ప్రతి ఒక్కరూ అప్రిషియేట్ చేయడం చాలా ఆనందంగా వుంది - శివప్రసాద్
Send us your feedback to audioarticles@vaarta.com
మూడు దశాబ్దాలుకు పైగా సినీ, రాజకీయ రంగంలో సక్సెస్‌ఫుల్‌గా ముందుకు దూసుకెళ్తున్నారు డా. శివప్రసాద్. డాక్టర్‌గా, యాక్టర్‌గా, రాజకీయ నాయకుడిగా అన్నీ రంగాల్లో తనదైన ప్రతిభ ప్రదర్శిస్తూ... కమెడియన్‌గా, విలన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా శివప్రసాద్ ఎంతో పేరు తెచ్చుకుని ప్రేక్షకుల రివార్డులు, ప్రభుత్వ అవార్డులు ఎన్నో సంపాదించుకున్నారు.
రీసెంట్‌గా 'సప్తగిరి ఎల్.ఎల్.బి' చిత్రంలో జడ్జి క్యారెక్టర్‌లో తన నట విశ్వరూపాన్ని చూపించారు. ఇటీవల విడుదలైన ఈ చిత్రం సూపర్‌హిట్ టాక్‌తో దిగ్విజయంగా రెండోవారంలోకి ఎంటర్ అయ్యింది. కామెడీ కింగ్ సప్తగిరి హీరోగా, కశిష్ వోరా హీరోయిన్‌గా సాయి సెల్యులాయిడ్ సినిమాటిక్ క్రియేషన్స్ ప్రై.లి. పతాకంపై చరణ్ లక్కాకుల దర్శకత్వంలో డా. రవికిరణ్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రం సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతున్న నేపథ్యంలో ప్రముఖ నటుడు, ఎం.పి. డా. శివప్రసాద్ పాత్రికేయులతో ముచ్చటించారు. ఆ విశేషాలు...
మాది చిత్తూరు జిల్లాలోని చంద్రగిరి ప్రక్కన పురిత్తివారిపల్లి. ఓ మారుమూల గ్రామం. పక్కా పల్లెటూరు. చుట్టూ పంట పొలాలు మధ్యలో మా ఊరు ఉంటుంది. ప్రొద్దునే లేవగానే పొలంలో నారు నాటుతూ, నేతం వేసి నీళ్ళు తోడుతూ పాటలు పాడేవారు. సాయంత్రం కోలాటారు, చెక్క భజనలు వేసేవారు. అవన్నీ చూస్తూ పెరిగాను. ఆ సౌండింగ్ అంతా నా మైండ్‌లో పడింది. ఫస్ట్ ఒకసారి వీధి నాటకాలు వేస్తుంటే అందులో నేను పార్టిసిపేట్ చేయడం జరిగింది. హైస్కూల్‌లో ఓ మాస్టారు సంగీతం, డ్రామాలు డైరెక్ట్ చేసేవారు. ఆరో తరగతి నుండి మాకు అవకాశాలు వచ్చాయి.
నేను బాగా పాడేవాడ్ని. యాక్ట్ చేసేవాడ్ని. ఫ్యాన్సీ డ్రెస్సులు వేసి స్టైల్‌గా వుండేవాడ్ని. అన్నింట్లో ముందుండేవాడ్ని. ఆరవ తరగతి నుండి పదవ తరగతి వరకు చంద్రబాబునాయుడు, నేను ఇద్దరం క్లాస్‌మేట్స్. మేం ఇద్దరం కలిసి 'పరువుకోసం' అనే ఒక నాటిక వేసాం. అందులో చంద్రబాబు హీరో. నేను కమెడియన్‌గా చేశాం. హైస్కూల్ తర్వాత నేను మెడిసిన్‌లోకి వెళ్ళాను. ఆ కాలంలో మెడిసిన్ సబ్జెక్ట్‌లు చాలా స్ట్రిక్ట్‌గా వుండేవి.
ప్రొఫెసర్స్ అందరూ ఆర్ట్ గురించి ఇంట్రెస్ట్‌గా వుండేవారు. అందులో నన్ను ...... చేశారు. ప్రాక్టీస్ అప్పుడే డైలాగ్స్ చెప్పించుకుని బాగా ఎంకరేజ్ చేసేవారు. చిన్నప్పటి నుండి మెడిసిన్ వరకు కల్చరల్ యాక్టివిటీస్‌లో మమేకమై వున్నాను. మెడిసిన్‌లో వుండగానే మ్యారేజ్ అయ్యింది. నా మిసెస్ కూడా డాక్టర్. మేం ఇద్దరం ప్రాక్టీస్ పెట్టాక సి.ఎం. కృష్ణ, ఎడిటర్ మోహన్ వచ్చి డ్రామాలు డైరెక్షన్ చెయ్యాలి అని అడిగారు.
ఆ టైమ్‌లో నేను కాలేజ్‌లో జాబ్ చేస్తూ, కల్చరల్ ప్రోగ్రాంస్‌కి నన్నే డైరెక్టర్‌గా అప్పాయింట్ చేశారు. కాలేజ్‌లో కొన్ని గ్రూప్స్ తయారు చేసి స్టేట్ అంతా తిరిగాం. అవి జరుగుతున్న టైమ్‌లో మధ్యాహ్నం నేను ఇంట్లో వున్నప్పుడు ఒకతను వచ్చి తలుపు తట్టాడు. తలుపు తీయగానే ఎదురుగా ఒక వ్యక్తి వున్నాడు. ఐ యామ్ భారతీరాజా. ఐ వాంట్ టూ స్పీక్ డా. శివప్రసాద్ అన్నాడు.
తమిళ్‌లో భారతీరాజా అప్పటికే చాలా పెద్ద ఫేమస్ డైరెక్టర్. మేం ఇద్దరం కలిసి ఒక హోటల్‌లో కూర్చుని మాట్లాడుకున్నాం. ఆయన ఒక కొత్త హీరోయిన్‌ని పెట్టి తెలుగులో సినిమా తీస్తున్నారు. ప్రతిసారి ఒక కొత్త హీరోయిన్‌ని పరిచయం చేస్తున్నాను. ఈసారి తెలుగులో చెయ్యాలి. తెలుగులో అమ్మాయిని ఇంట్రడ్యూస్ చెయ్యాలనుకుంటున్నాను అన్నారు. మీ దగ్గర కాలేజెస్, యూనివర్శిటీస్ ఎక్కువగా వున్నాయి కాబట్టి వచ్చాను అన్నారు ఆయన. నా గురించి ఎవరో చెబితే అలా నా దగ్గరకి వచ్చారు. ఆ రోజుల్లో అమ్మాయిలు ఒప్పుకున్నా పేరెంట్స్ ఒప్పుకోకపోవడం, పేరెంట్స్ ఒప్పుకుంటే అమ్మాయిలు ఒప్పుకునేవారు కాదు.
ఆయనకి ఎవరూ దొరకపోవడంతో ఆ సినిమాకి సుహాసిని హీరోయిన్‌గా తీసుకున్నారు. 'పుదై వాళ్‌కైగళ్' తమిళ్‌లో, తెలుగులో కొత్త జీవితాలుతో చేశారు. అది నా ఫస్ట్ ఫిలిం. నూతనప్రసాద్‌గారి కాంబినేషన్‌లో ఆ సినిమా చేశాను. అప్పటికే నేను డాక్టర్‌గా, నా మిసెస్ గైకాలజిస్ట్‌గా చాలా ఫేమస్‌గా వున్నాం. తమిళంలో షూటింగ్ వాతావరణం చూసి భయపడిపోయి సినిమాలు ఇంక మనకి వద్దు అనుకున్నాను. నూతనప్రసాద్‌గారు 'ఓ అమ్మ కథ' సినిమా తీస్తున్నారు. ఇదొక్కటి చేసి మానెయ్యండి అన్నారు. సరేనని ఆ సినిమా చేశాను. అది ఫినిష్ అవగానే మా సీనియర్ డాక్టర్ తిరుపతిరెడ్డి వచ్చి నేను 'భైరి' అనే సినిమా చిరంజీవితో తీస్తున్నాను.
ఆ సినిమా ఒక్కటి చేసి మానేయ్ అన్నాడాయన. ఆ సినిమా చేసిన రెండు రోజుల్లో నాకు 17 సినిమాలు ఆఫర్స్ వచ్చాయి. మా ఇంట్లో ఘర్షణ స్టార్ట్ అయ్యింది. సినిమాలు వద్దు అంటున్నారు. ఒకరోజు మా కాలేజ్‌కి వెళ్ళాం. అక్కడ జాబ్ చేస్తున్నాను. ప్రిన్సిపాల్‌ని కలిసి 17 సినిమాలు ఆఫర్ వచ్చాయి సార్ చేయమంటారా? వద్దంటారా! మీ ఇష్టం సార్. ఒక సలహా చెప్పండి అని అడిగాను. ఆయన వెంటనే ఒప్పుకున్నారు. సినిమాల్లో వేషం వచ్చేది చాలా కష్టం. అలాంటిది నువ్ ప్రయత్నం చేయకుండానే నీకు అదృష్టం కలిసొచ్చింది. సినిమాలు చేయి అన్నారు. వారి సహకారంతో ఐదు సంవత్సరాల్లో 56 సినిమాలు చేశాను.
ఎందుకో కామెడీకి ప్రాధాన్యత వుండేది కాదు. 'ఖైది'లో కోదండ రామిరెడ్డిగారు నాకు, సుత్తివేలుకి ఫ్రీడం ఇచ్చారు. సీన్లు చెప్పి కంటెంట్ ఇది. మీరు ఏమి డెవలప్ చేసుకుని చేస్తారో చెయ్యండి అన్నారు. పాటలు, కామెడీ బిట్స్ మేం ఓన్‌గా చెప్పాం. అవన్నీ బాగా సక్సెస్ అయ్యాయి. తర్వాత కొంతమంది కామెడీని పెద్దగా ఉపయోగించుకునేవారు కాదు. పది సినిమాలు చేస్తే అందులో రెండు సక్సెస్ అయ్యేవి. నాకు శాటిస్‌ఫ్యాక్షన్ అయ్యేది కాదు. ఉన్న సినిమాలు కంప్లీట్ చేసి సినిమాలు మానేశాను. మళ్ళీ నా జాబ్‌లో నేను చేరిపోయాను.
బేసిగ్గా ఆర్టిస్ట్‌ను కాబట్టి ఇంట్లో ఖాళీగా కూర్చోలేకపోయేవాడ్ని. ప్రతి సంవత్సరానికి రెండు సినిమాలు డైరెక్ట్ చెయ్యాలి అని డిసైడ్ అయ్యాను. 1991లో 'ప్రేమతపస్సు' సినిమా స్టార్ట్ చేశాం. ఒక కొత్త అమ్మాయిని ఇంట్రడ్యూస్ చెయ్యాలని చాలా చోట్ల ఆరు నెలల పాటు తిరిగాం. ఫైనల్‌గా శ్రీలత అనే అమ్మాయిని రోజాగా మార్చి ఆ చిత్రంతో ఇంట్రడ్యూస్ చేశాం. రోజాకి ట్రైనింగ్ ఇచ్చి అన్నీ పర్‌ఫెక్ట్‌గా నేర్పించాం. నిర్మాత పోకూరి బాబూరావుని విలన్‌గా పరిచయం చేశాం.
ఒక బాధ్యత తీసుకుని రోజాని హీరోయిన్‌గా అందరికీ చూపించాం. రామానాయుడుగారు నాకు ఫోన్ చేశారు. గోపాలకృష్ణ చూస్తాడు.. ఒకసారి హీరోయిన్ సాంగ్స్, సీన్స్ చూపించమని అన్నారు. నేను ఆటోలో కాన్లు పెట్టుకుని స్వయంగా వెళ్లి చూపించాను. గోపాలకృష్ణగారు చూసి ఒక సినిమాలో రోజాని హీరోయన్‌గా బుక్ చేశారు. మా అల్లుడు వేణు నా దగ్గర వుండేవాడు. సెల్వమణి వచ్చి మా వేణుని కలిసి సాంగ్స్, సీన్స్ చూశాడు. రెండు ప్రాజెక్ట్‌లు వచ్చాయి. జాగ్రత్తగా నువ్ చేసుకో అని రోజాకి చెప్పాను. ఆరు నెలలు స్క్రిప్ట్ చేసుకుని, ఆరు నెలలు సినిమా చేసుకుంటూ వుండిపోయాను.
మళ్ళీ 1993లో 'కొక్కొరకో' అనే ఒక సినిమా చేశాను. 1995లో 'టోపీ రాజా స్వీటీ రోజా' 1997లో 'ఇల్లాలు' సినిమాలు తీశాం. 1998లో రాజకీయంగా నా కెరీర్ మలుపు తిరిగింది. నా క్లాస్‌మేట్ అయిన చంద్రబాబునాయుడుగారు పిలిచి కల్చరల్ ప్రెసిడెంట్ పోస్ట్ ఇచ్చారు. ప్రచారంలో నూతన పంధాని సృష్టిస్తూ రాష్ట్రమంతటా తిరిగాను. దాంతో ఒక ఊపు పార్టీకి వచ్చింది. ఎలెక్షన్స్‌లో నాకు టిక్కెట్ ఇచ్చారు. ఎమ్మెల్యేగా గెలిచాను. ఫస్ట్ రోజే మా ఇంట్లో వుండి టీ.వి చూస్తున్నాను. క్రింద స్క్రోలింగ్‌లో ఇన్‌ఫర్మేషన్ అండ్ పబ్లిక్ రిలేషన్ కల్చరల్ మినిష్టర్ అని పేరు వచ్చింది. షాక్ అయి వెంటనే చంద్రబాబుగారికి ఫోన్ చేశాను. వన్ వీక్‌లో అఫీషియల్‌గా ఎనౌన్స్ చేశారు. అక్కడ నుండి సినిమాలు బ్రేక్ అయ్యాయి. మంత్రిగా, హైదరాబాద్ ఇంఛార్జి ఆఫీసర్‌గా వున్నాను.
2004లో మేమంతా ఓడిపోయాం. మా గవర్నమెంట్ రాలేదు. సి.ఎం.గారి దగ్గరే హైదరాబాద్‌లో వుంటూ రోజూ కలుస్తుండేవాళ్ళం. మంత్రిగా వున్నప్పుడు దాసరిగారు, అశ్వనీదత్, కోదండ రామిరెడ్డి అందరూ రెగ్యులర్‌గా టచ్‌లో వుండేవారు. ఆర్టిస్ట్ అనేవాడు ఖాళీగా వుండకూడదు. నీ కాన్‌స్టెన్సీ చూసుకుంటూనే సినిమాలు చెయ్యి అని బలవంతంగా అశ్వనీదత్‌గారు కారులో తీసుకెళ్ళారు. 'బాలు' చిత్రంలో ఎం.పి. క్యారెక్టర్ ఇచ్చారు. ఆ సినిమా బాగా పేరు తెచ్చింది. తర్వాత కృష్ణవంశీగారు ఫోన్ చేసి 'డేంజర్'లో అవకాశం ఇచ్చారు.
చాలా క్రూరత్వం వున్న విలన్ క్యారెక్టర్. ఆ సినిమాకి బెస్ట్ విలన్‌గా నంది అవార్డు వచ్చింది. ఆ సినిమా చూసి కీరవాణిగారు బాగా మెచ్చుకున్నారు. రీసెంట్‌గా చిరంజీవిగారు పార్లమెంట్‌లో కలిసి ఈ మధ్య 'డేంజర్' సినిమా చూశాను. చాలా భయపడిపోయాను. కళ్ళలో అంత విలనీ వుంది. బాగా పెర్‌ఫార్మ్ చేశావు అని కాంప్లిమెంట్ ఇచ్చారు. తర్వాత రవికుమార్ చౌదరి 'ఆటాడిస్తా'లో విలన్ క్యారెక్టర్ చేశాను. అందులో డిఫరెంట్ మేనరిజంతో చేశాను. అది బాగా పేరు తెచ్చింది. 'పిల్ల జమీందార్'లో చిన్న లాయర్ క్యారెక్టర్ చేశాను. అది చాలా బాగా పేరు వచ్చింది. కెరీర్ స్టార్టింగ్‌లో కమెడియన్‌గా, మధ్యలో కొన్ని క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా చేశాను. సెకండ్ ఇన్నింగ్స్‌లో విలన్‌గా చేశాను. 2005 నుండి 'అయ్యారే' సినిమా దాకా విలన్‌గా చేశాను.
పార్లమెంట్‌లో సమైఖ్యాంధ్ర కోసం రకరకాల వేషాలు వేస్తూ పోరాటం చేశాను. 2009 నుండి 2014లో ఎం.పి అయ్యాను. మళ్ళీ సినిమాలు చేయడం కుదరలేదు. అప్పుడు నా మనవడు నైన్త్ క్లాస్ నుండి షార్ట్ ఫిలింస్ తీస్తున్నాడు. ఇప్పుడు బిటెక్ చదువుతున్నాడు. ఒకరోజు సప్తగిరిని తీసుకొని వచ్చాడు. 'సప్తగిరి ఎక్స్‌ప్రెస్' సినిమాలో ఫాదర్ క్యారెక్టర్ చెయ్యాలి అని అడిగారు. నేను వున్న బిజీలో చేయలేను అని చెప్పాను. అయినా పట్టుబట్టి నాలో ఆ సినిమాలో మంచి వేషం చేయించారు. అది చాలా మంచి పేరు తీసుకొచ్చింది.
అప్పుడే నాకు నిర్మాత రవికిరణ్‌గారు పరిచయం అయ్యారు. ఆయన్ని క్లీన్‌గా అబ్జర్వ్ చేసినప్పుడు ఆయనలో నాకు రామానాయుడుగారు కన్పించారు. ఇది నా మనసుతో చెప్తున్నాను. సినిమాని సినిమాలా కాకుండా ప్యాషన్‌తో ఇష్టంతో మనసు పెట్టి తీస్తారు. విజయవాడలో డాక్టర్‌గా బిజీగా వుంటూనే ఇక్కడ హైదరాబాద్‌లో షూటింగ్ గురించి తెలుసుకుంటారు. ప్రతిది ఏం చెయ్యాలి? ఎలా చెయ్యాలి అన్నీ పర్‌ఫెక్ట్‌గా తెల్సిన వ్యక్తి. స్క్రిప్ట్‌లో పూర్తిగా ఇన్‌వాల్వ్ అవుతారు. ఆయన ప్రొఫెషన్‌ని, సినిమాని రెండింటినీ బేలెన్స్ చేసే కెపాసిటీ వున్న వ్యక్తి. రీసెంట్‌గా 'బాలకృష్ణుడు' చిత్రంలో యాక్ట్ చేశాను. టోటల్ నాటు చిత్తూరు స్లాంగ్‌లో ఆ క్యారెక్టర్ వుంటుంది.
'సప్తగిరి ఎల్.ఎల్.బి' చిత్రం చెయ్యాలి అని అడిగారు. హిందీలో 'జాలీ ఎల్.ఎల్.బి' చూశాను. అందులో ఒక పద్ధతిలో ఆయన యాక్ట్ చేశారు. సీనియర్ మోస్ట్ యాక్టర్ ఆయన. ఒక సీన్‌లో డిఫరెంట్ వే ఆఫ్ ఈటింగ్ వుంటుంది. అది మనకి నచ్చదు అని మార్చి చేశాం. భయం, భక్తి, శ్రద్ధలతో జడ్జి క్యారెక్టర్ చేశాను. సాయికుమార్‌కి 'ప్రేమతపస్సు' సినిమాలో రాజేంద్రప్రసాద్‌కి ఈక్వల్‌గా వుండే క్యారెక్టర్ ఇచ్చారు. అలాంటి సాయికుమార్ ఇప్పుడు నటుడిగా ఎంతో పెద్ద రేంజ్‌కి ఎదిగాడు. అతనితో పరిచయం వుంది. ఆయన టాలెంట్ గురించి భయమూ వుంది. వీళ్ళతో పోటీపడి చెయ్యాలి. ప్రతి సీన్ చేసేటప్పుడు అమ్మా, నాన్న, నటరాజుని తలుచుకుని భయపడుతూ జడ్జి క్యారెక్టర్ చేశాను. సప్తగిరి ప్రతిరోజు బాగా చెయ్యాలి అని ఎంకరేజ్ చేసేవాడు.
సప్తగిరి, సాయికుమార్, నేను ముగ్గురం పోటీపడి చేశాం. సినిమా చాలా బాగుంది అని అందరూ అప్రిషియేట్ చేస్తున్నారు. మా చిత్తూరు జిల్లాలో ప్రతి ఒక్కరూ సినిమాలు చెయ్యమని అంటున్నారు. ఫస్ట్ నేను కళాకారుడ్ని. సినిమా డ్రామా అంటే ఇష్టం. రాజకీయం నాకు ఎప్పుడూ సినిమా తర్వాతనే. కానీ రాజకీయానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తూ ప్రజా సేవ చేస్తాను. మంచి క్యారెక్టర్స్ చేసినప్పుడల్లా ప్రజలు ఆదరించి ఆశీర్వదిస్తున్నారు. ఇంకా చేయండి సార్ మా ఎం.పి. ఇంకా మంచి సినిమాలు చెయ్యాలి అని ఎంకరేజ్ చేస్తున్నారు. సప్తగిరి ఎల్.ఎల్.బి. చూసి చాలా ఉప్పొంగిపోతున్నాను. ఎక్కడెక్కడ నుండో నాకు ఫోన్లు వస్తున్నాయి. లాస్ట్ 45 మినిట్స్ సినిమాని ముగ్గురూ నిలబెట్టారు. ఇలాంటి సినిమాలు రావాలి అంటున్నారు.
అందరూ నన్ను రాజకీయం రాంగ్ సెలెక్షన్ అంటారు. కానీ నేను రాజకీయంలో కూడా నేను నెంబర్‌వన్‌గా వున్నాను. అది చాలా అదృష్టం. సినిమాల్లో డ్రీమ్స్ నెరవేరుతాయి. కానీ రాజకీయాల్లో డ్రీమ్స్ పనికిరావు. దేశంలో ఎలాంటి సమస్య జరుగుతోంది. ప్రజలంతా ఏ మూడ్‌లో వున్నారు. వారు ఆన్సర్ ఏమి కోరుకుంటున్నారు అని ఆలోచించి వారికి ఆన్సర్ చెప్తూ దానికి తగ్గ గెటప్‌లు వేశాను. దానికి రాష్ట్రమంతా మంచి అప్లాజ్ వచ్చింది. కందిమళ్ళ సాంబశివరావు, వారి టీమ్‌కి ఫోన్ చేసి సలహాలు తీసుకుంటున్నాను. వారి సహకారంతో కాన్సెప్ట్‌కి తగ్గట్టు గెటప్స్ వేస్తుంటాను.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout