టీవీ9 వివాదం: మరో షాకింగ్ ‘గరుడ పురాణం’ చెప్పిన శివాజీ!
Send us your feedback to audioarticles@vaarta.com
టీవీ9 షేర్ల వివాదంలో ఈ చానెల్ మాజీ సీఈవో.. రవిప్రకాష్, గరుడ పురాణం శివాజీ ఇద్దరూ పరారీలో ఉన్న విషయం విదితమే.. వారి కోసం పోలీసులు వేట సాగిస్తున్నారు. తాజాగా ఆ ఇద్దరికీ లుక్ అవుట్ నోటీసులు జారీ చేయడం జరిగింది. అయితే ఈ వ్యవహారంపై ఎట్టకేలకు గరుడ పురాణం శివాజీ ఓ వీడియో రూపంలో క్లారిటీ ఇచ్చాడు.
శివాజీ ఎక్కడికీ పారిపోలేదని.. శివాజీ వెన్నుచూపే వ్యక్తి కానేకాదని ఆ వీడియోలో చెప్పుకొచ్చాడు. శివాజీ పారిపోయాడని ప్రచారం చేసే మీడియాలోని ఓ వర్గం కోసం ఈ వీడియో రూపొందించలేదని, తన బాణీ వినిపించడానికే రూపొందించినట్లు తెలిపాడు. అంతేకాదు ఇది వరకటి లాగే ఆపరేషన్ గరుడు, ఆపరేషన్ పెరుగువడ లాగే తాజాగా టీవీ9 వివాదంలోనూ ఓ గరుడ పురాణాన్ని శివాజీ చెప్పడం గమనార్హం.
అసలు విషయం ఇదీ..
"ఇది రవిప్రకాశ్‌కు నాకూ మధ్య ఉన్న విషయం.. షేర్ల విషయంలో ఉన్న పంచాయితీ ఇది. ఈ సివిల్ పంచాయితీని కాస్తా క్రిమినల్ వ్యవహారంగా మార్చడానికి మధ్యలో ఈమెయిల్స్ తీసుకొచ్చారు. డిలీట్ చేసిన ఈమెయిల్స్ రికవర్ చేసినవాళ్లకు అందులో లేని పదాలను యాడ్ చేయడం పెద్ద విషయమేమీ కాదు. ఇదో కుట్ర.. 2018 ఫిబ్రవరిలో నాకూ రవిప్రకాశ్‌కు మధ్య అగ్రిమెంట్ జరిగింది. అదే ఒప్పందాన్ని ఇటీవలే తిరగరాసుకున్నాం. ఇది సాధారణమైన విషయమే. సంస్థలోకి కొత్త వ్యక్తులు వస్తున్నప్పుడు నా ప్రయోజనాలను కాపాడుకునేందుకు నేను ఆ మాత్రం జాగ్రత్తలు తీసుకోవడంలో తప్పులేదు" అని శివాజీ చెప్పుకొచ్చాడు.
కౌశిక్ రావు ఎవరు!?
"ఈ విషయంలో ఏదో జరిగిపోతోందని చెబుతూ కౌశిక్ రావు అనే వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశాడు.. మా ఒప్పందంలో జోక్యం చేసుకోడానికి కౌశిక్‌రావు ఎవరు?. కౌశిక్‌రావు ఫిర్యాదుతో తెలంగాణ పోలీసులు మా ఇంటిపై దాడి చేసి నానా హంగామా చేశారు. మా ఇంటి మీద పడిపోయి మావాళ్లందరినీ సోఫాల్లో కూర్చోబెట్టి ఇల్లంతా వెదికి ఏమీ దొరకలేదని సంతకం పెట్టించుకుని వెళ్లిపోవడం.. ఏమిటిదంతా!. చివరికి సోదాలు చేసి ఏమీ దొరకలేదు. నా భార్యతో సంతకం చేయించుకొని వెళ్లిపోయారు. మేం సెటిలర్లం కాబట్టి, మాకు స్థానబలం లేదని మాపై హైదరాబాదు పోలీసులు కేసులు పెట్టి లోపల వేసేస్తారా?" అని శివాజీ ఏదో పురాణం చెప్పుకొచ్చాడు.
మరో గరుడ పురాణం.. !
"భయపడి పారిపోవడానికి ఇదేమైనా పెద్ద కేసా? ఇలాంటి కేసులు 100 వేసుకున్నా ధైర్యంగా ఎదుర్కొంటాను. నేను అనారోగ్యం (సన్ స్ట్రోక్) కారణంగానే విశ్రాంతి తీసుకుంటున్నాను.. అంతే తప్ప ఎక్కడికీ పారిపోలేదు. ఈ కొన్నిరోజుల వ్యవధిలోనే నేను తిరుపతి వెళ్లాను. ఓ ఆస్తి రిజిస్ట్రేషన్ కూడా చేయించుకున్నాను. రెండేళ్లుగా తెలంగాణ ప్రభుత్వం నాపై పగ పట్టింది. ఇందులో కొంతమంది ఆంధ్రా నాయకులు కూడా ఉన్నారు. నేను హైదరాబాద్‌లో సెటిలర్‌నని, స్థానబలం లేదని అనుకుంటున్నారన్నారు. నాపై వంద కేసులు కాదు.. వెయ్యి పెట్టుకున్న భయమేమీలేదు. ఇవన్నీ సిల్లీ కేసులు.
ఆయన అడిగితే మొత్తం చెబుతా!
"టైమ్ వచ్చింది కాబట్టి ఏమైనా చేస్తారని తేలిగ్గా తీసుకున్నారు. నాపై రాళ్లు విసిరితే అవి మీకే తగులుతాయి. మై హోమ్ అధినేత రామేశ్వరరావు నాకు బాగా తెలుసు. ఆయన పిలిచి అడిగితే అన్నీ చెప్పేవాడ్ని.. నేనెక్కడికి పారిపోలేదు. సన్‌స్ట్రోక్ తగిలి రెస్ట్ తీసుకుంటున్నాను. కుట్రలో భాగంగానే నన్ను ఇరికించారని.. అనవసరంగా నాపై టీవీల్లో డిబేట్లు పెట్టొద్దు. నిజాయితీగా బయటికి వస్తానని.. నాలుగు రోజుల తర్వాత పోలీసుల దగ్గరకు వెళ్తాను" అని శివాజీ పురాణం పూర్తి చేశాడు.
సో.. శివాజీ పోలీసులు ఎదుట హాజరైతే పరిస్థితి ఏంటి..? విచారణలో ఏం చెప్పబోతున్నాడు..? మళ్లీ బోర్డు, స్కెచ్ తీసుకొని పురాణం చెబుతారా..? లేకుంటే జరిగింది జరిగినట్లు.. చెప్పేస్తాడా..? అనేదానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Bala Vignesh
Contact at support@indiaglitz.com