'లవ్ స్టోరీ’ జోరుకి బ్రేక్ వేసిన వరుణ్ డాక్టర్.. ఇప్పుడిదే హాట్ టాపిక్..!!
Send us your feedback to audioarticles@vaarta.com
2019 చివరిలో ఎక్కడో చైనాలో పుట్టిన కరోనా వైరస్ మనిషిని నాలుగు గోడల మధ్య బందీని చేసింది. అడుగు తీసి అడుగు వేద్దామన్నా కుదిరేది కాదు, ఎదుటి మనిషి తుమ్మినా.. దగ్గినా అనుమానపు చూపులు. ఇలా గడిచిన ఏడాదిన్నరగా ప్రపంచం స్తంభించిపోయింది. కరోనా బారినపడని దేశం లేదంటూ అతిశయోక్తి కాదు. ముప్పు తొలగిపోయిందని భావించేలోపు కొత్త వేరియెంట్ల రూపంలో విరుచుకుపడుతోంది మహమ్మారి. ఇక కోవిడ్ వల్ల అన్ని రంగాలు తీవ్రంగా ప్రభావితమయ్యాయి. ఇందులో సినీరంగం కూడా ఒకటి. షూటింగ్‌లు నిలిచిపోవడం, పలువురు నటీనటులు కరోనాతో చనిపోవడం, థియేటర్ల మూసివేత వంటి కారణాలతో చిత్రపరిశ్రమ తీవ్ర ఒడిదుడుకులను ఎదుర్కొంటోంది. ప్రభుత్వం 50 శాతం ఆక్యూపెన్సీతో థియేటర్లు నడుపుకోవడానికి అనుమతి ఇచ్చినప్పటికీ ప్రజలు థైర్యం చేసి ముందుకు రావడం లేదు.
ఇలాంటి పరిస్ధితుల మధ్య విడుదలైన లవ్‌స్టోరీ సినిమా మరోసారి బాక్సాఫీసుకు కళ తీసుకొచ్చింది. అంతేకాదు కరోనా సెకండ్ వేవ్ తర్వాత భారతదేశంలో హైయెస్ట్ గ్రాసర్‌గా నిలిచిన సినిమా ఇదే కావడం విశేషం. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో అక్కినేని నాగచైతన్య, సాయిపల్లవి జంటగా తెరకెక్కిన లవ్ స్టోరికి భారీ ఓపెనింగ్స్ వచ్చాయి. తొలి వారాంతంలో పాతిక కోట్ల దాకా షేర్ రాబట్టిందీ చిత్రం. వీకెండ్ తర్వాత కొంచెం నెమ్మదించినా కూడా మొత్తం మీద రూ.35 కోట్ల దాకా షేర్ రాబట్టి ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యపరిచింది లవ్ స్టోరి. ఈ చిత్రం అలా సాఫీగా సాగిపోతుందని .. మరో పెద్ద చిత్రం వచ్చినా ఏం కాదని పరిశ్రమ వర్గాలు భావించాయి. కానీ.. ఆశ్చర్యకరంగా ఓ తమిళ డబ్బింగ్ చిత్రం లవ్‌స్టోరీకి గట్టిపోటీనిచ్చింది.
అదే శివ కార్తికేయన్ హీరోగా నటించిన ‘‘ వరుణ్ డాక్టర్’’ .. తొలుత ఈ చిత్రాన్ని తెలుగు జనాలు పట్టించుకోలేదు కానీ.. మంచి రివ్యూలు రావడం, మౌత్ పబ్లిసిటీతో తెలుగువాళ్లు బాగానే చూశారు. కిడ్నాపింగ్ క్రైమ్ కామెడీ నేపథ్యంలో సాగే ఈ సినిమా ప్రేక్షకులకు మంచి వినోదాన్నే అందిస్తోంది. తద్వారా బిజినెస్ ఊపందుకుని మంచి లాభాలే తెచ్చిపెట్టింది వరుణ్ డాక్టర్. కరోనా ప్రభావం మొదలయ్యాక సంక్రాంతికి విడుదలైన ఇళయ దళపతి విజయ్ నటించిన ‘‘ మాస్టర్ ’’ కాకుండా మరే చిత్రం ఈ స్థాయిలో బాక్సాఫీస్ దగ్గర సందడి చేయలేదు. ఇప్పటి వరకు అందుతున్న సమాచారాన్ని బట్టి... తమిళంలో వరుణ్ డాక్టర్ రూ.50 కోట్ల గ్రాస్ మార్కును దాటేసింది. ఈ చిత్రానికి నెల్సన్ దర్శకత్వం వహించారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments