Small Parties:పోటీకి దూరంగా చిన్న పార్టీలు.. ఎవరికి ప్లస్.. ఎవరికి మైనస్..?
Send us your feedback to audioarticles@vaarta.com
తెలంగాణ ఎన్నికల్లో రోజురోజుకు అనూహ్య మార్పులు చోటుచేసుకున్నాయి. పోలింగ్ తేదీ దగ్గరపడుతున్న కొద్దీ వరుసగా చిన్న పార్టీలు పోటీ నుంచి తప్పుకుంటున్నాయి. మొన్న టీడీపీ, టీజేఎస్, తాజాగా వైసీటీపీ పోటీకి దూరంగా ఉంటున్నట్లు ప్రకటించాయి. అయితే ఇందులో టీజేఎస్, వైసీటీపీ కాంగ్రెస్‌కు మద్దతు తెలడం గమనార్హం. కాంగ్రెస్‌తో కమ్యూనిస్టులు కలిసి పోటీ చేస్తుండగా.. బీజేపీతో జనసేన పొత్తు కుదుర్చుకుంది. ఇక అధికార బీఆర్ఎస్ మాత్రం ఒంటరిగా బరిలో దిగింది. దీంతో తెలంగాణ ఎన్నికలు రసవత్తరంగా మారాయి.
కాంగ్రెస్‌కు షర్మిల మద్దతు..
సీఎం కేసీఆర్‌ను ఓడిస్తానని.. తెలంగాణలో రాజన్న రాజ్యం తెస్తానని చెబుతూ 3,800 కిలోమీటర్ల సుదీర్ఘ పాదయాత్ర చేసిన వైఎస్ షర్మిల..అనూహ్యంగా పోటీ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. కాంగ్రెస్‌లో విలీనం కోసం ప్రయత్నించి విఫలమైన షర్మిల.. ఒంటరిగా పోటీ చేసేందుకు సిద్ధమయ్యారు. తన పార్టీ విలీనాన్ని అడ్డుకున్న రేవంత్ రెడ్డిపై పోటీకి కూడా సిద్ధమైనట్లు వార్తలు వచ్చాయి. ఇంతలో ఏమైందో ఏమో తెలియదు గానీ కాంగ్రెస్‌కు మద్దతు ప్రకటిస్తూ ఎన్నికల బరిలో నుంచి తప్పుకున్నారు. తాను పోటీ చేస్తే ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలి బీఆర్ఎస్ పార్టీకి లాభం చేకూరుస్తుందని చెబుతూ కాంగ్రెస్ పార్టీ అడగకపోయినా ఆమె మద్దతు తెలపడం సంచలనంగా మారింది.
కాంగ్రెస్ వైపు టీడీపీ మద్దతుదారులు..
ఇక నాలుగు దశాబ్దాల అనుభవం ఉన్న తెలుగుదేశం పార్టీ కూడా తెలంగాణ ఎన్నికల్లో పోటీ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించింది. ఆ పార్టీ అధినేత చంద్రబాబు అరెస్ట్ కావడం, ఆయనపై నమోదవుతున్న వరుస కేసులు, అనారోగ్యం వంటి కారణాల నేపథ్యంలో ఈ ఎన్నికలపై దృష్టి పెట్టలేమని చెబుతూ దూరం జరిగింది. దీంతో కాంగ్రెస్ పార్టీకి మేలు జరుగుతుందన్న అభిప్రాయం సర్వత్రా వినిపిస్తోంది. బాబు అరెస్ట్ పరిణామాల వెనక కేంద్రంలోని బీజేపీ, రాష్ట్రంలోని బీఆర్ఎస్‌కు టీడీపీ సానుభూతిపరులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. దాంతో వారంతా కాంగ్రెస్‌కు అనుకూలంగా ఓటు వేసేందుకు సిద్ధమైనట్లు చెబుతున్నారు.
టీజేఎస్, కమ్యూనిస్టులు కూడా..
మరోవైపు తెలంగాణ ఉద్యమం సమయంలో జేఏసీ చైర్మన్‌గా ఉండి.. ఉద్యమాన్ని ముందుండి నడిపించిన ప్రొఫెసర్ కోదండరాంకు ప్రత్యేక రాష్ట్రం వచ్చిన తర్వాత సీఎం కేసీఆర్‌తో భేదాభిప్రాయాలు తలెత్తాయి. దీంతో ఆయన ప్రభుత్వ విధానాలతో వ్యతిరేకించే తోటి ఉద్యమకారులతో కలిసి తెలంగాణ జన సమితి పార్టీ పెట్టారు. 2018 ఎన్నికల్లో మహా కూటమిలో భాగంగా మూడు సీట్లలో పోటీ చేసి ఓడిపోయారు. ఈసారి మాత్రం పోటీకి దూరమైన కోదండరాం.. కాంగ్రెస్ పార్టీకి పూర్తి మద్దతు తెలిపారు. ఇక కమ్యూనిస్టులు కూడా కాంగ్రెస్‌తో పొత్తు కుదుర్చుకున్నారు.
మళ్లీ తెరపైకి తెలంగాణ సెంటిమెంట్..
మొత్తమ్మీద అన్ని రాజకీయ పార్టీలు కాంగ్రెస్ పార్టీ వైపే నిలబడ్డాయి. ఈసారి ఎలాగైనా బీఆర్‌ఎస్ పార్టీని ఓడించి కేసీఆర్‌ను గద్దె దించాలని కృతనిశ్చయంతో ఉన్నాయి. అయితే బీఆర్ఎస్ మాత్రం తెలంగాణ ద్రోహులతో కాంగ్రెస్, బీజేపీ కలిసి మళ్లీ ఎన్నికలకు వస్తున్నాయని సెంటిమెంట్ అస్త్రాన్ని ప్రయోగిస్తుంది. కాంగ్రెస్‌కు మద్దతు తెలిపిన షర్మిల, బీజేపీకి సపోర్ట్ చేస్తున్న పవన్ కల్యాణ్ , కాంగ్రెస్‌కు బయటి నుంచి మద్దతు ఇస్తున్న చంద్రబాబు.. వీరంతా తెలంగాణ వ్యతిరేకులని ప్రజల్లోకి తీసుకువెళ్తున్నారు గులాబీ నేతలు. బీర్ఎస్ నేతల విమర్శలను విపక్షాలు తీవ్రంగా తిప్పికొడుతున్నాయి. జాతీయ పార్టీ అంటూ పేరులోనే తెలంగాణను తీసివేసి భారత్ రాష్ట్ర సమితి అని పేరు పెట్టుకున్న గులాబీ నేతలు.. చివరకు గెలవలేమని మళ్లీ తెలంగాణ సెంటిమెంట్‌ను ప్రయోగిస్తున్నారని మండిపడుతున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments