Chandrababu:సుప్రీంకోర్టులో చంద్రబాబుకు స్వల్ప ఊరట.. బెయిల్ రద్దు విచారణ వాయిదా..
- IndiaGlitz, [Tuesday,March 19 2024]
ఎన్నికల వేళ టీడీపీ అధినేత చంద్రబాబుకు సుప్రీంకోర్టులో స్వల్ప ఊరట లభించింది. స్కిల్ డెవలెప్‌మెంట్ కేసులో ఏపీ హైకోర్టు ఇచ్చిన బెయిల్‌ను రద్దు చేయాలంటూ సీఐడీ వేసిన పిటిషన్‌పై విచారణ జరిగింది. విచారణ సందర్భంగా చంద్రబాబును అరెస్ట్ చేసిన అధికారుల పేర్లు రెడ్ బుక్‌లో ఉన్నాయని.. తాము అధికారంలోకి వచ్చాక వారిపై చర్యలు తీసుకుంటామని బెదిరిస్తున్నారని సీఐడీ తరపు న్యాయవాది రోహత్గీ వాదించారు.
నిందితుడి కుటుంబ సభ్యులు అధికారులతో పాటు దర్యాప్తు సంస్థను బెదిరింపులకు గురి చేస్తున్నారని.. అందుచేత వెంటనే బెయిల్ రద్దు చేయాలని విజ్ఞప్తి చేశారు. అయితే ప్రభుత్వం తరపున వాదనలకు తాము సమాధానం ఇస్తామని చంద్రబాబు తరపు న్యాయవాదులు తెలిపారు. దీంతో రెండు వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని ధర్మాసనం ఆదేశిస్తూ పూర్తి స్థాయి విచారణను ఏప్రిల్ 16న చేపడతామని తెలిపింది.
కాగా స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో చంద్రబాబును సీఐడీ అధికారులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. దాదాపు 53 రోజుల పాటు ఆయన రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఆయన అనారోగ్యానికి గురికావడంతో ఏపీ హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. అనంతరం దానిని రెగ్యులర్ బెయిల్‌గా మార్చింది. దీంతో హైకోర్టు తీర్పును సీఐడీ సుప్రీంకోర్టులో సవాల్ చేసింది.
బెయిల్ మంజూరులో తమ వాదనలు, ఆధారాలను హైకోర్టు పరిగణనలోకి తీసుకోలేదని పిటిషన్‌లో పేర్కొంది. ఈ పిటిషన్‌పై ఇప్పటికే పలు మార్లు విచారణ రాగా వాయిదా పడుతూ వస్తోంది. తాజాగా పూర్తి స్థాయి వాదనలు ఏప్రిల్ 16న వింటామని జస్టిస్ బేలా త్రివేది, జస్టిస్ పంకజ్ మిట్టల్ ధర్మాసనం మరోసారి వాయిదా వేసింది. విచారణ వాయిదా పడటంతో అప్పటివరకు చంద్రబాబు ఎన్నికల ప్రచారానికి ఎలాంటి ఢోకా లేకుండా పోయింది.