా. సినిమాటోగ్రాప‌ర్ భ‌ర‌ణి కె.ధ‌ర‌ణ్ సినిమాను చ‌క్క‌గా తెర‌కెక్కించాడు. ద‌ర్శ‌కుడు మ‌హేష్ సినిమాలో చెప్పాల‌నుకున్న విష‌యాన్ని బ‌ల‌మైన ఎమోష‌న్స్‌తో చెప్పుంటే క‌నెక్టివిటీ బావుండేద‌నిపించింది. ఎడిటింగ్ బావుంది. నిర్మాణ విలువలు బావ‌న్నాయి.

బాట‌మ్ లైన్: స్నేహ‌మేరా జీవితం..పాత క‌థ‌తోనే

Rating : 2.0 / 5.0